డేవిస్‌ కప్‌ పోరు: భారత్‌ x పాకిస్తాన్‌

India vs Pakistan Davis Cup In Kazakhstan - Sakshi

నేటి నుంచి డేవిస్‌ కప్‌ పోరు

కజకిస్తాన్‌ వేదికగా సమరం

గెలిస్తే వరల్డ్‌ గ్రూప్‌ క్వాలిఫయర్స్‌కు అర్హత

అంతర్జాతీయ క్రీడా వేదికపై ఎక్కడైనా భారత్, పాకిస్తాన్‌ మధ్య పోరు అంటే అమితాసక్తి రేగడం సహజం. ఇప్పుడు ఈ రెండు జట్లు టెన్నిస్‌ కోర్టులో సమరానికి సన్నద్ధమయ్యాయి. ప్రతిష్టాత్మక డేవిస్‌ కప్‌ మ్యాచ్‌ సమరంలో దాయాదులు తలపడబోతున్నాయి. ఈ పోరుకు తటస్థ వేదికగా కజకిస్తాన్‌లోని నూర్‌–సుల్తాన్‌ను ఎంపిక చేశారు. మ్యాచ్‌లు ఇండోర్‌లోనే జరుగుతున్నా... దాదాపు మైనస్‌ 20 డిగ్రీల వరకు ఉంటున్న స్థానిక ఉష్ణోగ్రతతో కూడా ఆటగాళ్లు పోరాడాల్సి వస్తోంది.

నూర్‌–సుల్తాన్‌ (కజకిస్తాన్‌):  డేవిస్‌ కప్‌ ఆసియా ఓసియానియా గ్రూప్‌ 1 పోరులో భాగంగా నేటినుంచి జరిగే సమరంలో పాకిస్తాన్‌తో భారత్‌ తలపడుతోంది. తొలి రోజు రెండు సింగిల్స్‌ మ్యాచ్‌లు, శనివారం డబుల్స్‌తో పాటు రెండు రివర్స్‌ సింగిల్స్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. ఒక వేళ ఏదైనా జట్టు 3–0తో ఆధిక్యం సాధించినా నాలుగో మ్యాచ్‌ కూడా జరుగుతుంది. ఐదో మ్యాచ్‌ను మాత్రం ఆడకుండా తప్పుకునేందుకు రెండు జట్లకు అవకాశం ఉంది.

నిజానికి ఈ మ్యాచ్‌ వేదిక పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌. అయితే ఇరు దేశాల మధ్య సరైన సంబంధాలు లేని కారణంగా పాక్‌లో పర్యటించేందుకు భారత్‌ తిరస్కరించింది. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో వేదికను కజకిస్తాన్‌కు మార్చాల్సి వచ్చింది. ఈ పోరులో విజయం సాధించిన జట్టు మార్చి 2020లో జరిగే వరల్డ్‌ గ్రూప్‌ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించి క్రొయేషియాతో తలపడుతుంది.

భారత్‌కు ఎదురుందా! 
అనుభవం, తాజా ఫామ్‌వంటివి చూసుకుంటే పాకిస్తాన్‌కంటే భారత జట్టు ఎన్నో రెట్లు మెరుగ్గా ఉంది. పేస్‌లాంటి సీనియర్, నాగల్, రామ్‌కుమార్‌లాంటి యువ ఆటగాళ్లు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలలో చెలరేగుతుంటే పాక్‌ ఆటగాళ్ల ప్రదర్శన ఐటీఎఫ్‌ ఫ్యూచర్స్‌ స్థాయి టోర్నీలకే పరిమితమవుతోంది. 46 ఏళ్ల వయసులో మరో సారి డేవిస్‌ కప్‌లో సత్తా చాటేందుకు పేస్‌ సిద్ధమవుతుండటం విశేషం. జీవన్‌ నెడుంజెళియన్‌తో కలిసి అతను బరిలోకి దిగుతున్నాడు. నాగల్, రామ్‌కుమార్‌ సింగిల్స్‌ భారం మోస్తారు.

గతంలో రెండు డేవిస్‌ కప్‌ మ్యాచ్‌లలోనూ ఓడిన నాగల్‌ సింగిల్స్‌లో ఈ సారి బోణీ చేసే అవకాశం ఉంది. ఐసాముల్‌ హక్‌ ఖురేషీ, అఖీల్‌ ఖాన్‌లాంటి ఆటగాళ్లతో పాకిస్తాన్‌ జట్టు డబుల్స్‌లో కొంత పటిష్టంగా కనిపించింది. కానీ స్వదేశంనుంచి మ్యాచ్‌ను మార్చినందుకు నిరసనగా వీరిద్దరు తప్పుకోవడంతో ఆ జట్టు మరింత బలహీన పడింది. తొలి సింగిల్స్‌లో రామ్‌కుమార్‌తో తలపడనున్న 17 ఏళ్ల షోయబ్‌ కనీసం ఐటీఎఫ్‌ ఫ్యూచర్స్‌ టోర్నీ మెయిన్‌ డ్రాలో ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేదు.

చలి తాకిడికి... 
నూర్‌–సుల్తాన్‌లో ఉష్ణోగ్రతలు దాదాపు మైనస్‌ 20 డిగ్రీలకు చేరడంతో డేవిస్‌ కప్‌ మ్యాచ్‌ ఇండోర్‌ హార్డ్‌ కోర్టులో నిర్వహిస్తున్నారు. అందులోనూ ప్రత్యేకంగా వేడి హీటర్లు ఏర్పాటు చేశారు. అయితే బయటి వాతావరణం కూడా ఆటగాళ్లను ఇబ్బంది పెట్టే అవకాశం ఉండటంతో భారత్‌ పలు జాగ్రత్తలు తీసుకుంది. ప్రత్యేకంగా రూపొందించిన జాకెట్లను ఆటగాళ్లకు అందజేయడంతో పాటు తొలిసారి ఇద్దరు ఫిజియోలు జట్టుతో పాటు ప్రయాణిస్తున్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top