
సాక్షి, హైదరాబాద్: చంద్రబాబు అర్థం లేని కార్యక్రమాలను పెట్టి ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన కేంద్ర పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. ప్రభుత్వ డబ్బుతో టీడీపీ ప్రచారం చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ సొమ్ముతో ఏమైనా చేసుకోండి. కానీ ప్రజల సొమ్మును ప్రజలకే ఉపయోగించాలన్నారు. పార్టీ చేపట్టే కార్యక్రమాలకు ప్రజలపై ఒత్తిడి పెంచి బలవంతంగా రప్పించుకోవడం మంచిది కాదన్నారు. నవనిర్మాణ దీక్షలకు డ్వాక్రా మహిళలను బెదిరించి తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికారులను, కలెక్టర్లను పనిచేసుకోనివడం లేదని తెలిపారు. కాంగ్రెస్‌కు సహకరిస్తే రాష్ట్రానికి అన్యాయం చేసినట్లే అని గత ఏడాది నవనిర్మాణ దీక్షలో ప్రకటించిన చంద్రబాబు కర్ణాటకలో రాహుల్ గాంధీతో చేతులు కలపడం ఏంటని ప్రశ్నించారు. ఇప్పుడు ప్రజలకు తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ ఎవరనేది తెలిసిందన్నారు.
అవినీతి కేరాఫ్ అడ్రస్‌గా ఏపీ ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వం అవినీతి కేరాఫ్ అడ్రస్‌గా మారిందని బుగ్గన విమర్శించారు. చంద్రన్న మజ్జిగ పథకంలో కూడా బాబు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అనవసర ప్రకటనలతో, పనులతో ఏడాదికి రూ.12 వేల కోట్లు నష్టం తెస్తున్నారని పేర్కొన్నారు. నవనిర్మాణ దీక్షలో మీరు ఏం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. పులివెందులకు కూడా నీరు ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పడం ఏంటి? పులివెందుల ఏపీలో లేదా? అని ప్రశ్నించారు.
నాలుగేళ్లుగా కేంద్రానికి వంగి వంగి ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు.. విబేధాల పేరుతో ప్రస్తుతం దూరమయ్యారన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థలు, పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించారని దుయ్యబట్టారు. బాగున్న రైతును బలి చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడదామని ప్రతిజ్ఞ చేయాలని బుగ్గన కోరారు.