52 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే

Congress Leader Dasoju Sravan Fires On TRS Government - Sakshi

కాంగ్రెస్‌ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌

సాక్షి, హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌ అసమర్థత కారణంగానే బీసీలకు రిజర్వేషన్లు దక్కటం లేదని కాంగ్రెస్‌ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ ఆరోపించారు. సోమవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. బీసీలకు రిజర్వేషన్లు కల్పించటంలో కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని కేసీఆర్‌ అనటం బట్ట కాల్చి మీదెయ్యటమేనని, ఉల్టా చోర్‌ కోత్వాల్‌ కో డాంటే అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. పంచాయతీరాజ్‌ చట్టాన్ని వెంటనే సవరించి బీసీలకు 52 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని, అసెంబ్లీని సమావేశపర్చాలని డిమాండ్‌ చేశారు.

‘నేను అన్యాయం చేస్తా కోర్టులు కూడా న్యాయం చెయ్యొద్దు అన్నట్టుగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు. 1999లో 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. ఇప్పుడు కూడా అలాగే పెట్టడం ఎలా న్యాయం అవుతుంది? కుల గణన చేయకుండా రిజర్వేషన్లు ఎలా ఇస్తారు? తెలంగాణలో 52 శాతం బీసీలు ఉన్నారని సమగ్ర సర్వేలో మీరే చెప్పి ఇప్పుడు 34 శాతం రిజర్వేషన్లు చాలని ఎలా అంటారు? మిగిలిన 18 శాతం వారికి అక్కర్లేదా?’ అని శ్రవణ్‌ ప్రశ్నించారు.

కోర్టులో మీ వ్యవహారాన్ని తప్పుబడుతున్న సందర్భంగానైనా కళ్లు తెరవాలని సూచించారు. సీఎం మీద ఒత్తిడి తేవాల్సిన బాధ్యత బీసీ సంఘాల మీద ఉందని అభిప్రాయపడ్డారు. 52 శాతం రిజర్వేషన్లకు కాంగ్రెస్‌ మద్దతు ఉందని, ఇదే విషయాన్ని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అనేక వేదికల మీద ప్రకటించారని తెలిపారు. కోర్టుకు కులాల వెనుకబాటుతనం గురించి సరిగా వివరిస్తే న్యాయం చేయెద్దని అంటారా అని ప్రశ్నించారు. బీసీలను ఏ, బీ, సీ, డీలుగా వర్గీకరించి 52 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కోరారు. ఉద్యమంలో.. రాష్ట్రం వస్తే అస్తిత్వం వస్తాదని పోరాడిన చిన్న చిన్న కులాలకు రిజర్వేషన్లు అక్కర్లేదా అని ప్రశ్నించారు. రాజకీయ అంటరానితనం అనుభవిస్తున్న తాను ఈ కేసు వేసినట్టు తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top