
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ (ఫైల్ ఫోటో)
తెలంగాణలో ఎన్నికల హంగామా షురూ..
సాక్షి, హైదరాబాద్ : ముందస్తు ఎన్నికల నిర్వహణ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఎన్నికల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులు, అవసరాలపై 31 జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమావేశమైంది. ఈవీఎంల పనితీరు, సిబ్బంది అవసరాలు, శాంతిభద్రతల సమస్యలపై సమీక్ష చేపట్టారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిషోర్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో రాష్ట్రంలో మొదటిసారి వీవీపీఏటీ ప్రవేశపెడుతున్న క్రమంలో వాటిపై కలెక్టర్లకు అవగాహన కల్పించారు.
ఢిల్లీకి రజత్ కుమార్
అసెంబ్లీ రద్దు నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. అసెంబ్లీ రద్దైన క్రమంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్‌కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. రాష్ట్ర శాసనసభ ఎన్నికల నిర్వహణపై రజత్ కుమార్‌తో సీఈసీ చర్చించనుంది. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం పిలుపు మేరకు రజత్ కుమార్ శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు.