‘భాగీదార్‌’.. అభినందనే..! | Sakshi
Sakshi News home page

‘భాగీదార్‌’.. అభినందనే..!

Published Sun, Jul 29 2018 4:14 AM

Modi attacks Rahul Gandhi over his 'bhagidar' remark - Sakshi

లక్నో: కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తనను ‘చౌకీదార్‌–భాగీదార్‌’ అంటూ చేసిన విమర్శలను ప్రధాని నరేంద్ర మోదీ తిప్పికొట్టారు. తనను భాగీదార్‌ అని పిలవడాన్ని అభినందన (మెచ్చుకోలు)గా స్వీకరిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. శనివారం లక్నోలో మూడు కేంద్ర ప్రథకాల తృతీయ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడారు. ‘ఈ మధ్య కొందరు నన్ను.. చౌకీదార్‌ (కాపలాదారు) కాదు భాగీదార్‌ (వాటాదారు) అని అంటున్నారు. నన్ను వాటాదారు అన్నందుకు సంతోషంగా ఉంది. పేదల కష్టాల్లో భాగస్వామిగా ఉన్నందుకు ఆనందిస్తున్నా. ఈ ఆరోపణలను గౌరవంగా భావిస్తున్నా.

పేదలు, శ్రామికులు, ఓ బాధపడుతున్న తల్లి, ప్రకృతి ప్రకోపానికి గురైన పేద రైతు, ఎర్రటి ఎండలో, ఎముకలు కొరికే చలిలో దేశరక్షణలో నిమగ్నమైన జవాను ఎదుర్కొంటున్న కష్టాల్లో భాగస్వామిగా ఉండటం గొప్ప విషయం. వైద్య అవసరాల కోసం ఉన్న భూమిని అమ్ముకున్న ఓ పేద కుటుంబంలో భాగస్వామిని’ అని పేర్కొన్నారు. 2022 కల్లా దేశవ్యాప్తంగా ఇళ్లు లేని పేదలకు నివాసాన్ని కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతోనూ ఆయన మాట్లాడారు. తన ప్రసంగంలోనూ పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలనే ప్రస్తావించారు.

పట్టణాల్లో ప్రజాజీవనాన్ని మెరుగుపరిచేందుకు పరిశోధనశాలగా లక్నోను మార్చారంటూ మాజీ ప్రధాని వాజ్‌పేయిని ప్రశంసించారు. తమ ప్రభుత్వం దేశ యువత కోసం ఐదు ‘ఈ’ (ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ (జీవనానుకూల), ఎడ్యుకేషన్‌ (విద్య), ఎంప్లాయ్‌మెంట్‌ (ఉపాధి), ఎకానమీ (ఆర్థిక), ఎంటర్‌టైన్‌మెంట్‌ (వినోదం)) ల మంత్రంతో ముందుకెళ్తోందన్నారు. ఆదివారం లక్నోలో జరగనున్న దాదాపు రూ. 60వేల కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో ప్రధాని పాల్గొననున్నారు. అంతకుముందు ఆయన పెట్టుబడిదారుల సదస్సులో పాల్గొననున్నారు.  

Advertisement
Advertisement