చంద్రబాబును అడ్డుకున్నది ప్రజలు, విద్యార్థులే

YSRCP Leaders Comments On Chandrababu - Sakshi

సాక్షి, తిరుపతి/విశాఖపట్నం: ప్రతిపక్ష నేత చంద్రబాబును విశాఖపట్నంలో అడుగు పెట్టనివ్వకుండా అడ్డుకున్నది ఉత్తరాంధ్ర ప్రజలు, విద్యార్థులు, ప్రజా సంఘాల ప్రతినిధులేనని మంత్రులు బొత్స సత్యనారాయణ, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్, వైఎస్సార్‌సీపీ నేత దాడి వీరభద్రరావు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఉత్తరాంధ్ర అభివృద్ధిని గాలికొదిలేసిన చంద్రబాబు.. ప్రతిపక్షంలోకి వచ్చాక ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలని దెబ్బతీసేలా మాట్లాడారని.. అందుకే ప్రజలు ఆయనపై తిరగబడ్డారన్నారు. శుక్రవారం వేర్వేరు చోట్ల వారు విలేకరులతో మాట్లాడారు.

మనోభావాలు దెబ్బతీసినందుకే అడ్డుకున్నారు
ప్రతిపక్ష నేత చంద్రబాబు తాను అధికారంలో ఉన్న ఐదేళ్లూ రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదు. ఇటీవల కుప్పం పర్యటనలో చంద్రబాబు ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ప్రసంగించారు. ‘జై అమరావతి’ అంటూ రెచ్చగొట్టి సంగతి తేలుస్తానని ప్రగల్భాలు పలికారు. దీనివల్లే విశాఖలో ప్రజలు ఆయనను అడ్డుకున్నారు. ఇందులో వైఎస్సార్‌సీపీ ప్రమేయం ఏమాత్రం లేదు. విభేదాలు సృష్టించే పరిస్థితి కొనసాగితే రాయలసీమలోనూ చంద్రబాబును అక్కడి ప్రజలు అడ్డుకుంటారు.
– బొత్స సత్యనారాయణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి

చంద్రబాబుకు మతి భ్రమించింది
చంద్రబాబుకు వయసు పెరగటంతో మతి భ్రమించింది. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిన ఆయనకు ప్రజలే బుద్ధి చెప్పారు. చంద్రబాబు హయాంలో రాక్షస పాలన సాగింది. ఆ కారణంగా ప్రజలు ఆయనను అధికారం నుంచి సాగనంపారు. అయినా ఆయన వైఖరిలో మార్పు రాలేదు. అందుకే ప్రజలు ఆయన పర్యటనను అడ్డుకున్నారు.
– కె.నారాయణస్వామి, ఉప ముఖ్యమంత్రి

బాబును అడ్డుకున్నది వైఎస్సార్‌సీపీ కాదు
విశాఖలో చంద్రబాబును అడ్డుకున్నది వైఎస్సార్‌సీపీ కాదు. ఉత్తరాంధ్ర ప్రజలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల వారే ఆయనను అడ్డుకున్నారు. చంద్రబాబు తీరుపై ఆగ్రహించిన ఉత్తరాంధ్ర ప్రజలు అడ్డుకుంటే పులివెందుల నుంచి రౌడీలను తీసుకొచ్చారంటారా. వీడియో ఫుటేజీలు ఉంటాయి కదా.. చూసుకోండి ఒక్కరైనా పులివెందులకు సంబంధించిన వారుంటే నేను రాజీనామా చేస్తా. లేదంటే చంద్రబాబు రాజీనామా చేస్తారా. టీడీపీని ఎన్నో ఏళ్ల నుంచి ఉత్తరాంధ్ర ప్రజలు మోస్తూ వచ్చారు. అయినా చంద్రబాబు ఈ ప్రాంత అభివృద్ధికి అడ్డుపడుతూనే ఉన్నారు. విశాఖ నగరం రాజధానికి పనికిరాదని చులకనగా మాట్లాడుతున్నారు. ఆ కోపంతోనే ఉత్తరాంధ్ర ప్రజలు ఆయనను అడ్డుకున్నారు. 
– ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పర్యాటక శాఖ మంత్రి

ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించి రాక్షసానందం పొందిన వ్యక్తి
అమ్మ కంటే అమరావతి గొప్పదన్న చంద్రబాబును ఉత్తరాంధ్ర ప్రజలు ఏ విధంగా హర్షిస్తారు. ఆయన పర్యటనకు పోలీసులు అనుమతి ఇచ్చినంత మాత్రాన ప్రజల అనుమతి అవసరం లేదా. విశాఖలో ప్రజలు వాటర్‌ ప్యాకెట్లు, గుడ్లు, చెప్పులు విసిరారని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉంది. 1994లో ఎన్టీఆర్‌ మీద చెప్పులు వేయించి రాక్షసానందం పొందిన వ్యక్తి చంద్రబాబు. విశాఖ ఎయిర్‌ పోర్టులో చంద్రబాబు వ్యవహరించిన తీరు చాలా హాస్యాస్పదంగా ఉంది.
– దాడి వీరభద్రరావు, మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి 

చెప్పులు విసిరే సంప్రదాయం టీడీపీదే
విశాఖ ఎయిర్‌పోర్టులో చంద్రబాబుపై చెప్పులతో దాడి చేసింది లోకేశ్‌ తోడల్లుడు భరత్‌ వర్గీయులే. టీడీపీ ఆవిర్భావం నుంచి చెప్పులతో దాడి చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అందుకే.. చంద్రబాబు అంటే పడని టీడీపీలోని మరో వర్గమే చెప్పులతో దాడి చేయించింది. ఉత్తరాంధ్ర ప్రజలు శాంతి స్వభావులు. వాళ్లు ఆగ్రహిస్తే ఎలా ఉంటుందో చంద్రబాబు ప్రత్యక్షంగా చూశారు. గత ఐదేళ్లలో చేసిన పాపాలే చంద్రబాబును నీడలా వెంటాడుతున్నాయి. 
– గుడివాడ అమర్‌నాథ్, ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top