మానవీయకోణంలో చూడండి

MP Avinash Reddy Meets Fathima Medical College Students - Sakshi

ఫాతిమా విద్యార్థుల సమస్యపై ప్రభుత్వాన్ని కోరిన ఎంపీ అవినాశ్‌రెడ్డి

'సాక్షి, గాంధీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌): ‘‘ఫాతిమా కళాశాల విద్యార్థుల సమస్యను దయచేసి రాజకీయకోణంలో చూడవద్దు. మానవీయకోణంలో చూడండి. విద్యార్థుల గోడు అర్థం చేసుకోండి. విద్యార్థుల భవిష్యత్‌ గురించి ఆలోచించండి. వారికి కచ్చితంగా న్యాయం చేయాలి’’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గురువారం విజయవాడ అలంకార్‌ సెంటర్‌లో ఫాతిమా కళాశాల విద్యార్థులు, తల్లిదండ్రులు చేపట్టిన నిరసన దీక్షలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థుల దీక్షకు మద్దతు తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడారు.

మూడేళ్లుగా తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని విద్యార్థులు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం మాయమాటలతో తమను మోసం చేసిందని వాపోయారు. వారిని అవినాశ్‌రెడ్డి ఓదార్చారు. ధైర్యం కోల్పోవద్దని, వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టులో సరైన రీతిలో కౌంటర్‌ దాఖలు చేస్తే సమస్య వచ్చి ఉండేది కాదన్నారు. వచ్చే ఏడాది తాము వంద సీట్లు వదులుకుంటామని కౌంటర్‌ దాఖలు చేసి ఉంటే నష్టపోయిన ఫాతిమా కళాశాల విద్యార్థులకు న్యాయం జరిగేదన్నారు. సీఎం ఎంసీఐ అధికారులతో స్వయంగా మాట్లాడితే గంటలో సమస్య పరిష్కారమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. దీక్షా శిబిరంలో పార్టీ నగర అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాస్, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లాది విష్ణు, విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త బి.భవకుమార్,  పార్టీ నేత శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top