
కాన్పూర్ : కలెక్టరేట్‌లో సౌర విద్యుత్ పలకల వ్యవస్థ ఆవిష్కరణ.. ముఖ్య అతిథిగా స్థానిక ఎంపీ, బీజేపీ సీనియర్ నేత మురళి మనోహర్ జోషీని పిలిచారు. ఏర్పాట్లన్నీ బాగానే చేశారు. రిబ్బన్ కటింగ్ కోసం రిబ్బన్‌ను కూడా సిద్ధం చేశారు. కానీ కటింగ్ చేసేందుకు అవసరమైన కత్తెరను మాత్రం మరచిపోయారు. మందీమార్బలంతో వేదిక వద్దకు వచ్చిన ఎంపీ గారికి రిబ్బన్ కట్ చేద్దామనుకునేసరికి కత్తెర కనిపించలేదు.
దాంతో కత్తెర కోసం అధికారులు ఉరుకులు పరుగులు మొదలుబెట్టారు. ఎంపీ గారికి కోపమొచ్చింది. అయినా.. ఓపిగ్గా మూడు నిమిషాలు ఎదురు చూశారు. అయినా, కత్తెర జాడ లేదు. కోపం నషాళానికెక్కింది. ఆగ్రహంగా అక్కడ కర్రకు కట్టిన రిబ్బన్‌ను చేతుల్తో లాగేసి.. ప్రారంభోత్సవం ముగిసిందంటూ ప్రకటించేశారు. వెళ్తూ, వెళ్తూ.. ‘మీరేం నిర్వాహకులు? ఇదేం పద్ధతి? మర్యాద, మన్ననా తెలియదా?’అని అధికారులకు గట్టిగానే తలంటారు.
కత్తెరను ఏర్పాటు చేయకపోవడానికి సంబంధించి సమగ్ర నివేదికను రూపొందించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సురేంద్ర సింగ్ అక్కడి అదనపు కలెక్టర్ సతీశ్‌పాల్‌ను ఆదేశించడం కొసమెరుపు.