భారత్‌కు ‘స్వావలంబన’తోనే మోక్షం!

Narendra Modi Protectionist Instincts Are Right - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : చైనాకు భారత్‌ ఎగుమతి చేస్తున్న ఉత్పత్తులకు ఐదింతల ఉత్పత్తులను చైనా నుంచి భారత్‌ దిగుమతి చేసుకుంటోంది. కరోనా మహమ్మారి భారత్‌ను కుదిపేస్తున్న సమయంలో ఇది మరింత ప్రస్ఫుటమైంది. వైరస్‌ల నుంచి రక్షించుకునేందుకు వాడే గ్లౌజ్‌లు, మాస్క్‌లు, కవర్‌ సూట్లు మొదలుకొని కరోనా పరీక్షల కిట్ల కోసం చైనాపైనే భారత్‌ ఎక్కువగా ఆధారపడాల్సి వచ్చింది. చైనాకు భారత్‌ ఎగుమతి చేసే ఉత్పత్తులకన్నా చైనా నుంచి భారత్‌ దిగుమతులు చేసుకుంటున్న ఉత్పత్తుల విలువ 50 బిలియన్‌ డాలర్లు ఎక్కువంటే ఆశ్చర్యం వేస్తుంది.

భారత టెక్నాలజీ రంగంపై కూడా చైనా ఆధిపత్యమే కనిపిస్తోంది. 2015 నుంచి నేటి వరకు భారతీయ టెక్నాలజీ రంగంపై చైనా ఏడు బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను పెట్టింది. భారత ప్రభుత్వాన్ని కూడా ప్రభావితం చేయాలంటే చైనాకు టెక్నాలజీ రంగంపైనున్న ఆధిపత్యం సరిపోతుంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొనే కరోనా ప్రభావిత ఆర్థిక వ్యవస్థను రక్షించుకోవాలంటే భారత్‌కు స్వావలంబన ఒక్కటే మార్గమని ప్రధాని నరేంద్ర మోదీ భావించారని, అందులో భాగంగా 200 కోట్ల రూపాయలకు మించని ప్రతి సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమలను భారతీయులకే అప్పగిస్తామని ఆయన చెప్పడం ప్రశంసనీయమని ఆర్థిక నిపుణలు చెబుతున్నారు.

అమెరికా స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నుంచి చైనా కంపెనీలన్నింటిని తొలగిస్తూ అమెరికా సెనేట్‌ బిల్లు తీసుకరావడం ఇరు దిగ్గజ దేశాల మధ్య సరికొత్త వ్యాపార యుద్ధానికి తెరలేచిందని, ఈ సమయంలో మోదీ తీసుకున్న నిర్ణయం ఎంతో సముచితమని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మోదీ నిర్ణయాన్ని జాతీయ మీడియా తప్పు పట్టడాన్ని వారు విమర్శిస్తున్నారు. స్వావలంబన నిర్ణయాలు ఎంత మేరకు అమలవుతాయన్న విషయాన్ని ప్రస్తుతానికి పక్కన పెడితే నిర్ణయంలో తప్పు వెతకరాదని వారు హితవు చెబుతున్నారు. (కార్మికుల రైలు బండికి ‘టైం టేబుల్‌’ లేదట!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top