తహశీల్దార్‌ సజీవ దహనం; పాపం పిల్లలు

Abdullapurmet Tahsildar murder Case: Family Members Shocked - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్‌ విజయారెడ్డి దారుణ హత్యతో కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో కార్యాలయానికి వెళ్లి దారుణంగా హత్య చేయడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. విజయారెడ్డి చాలా నిజాయితీగా పనిచేసేదని ఆమె మేనమామ తెలిపారు. సమయపాలన, క్రమశిక్షణ కలిగివుండేదని వెల్లడించారు. అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఉత్తమ ఎమ్మార్వోగా ఎంపికై గతేడాది కలెక్టర్‌ నుంచి ప్రశంసాపత్రం కూడా అందుకుందని చెప్పారు. ప్రభుత్వ టీచర్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి గ్రూప్‌-2 రాసి ఆమె ఎమ్మార్వోగా ఉద్యోగంలో చేరినట్టు తెలిపారు. విజయారెడ్డికి ఇద్దరు చిన్నపిల్లలు.. అమ్మాయి(10), అబ్బాయి(5) ఉన్నారన్నారు. తల్లి మరణంతో పిల్లలు కన్నీరుమున్నీరవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయారెడ్డి తండ్రి లింగారెడ్డి ప్రస్తుతం హైదరాబాద్‌లోని మూసి రోడ్డులో ఉంటున్నారని.. కూతురు మరణాన్ని తట్టుకోలేక తన బావ, సోదరి శోకిస్తున్నారని కంటతడి పెట్టారు. విజయారెడ్డి సోదరుడు పదేళ్ల క్రితం చనిపోయాడని చెప్పారు. విజయారెడ్డి సోదరి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన
విజయారెడ్డి హత్యకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన తెలుపుతున్నారు. భువనగిరి ఎమ్మార్వో కార్యాలయంలో ఉద్యోగులు పెన్‌డౌన్‌ చేసి, బైఠాయింపు జరిపారు. ఆలేరు డిప్యూటీ తహశీల్దార్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వీఆర్‌వోలు, రెవెన్యూ సిబ్బంది నిరసన తెలిపారు. రెవెన్యూ అధికారులకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఖమ్మం కలెక్టరేట్‌ ఉద్యోగులు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, దమ్మపేట మండలాల తహసీల్దార్ కార్యాలయాలలో రెవెన్యూ సిబ్బంది విధులను బహిష్కరించారు. సంగారెడ్డి, దుబ్బాక, ఆందోల్‌ తహశీల్దార్ కార్యాలయాల్లోనూ సిబ్బంది విధులు బహిష్కరించి నిరసన తెలిపారు.

హైద‌రాబాద్ త‌ర‌లిరండి
ఉస్మానియా ఆసుప‌త్రిలో ఉన్న విజయారెడ్డి భౌతికకాయానికి నివాళి అర్పించేందుకు అన్ని కేడర్ల రెవెన్యూ ఉద్యోగులు హైద‌రాబాద్ తరలిరావాలని డిప్యూటీ క‌లెక్ట‌ర్స్ అసోసియేష‌న్ అధ్యక్షుడు వి.ల‌చ్చిరెడ్డి, త‌హ‌శీల్దార్స్ అసోసియేష‌న్‌ అధ్యక్షుడు ఎస్‌. రాములు పిలుపునిచ్చారు. అబ్దుల్లాపూర్‌మెట్ త‌హ‌శీల్దార్ విజ‌యారెడ్డి హ‌త్య అత్యంత దారుణ‌, విషాద‌క‌ర సంఘ‌ట‌న‌గా వీరు పేర్కొన్నారు. (ప్రాథమిక వార్త: తహశీల్దార్‌ సజీవ దహనం; అసలేం జరిగింది?)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top