
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక గత నాలుగున్నరేళ్ల కాలంలో కేసీఆర్ చేసిన అవినీతిపై విచారణ జరిపిస్తామని బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. వివిధ సాగునీటి ప్రాజెక్టులు, పవర్ ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల కల్పనకు కేం ద్రం భారీగా నిధులిస్తే సొమ్మొకడిది సోకొకడిది అన్న చందంగా కేంద్రం ఇచ్చే నిధులతో కేసీఆర్ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.
ఎన్ని రకాలు గా దుష్ప్రచారం చేసినా వచ్చే ఎన్నికల్లో బీజేపీ నిర్మాణాత్మక శక్తిగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్, బీజేపీలకు లోపాయి కారీ ఒప్పందం ఉందన్న ప్రచారాన్ని దత్తాత్రేయ తిప్పికొట్టారు. కేసీఆర్‌తో బీజేపీకి ఎప్పటికీ మితృత్వం ఉండదన్నారు. కాంగ్రెస్‌తో పొత్తుకు వెంపర్లాడుతున్న చంద్రబాబు ఎప్పటికీ స్వయం ప్రకాశవంతుడు కాలేరన్నారు. దత్తాత్రేయతో పాటు రాజస్థాన్ ప్రభుత్వ సలహాదారు వెదిరే శ్రీరాం తదితరులు ఉన్నారు.