‘ధోని వ్యూహాలకు తగ్గ  కెప్టెన్లను తీసుకున్నాడు’

Dhoni Targets  Captains Who Are Thinking Cricketers, Du Plessis - Sakshi

కేప్‌టౌన్‌:  ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ సక్సెస్‌ కావడానికి ఆ జట్టు కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని అనుసరించిన విధానాలే కారణమని దక్షిణాఫ్రికా మాజీ  కెప్టెన్‌ డుప్లెసిస్‌ అభిప్రాయపడ్డాడు. తమ వ్యూహాలకు అండగా ఉండే అంతర్జాతీయ కెప్టెన్లను తీసుకోవడం, క్లిష్ట పరిస్థితుల్లో కూడా జట్టు విజయం కోసం తెగించి ఆడేవాళ్లను ఎంచుకోవడమే ధోని సక్సెస్‌ సూత్రమన్నాడు. సీఎస్‌కే వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డుప్లెసిస్‌ పలు విషయాల్ని వెల్లడించాడు. 

‘నాతో పాటు బ్రెండన్‌ మెకల్లమ్‌, బ్రేవోలాంటి అంతర్జాతీయ కెప్టెన్లను లక్ష్యంగా పెట్టుకుని చెన్నై టీమ్‌ను ఎంచుకుంది. ధోనీ, రైనా ఎలాగూ ఉంటారు. ఈ ఇద్దరు క్రికెట్ గురించి చాలా ఆలోచిస్తారు. అంతేకాకుండా జట్టులో చాలా మంది లీడర్స్ ఉన్నారు. వాళ్ల అనుభవం, ఆలోచన జట్టుకు ఉపయోగపడుతుంది. చాలా మ్యాచ్‌ల్లో అది నిరూపితమైంది. ఇందులో ధోనితో పాటు కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ పాత్ర కూడా చాలా ఉంది. వీరిద్దరూ కలిసి సీఎస్‌కేను బలమైన జట్టుగా తీర్చిదిద్దారు. చెన్నై జట్టులో అద్భుత ఫీల్డర్లు కూడా ఉన్నారని ఈ సఫారీ బ్యాట్స్‌మన్ తెలిపాడు.

అందులో జడేజా సూపర్బ్ ఫీల్డర్ అని కితాబిచ్చాడు. తన ఫీల్డింగ్‌తో సుమారు 20 నుంచి 30 పరుగులను జడేజా ఆపుతాడని దీనివల్ల బౌలర్లలో ఉత్సాహం వస్తుందన్నాడు తన సుదీర్ఘ ఐపీఎల్ కెరీర్‌లో చెన్నై జట్టుతో ఎన్నో మధుర క్షణాలున్నాయని డుప్లెసిస్‌ తెలిపాడు. సురేశ్‌ రైనా విసిరిన ఐపీఎల్ ఫేవరేట్ మూమెంట్ చాలెంజ్‌లో భాగంగా తన ఆల్‌టైమ్ ఫేవరేట్ మూమెంట్స్‌ను పంచుకున్నాడు. గతేడాది ఆర్‌సీబీతో జరిగిన ఓ మ్యాచ్‌లో ధోని (84 నాటైట్) విధ్వంసకర ఇన్నింగ్స్,  2013లో రైనా చేసిన సెంచరీ, 2018లో బ్రేవో అందించిన అనూహ్య విజయం, గత రెండు సీజన్ల ఫైనల్లో షేన్ వాట్సన్ చేసిన పోరాటాలు ఫేవరెట్‌ మూమెంట్స్‌గా డుప్లెసిస్‌ పేర్కొన్నాడు. 

Election 2024

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top