తహశీల్దార్‌ సజీవ దహనం; అసలేం జరిగింది?

Abdullapurmet Tahsildar murder Case: Accused Arrested - Sakshi

సాక్షి, హయత్‌నగర్‌: తెలంగాణలో సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్‌ హత్య కేసులో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తహశీల్దార్‌ విజయారెడ్డిని సజీవ దహనం చేసిన వ్యక్తిని కూర సురేశ్‌ ముదిరాజ్‌గా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడు హయత్‌నగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడు ఎందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడనే దానిపై పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో తహశీల్దార్‌ కార్యాలయానికి సురేశ్‌ వచ్చాడు. తహశీల్దార్‌తో మాట్లాడాలంటూ పర్మిషన్‌ తీసుకుని విజయారెడ్డి గదిలోకి వెళ్లాడు. లంచ్‌కు వెళ్లాల్సిన ఆమె ఆగిపోయి అతడితో మాట్లాడారు. దాదాపు అరగంట పాటు అక్కడ ఉన్నాడు. తర్వాత ఆమెతో వాగ్విదానికి దిగినట్టు తెలిసింది. తర్వాత తలుపులు మూసేసి విజయారెడ్డిపై దాడిచేశాడు. అరుపులు విన్న విజయారెడ్డి డ్రైవర్‌ తలుపులు పగులగొట్టేందుకు ప్రయత్నించగా కాలిన గాయాలతో సురేశ్‌ బయటకు వచ్చాడు. విద్యుత్‌ షాట్‌ సర్క్యూట్‌ జరిగి మంటలు అంటుకున్నాయని చెబుతూ చొక్కా విప్పేసి అక్కడి నుంచి బయటకు పరుగులు పెట్టాడు. కాలిన గాయాలతో పోలీస్‌ స్టేషన్‌ ముందు పడిపోయాడు. అతడిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. సురేశ్‌కు 60 శాతం గాయాలయ్యాయి. హయత్‌నగర్‌ మండలం గౌరెల్లి గ్రామానికి చెందిన సురేశ్‌ భూవివాదం కారణంగానే ఈ దారుణానికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. తన భూమి సమస్యలు పరిష్కారించాలని కొంతకాలంగా సురేశ్‌ తహశీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే విజయారెడ్డిని హత్య చేసినట్టు తెలుస్తోంది. విజయారెడ్డి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

ఎవరీ విజయారెడ్డి?
నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం తోటపల్లి విజయారెడ్డి సొంతూరు. ఆమె తండ్రి సి.లింగారెడ్డి కొండారంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. మిర్యాలగూడ మండలంలోని కాల్వపల్లి గ్రామం ఆమె అత్తగారి ఊరు. విజయారెడ్డి భర్త సుభాష్ రెడ్డి హయత్‌నగర్‌ ప్రభుత్వ కాలేజీలో డిగ్రీ కాలేజీ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. విజయారెడ్డి కుటుంబం కొత్తపేటలోని గ్రీన్‌హిల్స్‌ కాలనీలో ఉంటోంది. రంగారెడ్డి జిల్లాలో పలు మండలాల్లో గతంలో ఎమ్మారోగా పనిచేసిన విజయారెడ్డి కొద్దినెలల క్రితమే అబ్దుల్లాపూర్‌మెట్‌కు వచ్చారు. భూములకు సంబంధించిన పాస్‌బుక్కుల వ్యవహారంలో గతంలో పలువురితో ఆమె వాగ్వివాదానికి దిగినట్టు తెలుస్తోంది.

రెవెన్యూ ఉద్యోగుల ధర్నా
విజయారెడ్డి మృతితో దిగ్భ్రాంతికి గురైన రెవెన్యూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. దాడులకు తమకు రక్షణ కల్పించాలంటూ రహదారిపై ధర్నా చేపట్టారు. విజయారెడ్డిని హత్య చేసిన సురేశ్‌ను చట్టప్రకారం శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వికారాబాద్‌ జిల్లాలోని అన్ని తహశీల్దార్‌ కార్యాలయాల్లో రెవెన్యూ సిబ్బంది విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. (ప్రాథమిక వార్త: తహశీల్దార్‌పై కిరోసిన్‌ పోసి నిప్పంటిన దుండుగుడు)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top