అబ్దుల్లాపూర్‌మెట్ ఘటన; మరో ఇద్దరికి సీరియస్‌

Abdullapurmet Tahsildar Murder: Driver, Attender Condition Serious - Sakshi

సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్‌ విజయారెడ్డి సజీవ దహన ఘటనలో మరో ముగ్గురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. విజయారెడ్డిని కాపాడేందుకు ప్రయత్నించి తీవ్రంగా గాయపడిన ఆమె డ్రైవర్‌ గురునాథ్, అటెండర్ చంద్రయ్య ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. కవాడిపల్లి వాసి బొడిగా నారాయణ గౌడ్‌ అనే వృద్ధుడు కూడా గాయపడ్డాడు. తన భూమి సమస్య పరిష్కారం కోసం ఎమ్మార్వో కార్యాలయానికి వచ్చి గాయాలపాలైన ఆయన ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు కూర సురేశ్‌కు ఉస్మానియా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అతడికి 60 శాతం వరకు కాలిన గాయాలయ్యాయి.

రేపు విజయారెడ్డి అంత్యక్రియలు
విజయారెడ్డి మృతదేహానికి ఉస్మానియా ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం పూర్తి చేశారు. ఆమె మృతదేహాన్ని నల్గొండ జిల్లా కల్వలపల్లి గ్రామానికి తీసుకెళ్లారు. రేపు విజయా రెడ్డి స్వగ్రామంలోనే అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు బంధువులు తెలిపారు.

న్యాయం జరిగేలా చూస్తాం: డీజీపీ
ఎమ్మార్వో విజయారెడ్డి హత్యను డీజీపీ మహేందర్ రెడ్డి ఖండించారు. ఇటువంటి ఘటనలకు పాల్పడితే సహించబోమని హెచ్చరించారు. నిందితుడు సురేశ్‌కు తక్కువ సమయంలోనే శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని, ఎమ్మార్వో కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేలా చూస్తామని పేర్కొన్నారు.

ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉద్యోగులకు రక్షణ కల్పించాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ డిమాండ్‌ చేసింది. ప్రభుత్వపరంగా విధులు నిర్వహించే అధికారులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొంది. ప్రజలకు రక్షణ కల్పించే ఒక ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ పై ఇలాంటి సంఘటన జరగటం దురదృష్టకరమని.. నిందితుడిని కఠినంగా శిక్షించి ప్రభుత్వ అధికారులకు, ఉద్యోగులకు తగిన రక్షణ కల్పించాలని కోరింది. విజయారెడ్డి కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

సంబంధిత వార్తలు

తహశీల్దార్‌ సజీవ దహనం; పాపం పిల్లలు

తహశీల్దార్‌ సజీవ దహనం; అసలేం జరిగింది?

తహశీల్దార్‌పై కిరోసిన్‌ పోసి నిప్పంటిన దుండుగుడు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top