కాళేశ్వరంతో రైతులకు మేలు 

It is good for farmers with Kaleshwaram - Sakshi

15వ ఆర్థిక సంఘం సభ్యులు అశోక్‌ లహరి, రీటా లహరి 

మేడిగడ్డ బ్యారేజీ, మేడారం అండర్‌ టన్నెల్‌ పనుల పరిశీలన  

కాళేశ్వరం/ధర్మారం(ధర్మపురి)/సిరిసిల్ల: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతులకు మేలు జరుగుతుందని కేంద్ర 15వ ఆర్థిక సంఘం సభ్యులు అశోక్‌ లహరి, రీటా లహరి అన్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆర్థిక సంఘం సభ్యులు ఆదివారం కాళేశ్వరం ప్రాజెక్టు కింద పలు ప్రాంతాల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఆర్థిక సంఘం సభ్యులు మొదట హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మేడిగడ్డకు చేరుకుని బ్యారేజీ పనులను పరిశీలించారు. అనంతరం చీఫ్‌ ఇంజనీర్‌ నల్ల వెంకటేశ్వర్లు ప్రాజెక్టు పురోగతిని ఫొటో ఎగ్జిబిట్‌ ద్వారా వారికి వివరించారు. 80 శాతం వరకు పనులు పూర్తయినట్లు పేర్కొన్నారు. ఆర్థిక సంఘం సభ్యులు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమని, త్వరగా నిర్మించి రైతులకు సాగు నీటిని అందించాలని అన్నారు. ప్రాజెక్టుకు ఆర్థిక సంఘం తోడ్పాటు అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి కోరారు.  

ప్రాజెక్టుల నిర్మాణం భేష్‌! 
తెలంగాణ ప్రభుత్వం తక్కువ సమయంలో భారీ నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేస్తోందని సభ్యులు ప్రశంసించారు. కాళేశ్వరంలో భాగంగా ఎల్లంపల్లి నుంచి మేడారం రిజర్వాయర్‌కు నీటిని తరలించేందుకు ప్యాకేజీ 6 కింద పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మేడారం వద్ద నిర్మిస్తున్న అండర్‌ టన్నెల్‌ పనులను పరిశీలించారు. 6వ ప్యాకేజీలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్, పంప్‌హౌస్, సర్జిపూల్‌ పనుల గురించి తెలుసుకున్నారు. గోదావరిలో రాష్ట్రానికి ఉన్న కేటాయింపులనుంచి ప్రతిరోజు 2 టీఎంసీల నీరు ఎత్తిపోసి 18.5 లక్షల ఎకరాల నూతన ఆయకట్టు, 18 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో కలిపి మొత్తం 36 లక్షల ఎకరాలకు సాగు నీరిందిస్తామన్నారు. హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు, పారిశ్రామిక అవసరాలకు, కాలువలు ప్రవహించే దారిలోని గ్రామాల తాగునీటి అవసరాలను సైతం తీర్చే బృహత్తర పథకం కాళేశ్వరం ప్రాజెక్టు అని వివరించారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా 6వ ప్యాకేజీ పనులను రూ.5,046 కోట్లతో ప్రారంభించి ఇప్పటి వరకు 95 శాతం పూర్తి చేశామని వెల్లడించారు. జూన్‌ నెలాఖరులోగా వందశాతం పనులు పూర్తిచేస్తామన్నారు.  భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని 3 టీఎంసీలను తరలించటానికి అవసరమైన సివిల్‌ పనులు చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాగు, సాగునీటికి ప్రాధాన్యం కల్పిస్తూ, మత్స్య పరిశ్రమ, టూరిజం పెరిగేలా తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు.  

మిషన్‌ భగీరథ పనుల పరిశీలన: రాష్ట్రంలో చేపట్టిన మిషన్‌ భగీరథ పథకం బాగుందని వారు కితాబిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ అగ్రహారం వద్ద చేపట్టిన మిషన్‌ భగీరథ వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ను ఆదివారం వారు సందర్శించారు. రాష్ట్రంలో 1.3 లక్షల కిలోమీటర్ల పైపులైన్‌ను భగీరథలో ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. ఈ కార్యక్రమాల్లో 15వ ఆర్థిక సంఘం సభ్యులు అరవింద్‌ మెహతా, రవి కోట, ఆంటోని ఫిరాయిక్, సీఎస్‌ ఎస్‌కే జోషీ, రాష్ట్ర ఆర్థిక సంఘం కార్యదర్శి రామకృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు జీఆర్‌ రెడ్డి, ఆయా జిల్లాల కలెక్టర్లు, మిషన్‌ భగీరథ సీఈ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.
శంషాబాద్‌లో స్వాగతం: రాష్ట్ర పర్యటనకోసం వచ్చిన 15వ ఆర్థిక సంఘం సభ్యులకు ఆదివారం ఉదయం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ప్రభుత్వ ఆర్థిక సలహాదారు జీఆర్‌ రెడ్డి, సీఎస్‌ ఎస్‌.కె.జోషి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు స్వాగతం పలికారు. ఆర్థిక సంఘం సభ్యులు ఈనెల 20 వరకు రాష్ట్రంలో పర్యటిస్తారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top