నిరసనల శబరిమల

Three women prevented from climbing the holy hills - Sakshi

ఆలయంలోకి వెళ్లకుండా తెలుగు మహిళలను అడ్డుకున్న ఆందోళనకారులు

పంబా: శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వస్తున మహిళా భక్తుల అడ్డగింపుల పర్వం ఐదో రోజూ కొనసాగింది. ఆదివారం ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన ఆరుగురు తెలుగు మహిళా భక్తులను ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బాలమ్మ(47) అనే మహిళ కుటుంబంతో కలసి శబరిమల కొండ ఎక్కుతుండగా సన్నిధానం వద్ద ఆందోళనకారులు పెద్ద ఎత్తున ‘స్వామియే శరణం అయ్యప్ప’ అంటూ నినాదాలు చేస్తూ ఆమెను అడ్డుకున్నారు. అప్పటికే 4 కిలోమీటర్ల మేర కొండ ఎక్కి వచ్చిన ఆమెను చుట్టుముట్టి వయసు ధ్రువీకరణ కోసం గుర్తింపు కార్డు చూపాల్సిందిగా కోరారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ ఘటనతో భయభ్రాంతులకు గురైన బాలమ్మ స్పృహ కోల్పోయారు.

దీంతో వెంటనే ఆమెను అంబులెన్స్‌లో పంబాలోని ఆస్పత్రికి తరలించారు. అంతకుముందు బంధువులతో వచ్చిన 40 ఏళ్ల వయసు ఉన్న మరో ఇద్దరు మహిళా భక్తులను కూడా కొండపైకి రానివ్వకుండా ఆందోళనకారులు నిలువరించారు. దీంతో పోలీసులు వారిరువురిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. అనంతరం నిలక్కల్‌ బేస్‌ క్యాంప్‌నకు వచ్చిన ఆ ఇద్దరు ఆలయ సాంప్రదాయాన్ని అతిక్రమించటానికి తాము ఇక్కడికి రాలేదని రాతపూర్వకంగా తెలిపారు. వారిరువురిని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వాసంతి (41), ఆదిశేషి (42)గా గుర్తించారు. శబరిమల ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నించిన రెహానా ఫాతిమాను ఇస్లాం నుంచి బహిష్కరించినట్లు కేరళ ముస్లిం జమాత్‌ మండలి వెల్లడించింది.  
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top