రాప్తాడులో ‘దేశం’ దౌర్జన్యకాండ

Pressure to swear to vote for TDP - Sakshi

టీడీపీకి ఓటేస్తామని ప్రమాణం చేయాలని ఒత్తిడి

ససేమిరా అన్న డ్వాక్రా మహిళలు

ఆగ్రహంతో ఓ మహిళను కాలుతో తన్నిన టీడీపీ నేత

ఆందోళనకు దిగిన మహిళలు 

అక్కడే బైఠాయించి గ్రామస్తుల నిరసన

మంత్రి సునీత సోదరుడు మురళీ, తనయుడు శ్రీరామ్‌ అనుచరుల ఆధ్వర్యంలో దాడులు

ఎనిమిది మందికి తీవ్రగాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం

అనంతపురం సెంట్రల్‌/రాప్తాడు: అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో మంత్రి పరిటాల సునీత అనుచరుల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. తోపుదుర్తిలో ఆదివారం జరిగిన ఘటన మరువకముందే రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లి గ్రామంలో తెలుగు తమ్ముళ్లు మరోసారి రెచ్చిపోయారు. గ్రామంలో సోమవారం జరిగిన ‘పసుపు–కుంకుమ’ కార్యక్రమంలో ఓ మహిళను మంత్రి సునీత అనుచరుడు కాలితో తన్నడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో తమపైనే తిరగబడతారా అని మంత్రి సునీత సోదరుడు ధర్మవరపు మురళీ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు గ్రామంపైకి దండెత్తారు.  దొరికిన వాళ్లను దొరికినట్లుగా చితకబాదారు. ఈ ఘటనలో మొత్తం 8 మంది తీవ్రంగా గాయపడగా ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఇదే ఘటనలో కానిస్టేబుల్‌ జయచంద్రారెడ్డి తీవ్రంగా

గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే..
గొందిరెడ్డిపల్లిలో సోమవారం పసుపు–కుంకుమ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి పరిటాల సునీత సోదరుడు, రాప్తాడు మండల టీడీపీ ఇన్‌చార్జ్‌ ధర్మవరపు మురళీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తొలుత కొంతమందికి చెక్కులు పంపిణీ చేసిన ఆయన.. అనంతరం పక్కనే ఉన్న పుల్లలరేవు గ్రామానికి వెళ్లారు. ఆ తర్వాత గొందిరెడ్డిపల్లిలో సభ నిర్వహించిన మంత్రి అనుచరుడు, మండల నాయకుడు మిడతల శీనయ్య.. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటేస్తామని పాలతో ప్రమాణం చేయాలని డ్వాక్రా మహిళలపై ఒత్తిడి తెచ్చారు. అయితే, ఇందుకు కొంతమంది మహిళలు కుదరదని చెబుతూ తాము ఓటు వేసేది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకేనని సభలో స్పష్టంచేశారు. దీంతో ఒక్కసారిగా ఆవేశంతో ఊగిపోయిన శీనయ్య.. ఓ మహిళను కాలితో తన్నడంతో ఆమె కిందపడింది. దీంతో సభలోని మహిళలు, గ్రామ ప్రజలు ఎదురుతిరిగారు. పోలీసులు కూడా టీడీపీ నేతలకు వత్తాసు పలుకుతూ ప్రజలను, మహిళలను పక్కకు తోసేస్తుండడంతో వారు అక్కడే రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న మురళీ, మంత్రి సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్‌ అనుచరులు పెద్దఎత్తున గ్రామానికి చేరుకున్నారు. ప్రశ్నించిన వారిలో దొరికిన వారిని దొరికినట్లుగా చితకబాదారు. పోలీసుల చేతుల్లో లాఠీలను  తీసుకొని చావబాదారు. ఈ దాడిలో గ్రామానికి చెందిన హనుమంతరెడ్డి, నాగరత్న, లక్ష్మమ్మ, ఈశ్వరమ్మ, మల్లికార్జునరెడ్డి, పార్వతమ్మ, నాగేంద్రమ్మ, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. హనుమంతరెడ్డి తలకు తీవ్ర గాయాలు కాగా, నాగరత్నమ్మ కాలు విరగడంతో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. క్షతగాత్రులను అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

భయాందోళనలో గొందిరెడ్డిపల్లి ప్రజలు
మంత్రి సునీత తనయుడు పరిటాల శ్రీరామ్, ఆమె సోదరుడు ధర్మవరపు మురళీ తమ అనుచరులతో దాడులు చేయించడంతో గొందిరెడ్డిపల్లి గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ‘మా ప్రభుత్వంలో మాకే ఎదురుతిరుగుతారా?’ అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో గ్రామంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సానుభూతిపరులు, డ్వాక్రా మహిళలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మురళీ అర్ధరాత్రి వరకూ గ్రామంలోనే ఉండి భయభ్రాంతులకు గురిచేసినట్లు బాధితులు తెలిపారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top