ఎవరిదో ‘జి’గేల్‌...! | Fifa world cup 2018:Belgium special story | Sakshi
Sakshi News home page

ఎవరిదో ‘జి’గేల్‌...!

Jun 12 2018 12:32 AM | Updated on Oct 2 2018 8:39 PM

Fifa world cup 2018:Belgium special story - Sakshi

ఎప్పుడో 52 ఏళ్ల క్రితం వరల్డ్‌ కప్‌ నెగ్గిన జట్టు... ఆ తర్వాత అదే గొప్పతో ప్రతీసారి బరిలోకి దిగడం, అంచనాలను అందుకోలేక విఫలం కావడం ఆ జట్టుకు రొటీన్‌గా మారిపోయింది... మరోవైపు ప్రతిభకు కొదవ లేకపోయినా, సంచలన విజయాలకు లోటు లేకపోయినా తుది ఫలితం మాత్రం సానుకూలంగా లేని జట్టు మరొకటి... ఇందులో ఒకటి ఇంగ్లండ్‌ కాగా, రెండోది బెల్జియం. ఈ రెండు ప్రపంచకప్‌లో ఒకే గ్రూప్‌ నుంచి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. నాకౌట్‌ చేరడంలో ఏమాత్రం సందేహం లేకున్నా, ఆ తర్వాత ఎంత ముందుకు వెళతాయనేది ఆసక్తికరం. ఇక పనామా, ట్యునీషియాల సంచలనం గురించి కూడా ఊహించలేం.   

ఇంగ్లండ్‌... సత్తా ఉన్నా 
గత ప్రపంచకప్‌లో గ్రూప్‌ దశలోనే వెనుదిరగడం, 2016 యూరోలో ప్రిక్వార్టర్స్‌లో ఐస్‌లాండ్‌ చేతిలో ఓడటంలాంటి పరిణామాలు ఇంగ్లండ్‌ జట్టుపై అంచనాలు తగ్గించేశాయి. ప్రపంచంలోనే అత్యంత ధనికమైన, పురాతనమైన లీగ్‌ (ఈపీఎల్‌) ఇంగ్లండ్‌లోనే ఉన్నా... అంతర్జాతీయ స్థాయికి వచ్చేసరికి మాత్రం ఆ జట్టు అంతంతమాత్రం ప్రదర్శనే కనబరుస్తోంది. సూపర్‌ స్టార్లు బెక్‌హామ్, రూనీలు రాజ్యమేలిన సమయంలో కూడా ఇంగ్లండ్‌ చెప్పుకోదగ్గ విజయాలు సాధించలేకపోయింది. యువ ఆటగాళ్లతో కూడిన జట్టు గ్రూప్‌ దశ దాటడం ఖాయమే అయినా, ఆపై ఏమాత్రం రాణిస్తుందనేది ఆసక్తికరం.  
ప్రపంచ ర్యాంక్‌: 12 
కీలక ఆటగాడు: హ్యారీ కేన్‌. మరో మాటకు తావు లేకుండా కేన్‌పై ఇంగ్లండ్‌ చాలా ఆధారపడుతోందనేది వాస్తవం. జిదాన్‌ ద్వారా ‘పరిపూర్ణ ఆటగాడి’గా ప్రశంసలందుకున్న ఇతను ప్రస్తుతం టాప్‌ స్ట్రయికర్‌లలో ఒకడు. ప్రీమియర్‌ లీగ్‌ పోటీల్లో అద్భుతంగా రాణించిన హ్యారీ క్వాలిఫయింగ్‌లో ఇంగ్లండ్‌ తరఫున 5 గోల్స్‌ కొట్టాడు.  
కోచ్‌: గారెత్‌ సౌత్‌గేట్‌. పెద్ద స్థాయిలో కోచింగ్‌ అనుభవం లేకపోయినా 2016లో ఇంగ్లండ్‌ ఏరికోరి గారెత్‌ను కోచ్‌గా పెట్టుకుంది. అయితే తొందరగానే జట్టుపై పట్టు సాధించిన ఇతను సాహసవంతమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఎక్కడా వెనకడుగు వేయడనే పేరుంది. 1998, 2002 ప్రపంచకప్‌లలో ఇంగ్లండ్‌ తరఫున బరిలోకి దిగిన సౌత్‌గేట్‌ ఈసారి కోచ్‌గా తనదైన ముద్ర వేయాలనుకుంటున్నాడు.   
చరిత్ర: 14 సార్లు వరల్డ్‌ కప్‌లో పాల్గొంది. 1966లో చాంపియన్‌గా నిలిచింది.   

బెల్జియం... నిలకడకు మారుపేరైనా! 
యూరోపియన్‌ జట్లలో పటిష్టమైన వాటిలో ఒకటిగా బెల్జియంకు గుర్తింపు ఉంది. ఆ జట్టు ప్రదర్శన ఎంత నిలకడగా ఉందో ‘ఫిఫా’ ర్యాంకింగ్‌ కూడా చూపిస్తుంది. అయితే వరల్డ్‌ కప్‌ విషయానికి వచ్చేసరికి మాత్రం చాలా విషయాలు దానికి అచ్చి రాలేదు. ఈసారి కూడా జట్టు ఏ ఒక్కరిపైనో ఆధార పడకుండా సమష్టితత్వాన్నే నమ్ముకుంది. ఫార్వర్డ్‌లలో రొమెలు లుకాకు పాత్ర కీలకం కానుంది. ఆఖరి సారిగా వరల్డ్‌ కప్‌ బరిలోకి దిగుతున్న గోల్‌ కీపర్‌ తిబాట్‌ కార్టియోస్‌ టోర్నీని చిరస్మరణీయం చేసుకోవాలని భావిస్తున్నాడు. డిఫెన్స్‌ కొంత బలహీనంగా కనిపిస్తున్నా... క్వాలిఫయింగ్‌లో బెల్జియం ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోలేదు.  
ప్రపంచ ర్యాంక్‌:
కీలక ఆటగాడు: ఎడెన్‌ హజార్డ్‌. నైపుణ్యం, చురుకుదనం కలగలిసిన ఎడెన్‌ ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ ఫార్వర్డ్‌లలో ఒకడు. క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లలో 6 గోల్స్‌ చేయడంతో పాటు మరో 5 గోల్స్‌లో ప్రధాన పాత్ర పోషించాడు. కెవిన్‌ డి బ్రూయిన్‌పై కూడా జట్టు ఆశలు పెట్టుకుంది.  
కోచ్‌: రాబర్టో మార్టినెజ్‌. 2016 యూరోకప్‌లో జట్టు ఘోర ప్రదర్శన తర్వాత మార్క్‌ విల్‌మాట్స్‌ను తొలగించి ఇతడిని ఎంపిక చేశారు. స్పెయిన్‌కు చెందిన మార్టినెజ్‌ వచ్చాక జట్టు ఆట గాడిలో పడింది. గతంలో క్లబ్‌ స్థాయిలో మాత్రమే కోచింగ్‌ ఇచ్చిన అనుభవం ఉన్న ఇతనికి ఇదే తొలి ‘ఫిఫా’ కప్‌.  
చరిత్ర: 12 సార్లు టోర్నీ బరిలోకి దిగింది. 1986లో నాలుగో స్థానం అత్యుత్తమ ప్రదర్శన 

ట్యునీషియా... గ్రూప్‌ దశ దాటాలని... 
క్వాలిఫయింగ్‌లో కాంగో, లిబియా, గినియా జట్లను వెనక్కి తోసి అజేయంగా ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. ఒక్కసారైనా గ్రూప్‌ దశ దాటని ఈ జట్టు ప్రస్తుత ఏకైక లక్ష్యం ఒక్క మ్యాచ్‌లోనైనా విజయం సాధించడం. జట్టులో దాదాపు అందరూ కొత్త కుర్రాళ్లే.  
కీలక ఆటగాడు: యూసుఫ్‌ ఎమ్‌ సక్ని. 27 ఏళ్ల ఈ ఫార్వర్డ్‌ తన ఆటతీరుతో ట్యూనీషియా ప్రపంచ కప్‌ కు అర్హత సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. గినియాతో జరి గిన మ్యాచ్‌లో హ్యాట్రిక్‌ కొట్టాడు.  
ప్రపంచ ర్యాంక్‌: 21 కోచ్‌: నబీల్‌ మాలుల్‌. 1980, 1990లలో ట్యునీషియా అత్యుత్తమ ఆటగాడిగా గుర్తింపు ఉంది. 2002లో ట్యునీషియా ఆఫ్రికా కప్‌ గెలిచిన సమయంలో జట్టు సహాయక కోచ్‌గా పని చేసిన అనుభవం ఉంది. అదే కారణంతో కోచ్‌ పదవి లభించింది. అతని నేతృత్వంలో జట్టు 2011 సీఏఎఫ్‌ చాంపియన్స్‌ లీగ్‌ గెలిచింది.  
చరిత్ర: నాలుగు సార్లు పాల్గొంది. ఎప్పుడూ గ్రూప్‌ దశ దాటలేదు. గత రెండు వరల్డ్‌కప్‌లకు దూరమై ఈసారి మళ్లీ అర్హత సాధించింది.  

పనామా... కోచ్‌ ఎలా నడిపిస్తాడో! 
40 లక్షల జనాభా గల ఈ దేశం తొలిసారి ప్రపంచకప్‌కు అర్హత సాధించిన రోజున ప్రభుత్వం జాతీయ సెలవుదినాన్ని ప్రకటించింది. తమ గ్రూప్‌లో ఉన్న అమెరికాను పడగొట్టడంతో పాటు చివరి క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లో కోస్టారికాను 2–1తో ఓడించి అర్హత సాధించింది.  
ప్రపంచ ర్యాంక్‌: 55 
కీలక ఆటగాడు: బ్లాస్‌ పెరెజ్‌. జాతీయ జట్టు తరఫున 100కు పైగా మ్యాచ్‌లు ఆడిన సీనియర్‌. నాలుగు సార్లు ప్రపంచ కప్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీల్లో పాల్గొన్నాడు. లూయీస్‌ తేజాడా కూడా మరో ప్రధాన ఆటగాడు.  
కోచ్‌: హెర్నన్‌ డారియో గోమెజ్‌. దిగువ స్థాయి జట్లను తన శిక్షణలో మేటిగా తీర్చిదిద్దడంలో మంచి గుర్తింపు ఉంది. గోమెజ్‌ కోచ్‌గా ఉన్న సమయంలో 1998లో కొలంబియా, 2002లో ఈక్వెడార్, ఇప్పుడు పనామా వరల్డ్‌ కప్‌కు అర్హత సాధించాయి. తన నేతృత్వంలో సంచలనాన్ని ఆశిస్తున్నాడు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement