‘మంగళగిరి పేరును అమంగళం చేశారు’

Narne Srinivasa Rao Slams Chandrababu Naidu - Sakshi

సాక్షి, విజయవాడ: మంత్రి నారా లోకేశ్‌ మంగళగిరి పేరును అమంగళం చేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు నార్నే శ్రీనివాసరావు విమర్శించారు. లోకేశ్‌ కోసం కోపరేటివ్‌ సంస్థలన్నింటినీ చంద్రబాబు నాయుడు సర్వనాశనం చేశారని మండిపడ్డారు. సోమవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికలు ముగిసేవరకు వైఎస్సార్‌సీసీ నాయకులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ మూడు రోజుల్లో చంద్రబాబు ఎన్నో కుయుక్తులు పన్నుతారని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టే మాటలు మాట్లాడుతారని పేర్కొన్నారు. ఎన్టీఆర్‌, వైఎస్సార్‌ల కంటే మంచి పాలన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తారని నమ్ముతున్నట్టు తెలిపారు. చంద్రబాబు తన తమ్ముడు రామ్మూర్తి నాయుడని బయటి ప్రపంచానికి చూపించగలరా అని ప్రశ్నించారు. 

సొంత చెల్లికి యాక్సిడెంట్‌ అయితే చంద్రబాబు ఇంతవరకు పట్టించుకోలేదంటే ఆయన మనసు అర్థం చేసుకోవచ్చన్నారు. బాలకృష్ణ అంటే చంద్రబాబుకు భయమని పేర్కొన్నారు. తాను ఏనాడు చంద్రబాబుని సీట్లు అడగలేదని స్పష్టం చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తెలంగాణలో ఒక మాట, ఆంధ్రప్రదేశ్‌లో ఒక మాట మాట్లాడతారని మండిపడ్డారు. చంద్రబాబు చెప్పినట్టు పవన్‌ ఆడతారని ఆరోపించారు. బాలకృష్ణ తీసిన బయోపిక్‌ కంటే లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ఎన్టీఆర్‌కు చంద్రబాబు ఎటువంటి హాని చేయనప్పుడు లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రాన్ని ఏపీలో విడుదల కాకుండా ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న రాకుండా చేసింది కూడా చంద్రబాబేనని వ్యాఖ్యానించారు. పది ఏళ్లు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని అయితే.. చంద్రబాబు దానిని వదిలి పారిపోయి వచ్చారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు వల్లే రాష్ట్ర ప్రజలు, ఉద్యోగులు నానా ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. అబద్ధాలు ఆడటంలో చంద్రబాబుకు గిన్నిస్‌ రికార్డు వస్తుందని  వ్యాఖ్యానించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top