'హార్టీ'సీ!

Hyderabad People Suffering With TSRTC Routes Changes - Sakshi

ఆదాయం పేరిట అసంబద్ధ నిర్ణయాలు

సామాన్యులకు తప్పని రవాణా కష్టాలు

పైసలొచ్చే రూట్లలోనే ఆర్టీసీ బస్సులు

ఉదయం, మధ్యాహ్నం, రాత్రిపూట ట్రిప్పుల్లో భారీ కోత

గ్రేటర్‌లో సుమారు 6 వేలకుపైగా ట్రిప్పుల రద్దు

ఆదాయం లేదంటూ అకస్మాత్తుగా వందల రూట్లలో ఆర్టీసీ సర్వీసుల్ని రద్దు చేశారు. సామాన్యుల కష్టాలు పరిగణనలోకి తీసుకోకుండా ఇష్టారాజ్యంగా బస్సులురద్దు చేయడంతో గత వారం పది రోజులుగాప్రయాణికులు నానా పాట్లు పడుతున్నారు. ముఖ్యంగా నిరుపేద కూలీలు, చిరు వ్యాపారులు, విద్యార్థులు, చిరుద్యోగులు ఆర్టీసీ బస్సులు రాక..ఎక్కువ చార్జీలు చెల్లించి మెట్రో రైలు, క్యాబ్‌లు, ఆటోలు ఎక్కలేక సతమతమవుతున్నారు. ముఖ్యంగా ఉదయం, మధ్యాహ్నం, రాత్రిపూట దాదాపు 6 వేల ట్రిప్పులు రద్దు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ‘సాక్షి’ మంగళవారంపరిశీలన జరపగా...సామాన్య ప్రయాణికుల వెతలెన్నో వెలుగుచూశాయి. ఇప్పటికైనా అధికారులు పునరాలోచన చేసి ట్రిప్పుల సంఖ్య పెంచాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.

సాక్షి,సిటీబ్యూరో/నెట్‌వర్క్‌: తెల్లవారుజామున 5 గంటలకు మేడిపల్లి నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లే బస్సును రద్దు చేశారు. ఆ సమయంలో చెంగిచర్ల, మేడిపల్లి, బోడుప్పల్, ఉప్పల్‌ నుంచి  సికింద్రాబాద్‌కు వెళ్లే  ప్రయాణికులకు ఇప్పుడు సిటీ బస్సు సదుపాయం లేదు. సికింద్రాబాద్‌ నుంచి నాంపల్లి మీదుగా మెహిదీపట్నం వరకు నడిచే (49ఎం) బస్సు కూడా రద్దయింది. సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి అడ్డగుట్ట, మహేంద్ర హిల్స్, గౌతమ్‌నగర్‌ తదితర ప్రాంతాల మీదుగా తిరిగి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకొనే (సికింద్రాబాద్‌– సికింద్రాబాద్‌ 38 ఈఎక్స్‌) బస్సును ఆదాయం రావడం లేదనే కారణంతో రద్దు చేశారు. దీంతో ఉదయాన్నే సికింద్రాబాద్‌కు చేరుకొనే కూలీలు, చిరువ్యాపారులు ఇబ్బందులను ఎదుర్కోవాల్సివస్తోంది. కేవలం ఉదయం పూట మాత్రమే కాదు. రాత్రి వేళల్లోనూ ఇప్పుడు బస్సులు అందుబాటులో ఉండడం లేదు. సికింద్రాబాద్‌ నుంచి కోఠి మీదుగా శాలిబండకు వెళ్లే (8ఏ), సికింద్రాబాద్‌– బోయిన్‌పల్లి (26ఎన్‌), తదితర రూట్‌లలోనూ ట్రిప్పుల సంఖ్యను తగ్గించారు.

చిలుకానగర్, హేమానగర్, ఉప్పల్, తార్నాక మీదుగా నాంపల్లికి వెళ్లే (136), హేమానగర్‌– కోఠికి రాకపోకలు సాగించే (3ఎన్‌) రూట్‌లోనూ ఉదయం, రాత్రి బస్సుల సంఖ్యను తగ్గించారు. కేవలం ఈ రూట్‌లలోనే కాదు నగరంలోని 1100కుపైగా రూట్‌లలో ట్రిప్పుల రద్దుకు ఆర్టీసీ భారీ కసరత్తు చేపట్టింది. ఇప్పటికే పలు డిపోల్లో 100 నుంచి 200కుపైగా ట్రిప్పులను రద్దు చేశారు. మరిన్ని డిపోల్లో ట్రిప్పుల రద్దుపైన ప్రణాళికలను రూపొందిస్తోంది. త్వరలో గ్రేటర్‌ హైదరాబాద్‌లోని 29 డిపోల పరిధిలో సుమారు 6వేలకుపైగా ట్రిప్పులు రద్దు కానున్నట్లు అంచనా. అతితక్కువ మంది ఉన్న మార్గాల్లోనే బస్సులను రద్దు చేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నప్పటికీ ఉదయం, రాత్రి వేళల్లో బస్సులు రద్దు కావడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సికింద్రాబాద్‌ నుంచి అఫ్జల్‌గంజ్‌ వరకుఉదయం 4 నుంచి రాత్రి  11.30 గంటల వరకు రద్దీ ఉంటుంది. సికింద్రాబాద్‌– అఫ్జల్‌గంజ్‌ మధ్య బస్సులు ప్రయాణికుల రద్దీకిఅనుగుణంగా ఉన్నాయి. కానీ సికింద్రాబాద్‌ నుంచి రీసాలాబజార్‌కు, అఫ్జల్‌గంజ్‌ నుంచి చాంద్రాయణగుట్ట వరకు నడిచే బస్సులను తగ్గించారు. 

పలు డిపోల్లో ట్రిప్పుల రద్దు ఇలా..
కుషాయిగూడ డిపోలో 240 ట్రిప్పులు రద్దు చేశారు. కుషాయిగూడ నుంచి అఫ్జల్‌గంజ్‌ (3కే) ఏకంగా రూట్‌లో 16 ట్రిప్పులు రద్దయ్యాయి. దీంతో ఈ రూట్‌లో  దీంతో కుషాయిగూడ, ఈసీఐఎల్, హబ్సిగూడ మీదుగా కోఠికి వెళ్లే ప్రయాణికులు కుషాయిగూడ నుంచి ఈసీఐఎల్‌ మీదుగా సికింద్రాబాద్‌కు వచ్చి అక్కడి నుంచి కోఠికి వెళ్లాల్సివస్తోంది. లేదా సెవెన్‌ సీటర్‌ ఆటోలు, షేరింగ్‌ ఆటోలను
ఆశ్రయిస్తున్నారు.  
16సీ రూట్‌లో రెండు ట్రిప్పులు, 16ఏ రూట్‌లో మరో 2 ట్రిప్పులను రద్దు చేశారు. 16ఏకే  రూట్‌లో 3 ట్రిప్పులు రద్దయ్యాయి.  
24ఎస్‌ రూట్‌లో 4 బస్సులను రెండింటికి తగ్గించారు.  
17ఎస్‌ రూట్‌లో తిరిగే 10 బస్సులలో 5 తగ్గాయి. 117 రూట్‌లో 2 బస్సులను కుదించారు.  
కుషాయిగూడ నుంచి అఫ్జల్‌గంజ్‌కు ఉదయం 4:30 గంటలకు వెళ్లే బస్సు ప్రస్తుతం ఉదయం 6 గంటలకు బయలుదేరుతుంది.  
ఉప్పల్‌  డిపోలో మొత్తం 150 బస్సులు ఉన్నాయి. 1,553 ట్రిప్పులు నడుస్తాయి. ఇందులో 168 ట్రిప్పులు రద్దు చేశారు.
ఉప్పల్‌– కోఠి (115 రూట్‌), ఉప్పల్‌– మెహిదీపట్నం (113 ఎం), ఉప్పల్‌– కూకట్‌పల్లి, ఉప్పల్‌–వేవ్‌రాక్, ఉప్పల్‌–కొండాపూర్‌ తదితర రూట్‌లలో ట్రిప్పులను రద్దు చేసినట్లు డిపో మేనేజర్‌ వెంకారెడ్డి తెలిపారు.  హయత్‌నగర్‌– 1, 2 డిపోలలో 30 ట్రిప్పులు రద్దు చేశారు. త్వరలో మరిన్ని ట్రిప్పులను రద్దు చేసే దిశగా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.  
కంటోన్మెంట్‌ డిపోలో మొత్తం 137 బస్సులు ఉండగా, సుమారు 30 బస్సుల వరకు తగ్గించేందుకు చర్యలు చేపట్టనున్నారు.   
కాచిగూడ డిపో పరిధిలో 27 సర్వీసులను రద్దు చేశారు. అందులో ఉదయం 3:30 గంటలకు బయలుదేరే బస్సులన్నింటినీ గంట ఆలస్యంగా ఉదయం 4:30 గంటలకు నడుపుతున్నారు. ప్రతి రోజు కనీసం 50 ట్రిప్పులు రద్దు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు డీఎం శ్రీనివాస్‌తెలిపారు.  
బర్కత్‌పురా డిపో పరిధిలో ప్రస్తుతం 7 బస్సు సర్వీసులను నిలిపివేశారు.  
కూకట్‌పల్లి  డిపో పరిధిలో 12 బస్సులు, 18 సర్వీసులను రద్దు చేశారు. జగద్గిరిగుట్ట నుంచి 10కె, 19కె, 158 రూట్లలో కొన్ని సర్వీసులను తగ్గించినట్లు డిపో సిబ్బంది చెప్పారు.

డిపోలకే పరిమితమైన  500 బస్సులు..
ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌లో ప్రస్తుతం 3,550 బస్సులు  ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. ట్రిప్పుల రద్దుతో ఇప్పటికే 500 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దశలవారీగా  మరిన్ని బస్సులను తగ్గించనున్నారు. లాభాలు లేని రూట్‌లలో బస్సుల సంఖ్యను తగ్గించి లాభాలు వచ్చే మార్గాల్లో  పెంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో  ఆక్యుపెన్సీ సైతం 72 శాతం వరకు పెరుగుతుందని అంచనా. ప్రస్తుతం కి.మీపై రూ.16 చొప్పున రోజుకు  సుమారు రూ.96 లక్షల నష్టాలను చవిచూస్తోంది. ఆదాయం లేని మార్గాల్లో, సమయాల్లో బస్సులు నడపడంతోనే ఈ పరిస్థితి నెలకొందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. దీంతో ఉదయం 4 నుంచి 6 గంటల వరకు, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు రాత్రి 10 నుంచి 11 గంటల వరకు పలు రూట్‌లలో బస్సుల సంఖ్యను తగ్గిస్తున్నారు.

బస్సుల్ని తగ్గిస్తున్నారు.. 
డిపోలవారీగా బస్సులను తగ్గిస్తున్నట్లు సమాచారం ఉంది. ప్రతి డిపోలో పది నుంచి 50 వరకు బస్సులను తగ్గిస్తున్నారు. కార్గోకు ఈ బస్సులను వాడే ఆలోచన ఉన్నట్లు తెలిసింది. ఈ విధానంతో కార్మికులు తీవ్రంగా నష్టపోతారు. డ్యూటీలు లేక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. రవాణా వ్యవస్థ పూర్తిగా ఛిన్నాభిన్నమవుతుంది. – నగేష్‌ పటేల్,    డ్రైవర్, కంటోన్మెంట్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top