హైదరాబాద్‌కు 48 రోజులే నీళ్లు అందించగలరా?

KTR Reply To Director Maruthi Over Water Supply To Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రముఖ దర్శకుడు మారుతి అడిగిన ఓ ప్రశ్నకు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ట్విటర్‌ వేదికగా సమాధానమిచ్చారు. హైదరాబాద్‌ నగరాన్ని తాగునీటి కష్టాలు వెంటాడనున్నాయా అని మారుతి అడగ్గా అలాంటేదేమీ జరగదని కేటీఆర్‌ స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజక్టు ద్వారా నగరానికి కావాల్సినంత నీరు అందుబాటులో ఉండనుందని పేర్కొన్నారు. వివరాల్లోకి వెళ్తే.. కేటీఆర్‌ బుధవారం ఉదయం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ట్విటర్‌లో పలు అంశాలను ప్రస్తావించారు. కాళేశ్వరం జలాలతో హైదరాబాద్‌ నీటి అవసరాలు కూడా తీరతాయని పేర్కొన్నారు. అయితే ఈ ట్వీట్‌కు రిప్లైగా మారుతి ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ప్రస్తావించారు. హైదరాబాద్‌కు కేవలం 48 రోజులకు సరిపడే తాగునీరు మాత్రమే అందుబాటులో ఉందా అని కేటీఆర్‌ను ప్రశ్నించారు.

దీనిపై స్పందించిన కేటీఆర్‌.. ‘ఆ రిపోర్ట్‌ కచ్చితమైనది కాదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రాణహిత నుంచి నీరు ఎత్తిపోయడం ప్రారంభమైంది. కొద్ది వారాల్లోనే నీరు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చేరుకోనుంది. దీంతో హైదరాబాద్‌కు 175 ఎంజీడీల నీరు అందనుంది. అందువల్ల తాగునీటి సమస్య అనేది చోటుచేసుకోదు. అలాగే నీటి పొదుపుకు సంబంధించిన ప్రాధాన్యతను కూడా నగరవాసులు గుర్తించార’ని  సమాధానమిచ్చారు. అనంతరం మారుతి శుభావార్త చెప్పారంటూ కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. 

ఇది ప్రారంభం మాత్రమే..
అంతకుముందు ట్వీట్‌లో.. ‘ ఇంత తక్కువ వర్షాలు పడుతున్న కాలంలో, గోదావరికి ఏ మాత్రం వరద రాకున్న కూడా.. ప్రాణహిత నదిలో వస్తున్న వరదనీటిని 10 రోజుల్లో 5 మోటార్ల ద్వారా ఎత్తిపోసి 11 టీఎంసీలు ఒడిసిపట్టాం. గోదావరిలో తక్కువ వరద ఉన్నప్పుడే 11 టీఎంసీలు నిల్వచేయడం జరిగింది. ఈ నీటితో కనీసం లక్షన్నర ఎకరాలకు నీరు ఇవ్వొచ్చు. ఇది ప్రారంభం మాత్రమే.. వర్షాలు పడి, వరద పెరిగితే అన్ని మోటార్లు మొదలవుతాయి. అన్ని మోటార్లు ప్రారంభమైతే తెలంగాణలో బీడు భూములు సస్యశ్యామలం కానున్నాయి. సీఎం కేసీఆర్ దార్శనికత వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లలోనే సాకారమైంది. ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి కావడం వల్ల తెలంగాణకు చేకూరిన లబ్ధి ఇది. కాళేశ్వరం జలాలతో హైదరాబాద్ నీటి అవసరాలు కూడా తీరుతాయి. చెన్నై కానీ, ఇతర మెట్రోపాలిటన్‌ ప్రాంతాల్లో మాదిరి నీటి కష్టాలు హైదరాబాద్‌కు ఎప్పుడూ రాకుండా చూసుకోవచ్చ'ని కేటీఆర్ పేర్కొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top