మోసకారి సునీత!

Thopudurthi Village People Fires on Paritala Sunitha - Sakshi

తోపుదుర్తిలో కాలు పెట్టనివ్వం

ఏం అభివృద్ధి చేశారని వస్తారు?

నాలుగున్నరేళ్ల తర్వాత పింఛన్లు, డ్వాక్రా రుణాలు గుర్తొచ్చాయా..

బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి వడ్డీలు కట్టినం

ఆ రోజులను ఎలా మర్చిపోతాం

ఏకతాటిపైకి వచ్చిన గ్రామస్తులు

నాలుగున్నరేళ్ల తర్వాత ప్రజలపై ప్రేమ ఒలకబోస్తున్న టీడీపీ మోసాన్ని ప్రజలు గ్రహిస్తున్నారు. నెత్తీనోరు కొట్టుకున్నా కొత్త పింఛన్లు ఇయ్యని సర్కారు.. ఇప్పుడు పింఛను సొమ్ము పెంచామని గొప్పలు చెప్పడాన్ని ఏ ఒక్కరూ నమ్మని పరిస్థితి. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి.. నమ్మించి మోసగించిన బాబు తీరుపై మహిళలు శాపనార్థాలు పెడుతున్నారు. నమ్మి ఓట్లేసినందుకు బ్యాంకర్ల ఒత్తిళ్లకు ఒంటిపై నగలు తాకట్టుపెట్టి వడ్డీలు కట్టినామని కళ్ల నిండా నీళ్లతో ఉగ్రరూపం దాలుస్తున్నారు.

అనంతపురం, ఆత్మకూరు: ఓ మహిళగా మంత్రి సునీత చేసిన మోసాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల ముందు చెప్పి.. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పడంపై ఒంటికాలి మీద లేస్తున్నారు. కనీసం కొత్త పింఛన్లు కూడా ఇప్పించలేదని, మరుగుదొడ్ల నిర్మాణానికీ కాళ్లరిగేలా తిరిగినా కనికరించలేదని వాపోతున్నారు. ఆమె కుటుంబ సభ్యులు, బంధువుల పాలనతో విసిగిపోయామని, తమ యోగక్షేమాలుపట్టించుకోని సునీతను తమ ఊళ్లోకి రానిచ్చేది లేదని మంత్రి సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గంలోని తోపుదుర్తి గ్రామస్తులు ఒక్కతాటిపై నిలిచారు. ఈనెల 3వ తేదీన మంత్రి సునీత పింఛన్లు, డ్వాక్రా చెక్కులను పంపిణీ చేయడానికి వస్తున్నారని తెలిసి శుక్రవారం తోపుదుర్తి గ్రామస్తులంతా మూకుమ్మడిగా సమావేశమయ్యారు. అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు గడిచినా ఏ ఒక్క అభివృద్ధి చేయని మంత్రిని తమ ఊళ్లోకి రానిచ్చేది లేదని మూకుమ్మడి నిర్ణయం తీసుకున్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తారని నమ్మి బ్యాంకుల్లో రుణాలు కట్టలేదని, తీరా టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బ్యాంకోళ్ల ఒత్తిడితో అప్పులు చేసి, ఆభరణాలు తాకట్టు పెట్టి రుణాలు చెల్లించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఒక్క రూపాయి కూడా మాఫీ చెయ్యలేదు
ఏ ఒక్క అభివృద్ధి పనీ చేయని మంత్రి సునీత ఏమి ముఖం పెట్టుకొని గ్రామంలోకి వస్తారని గ్రామస్తులు ప్రశ్నించారు. డ్వాక్రా రుణాల విషయంలో పూర్తిగా మోసపోయామని, ఇప్పుడు చెక్కుల పేరిట కొత్త డ్రామా ఆడుతున్నారన్నారు. నాలుగున్నరేళ్లలో ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదని, కనీసం తాము కట్టిన వడ్డీని కూడా రీయింబర్స్‌ చేయలేదని వాపోయారు. పెట్టుబడి నిధి కింద రూ.10వేలు మాత్రమే ఇచ్చారని, ఇది కార్పస్‌ఫండ్‌ మాత్రమేనని, ఉచితంగా ఇచ్చింది కాదన్నారు.

మళ్లీ పెట్టుబడి నిధి కింద రూ.10వేలు ఇస్తామని కొత్త పాట పాడుతున్నారని, ఇంత మాత్రానికి మంత్రి వచ్చి చేసేది ఏమీ లేదన్నారు. పింఛన్ల విషయంలోనూ మోసగిస్తున్నారని, కొత్తగా ఎలాంటి పింఛన్లు ఇయ్యని ప్రభుత్వం ఇప్పుడు రెట్టింపు పింఛనంటూ ఎన్నికల వేళ డ్రామా ఆడుతోందన్నారు. ఇంటికో ఉద్యోగం అని మోసగించారని, నిరుద్యోగ భృతి విషయంలోనూ ఎన్నో మెలికలు పెట్టి రూ.వెయ్యితో సరిపెట్టారన్నారు. తోపుదుర్తిలో 300 ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చిన సునీత కనీసం ఒక్క ఇంటిని కూడా నిర్మించలేదన్నారు. కనీసం మరుగుదొడ్డి నిర్మించుకుందామంటే.. లెక్కలేనన్ని సార్లు అర్జీలు ఇచ్చినా పట్టించుకోలేదన్నారు. పైగా రూ.5వేలు లంచం అడిగారని వాపోయారు. ఇలా అన్నివిధాల మోసగించిన మంత్రి సునీతను తమ గ్రామంలో అడుగుపెట్టనిచ్చేది లేదని తోపుదుర్తి గ్రామస్తులు ఒక్కతాటిపై ప్రకటించారు.

నగలు తాకట్టు పెట్టి రుణాలు కట్టినా
రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు టీడీపీ నేతలు ఊదరగొట్టారు. అది నమ్మి బ్యాంకులో రుణాలు కట్టలేదు. గవర్నమెంటు వచ్చినా బ్యాంకు అధికారులు కట్టాల్సిందేనని మొండికేయడంతో నలుగురిలో మర్యాద పోతుందని ఒంటిపై ఉన్న నగలు తాకట్టు పెట్టి రుణాలు చెల్లించినా. హామీ నిలబెట్టుకోలేని మంత్రికి మా ఊళ్లోకి వచ్చే హక్కు లేదు. – లలితమ్మ, తొపుదుర్తి

70 సంవత్సరాలున్నా పింఛను ఇయ్యలేదు
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పింఛను కోసం ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినానో లెక్కలేదు. 70 ఏండ్ల వయస్సున్నా నాకు పింఛను ఇస్తలేరు. నాలుగేండ్లు ఏమీ పట్టించుకోలేదు కానీ, ఎన్నికలు వస్తున్నాయని ఇప్పుడు పింఛను రూ.2వేలకు పెంచినామని మోసం చేస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని నమ్మలేం.– నారాయణ, తోపుదుర్తి

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top