‘తనిఖీ లేకుండా 700కిలోమీటర్లు ఎలా వెళ్లాడు’

Questions After Vikas Dubey Arrest - Sakshi

లక్నో: వారం రోజులుగా త‌ప్పించుకు తిరుగుతున్న‌ ఉత్తర ప్రదేశ్‌కు చెందిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్‌ వికాస్ దూబేను ఎట్ట‌కేల‌కు పోలీసులు అరెస్టు చేశారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఉజ్జ‌యిని మ‌హంకాళి ఆల‌యంలో మాస్కు పెట్టుకుని తిరుగుతున్న అత‌డిని సెక్యూరిటీ సిబ్బంది గుర్తించి పోలీసులకు స‌మాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన‌ పోలీసులు గురువారం అత‌డిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే కాన్పూర్‌ ఎన్‌కౌంటర్‌ ఘటన తర్వాత పరారీలో ఉన్న వికాస్‌ దూబే దాదాపు 700కిలోమీటర్లు ప్రయాణించాడు. కారులో రోడ్డు మార్గం ద్వారా హరియాణాలోని ఫరిదాబాద్‌ చేరుకుని అక్కడ నుంచి రాజస్తాన్‌ కోటా మీదుగా ఉజ్జయిని ఆలయం చేరుకున్నాడు.(‘వాళ్లందరినీ చంపేయండి.. బతకొద్దు’)

ఈ క్రమంలో వికాస్‌ దూబే అరెస్ట్‌పై కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంకగాంధీ స్పందించారు. ‘ఎలాంటి తనిఖీ లేకుండా వికాస్‌ దూబే 700 కిలోమీటర్లు ప్రయాణించాడు అంటే ఆశ్చర్యంగా ఉంది. దారుణమైన ఎన్‌కౌంటర్‌ తర్వాత యూపీ ప్రభుత్వం వికాస్‌ దూబే గురించి అప్రమత్తం చేయడంలో విఫలమయ్యింది. అందువల్లే అతను‌ ఉజ్జయిని చేరుకోగలిగాడు. ఇది ప్రభుత్వ వైఫల్యాలనే కాక అతడికి గవర్నమెంట్‌తో కల సంబంధాలను సూచిస్తుంది’ అంటూ ట్వీట్‌ చేశారు. వికాస్‌ దూబేని అరెస్ట్‌ చేశారా లేక అతడే లొంగిపోయాడా అనే దాని గురించి వివరణ ఇవ్వాల్సిందిగా సమాజ్‌వాద్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోంది. అతడికి సంబంధించిన కాల్‌ రికార్డ్స్‌ను ప్రజలకు అందుబాటులో ఉంచాలి అని కోరింది.

మరో ఐపీఎస్‌ అధికారి అమితాబ్‌ ఠాకూర్‌ ‘మేం వికాస్‌ దూబేను అరెస్ట్‌ చేయలేదు.. అతడు ఉజ్జయినిలో లొంగిపోయాడు. ఇంత పెద్ద ఘటన జరిగిన తర్వాత అతడు అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లకుండా తిరుగుతూనే ఉన్నాడు. దీని గురించి దర్యాప్తు చేయాలి’ అంటూ ట్వీట్‌​ చేశారు. అయితే మధ్యప్రదేశ్‌ హోం మంత్రి నరోత్తం మిశ్రా మాత్రం వికాస్‌ దూబేను అరెస్ట్‌ చేశామని.. అతడు లొంగిపోలేదని స్పష్టం చేశాడు. బిట్టు, సురేష్‌ అనే ఇద్దరు అనుచరులతో కలిసి వికాస్‌ దూబే రాజస్తాన్‌ కోటా ద్వారా మధ్యప్రదేశ్‌లో ప్రవేశించాడని తెలిపారు. ఇందుకు గాను అతడు వికాస్‌ పాల్‌ అనే నకిలీ ఐడీని ఉపయోగించాడు అని తెలిపాడు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top