మరో రిజర్వేషన్ల పోరాటం

Dhangars to blockade roads today over quota demand - Sakshi

మహారాష్ట్రలో ధన్‌గర్‌ వర్గం ఆందోళన

సాక్షి, ముంబై: మహారాష్ట్రలో మరాఠాల తర్వాత మరో సామాజిక వర్గం విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కోరుతూ ఆందోళనలు చేపట్టింది. ధన్‌గర్‌ సామాజిక వర్గీయులు(గొర్రెల కాపరులు)..  తమను షెడ్యూల్డ్‌ తెగ (ఎస్టీ)ల జాబితాలో చేర్చి రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో సోమవారం మహారాష్ట్రవ్యాప్తంగా నిరసనల్లో పాల్గొన్నారు. ధన్‌గర్‌ సంఘర్ష సమితి మహారాష్ట్ర రాజ్య (డీఎస్‌ఎస్‌ఎంఆర్‌) ఈ నిరసనలకు నేతృత్వం వహించింది. ముంబైతోపాటు విదర్భ, పశ్చిమ, ఉత్తర మహారాష్ట్రల్లో నిరసనలు సాగాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై వాహనాలకు అడ్డంగా మేకలు, గొర్రెలను తోలి వినూత్నంగా రాస్తారోకో చేపట్టారు.

కాంగ్రెస్‌–ఎన్సీపీ కూటమి మహారాష్ట్రలో అధికారంలో ఉన్నప్పుడే ధన్‌గర్‌ ప్రజలు రిజర్వేషన్లు కోరుతూ ఆందోళనకు దిగారు. ప్రస్తుత బీజేపీ సీఎం ఫడ్నవిస్‌ అప్పట్లో ధన్‌గర్‌ సమాజం ఏర్పాటు చేసిన వేదికపై మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే తొలి మంత్రివర్గ సమావేశంలో ఈ సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లయినా తమ గురించి పట్టించుకోవడం లేదని ఆందోళనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించే అంశంపై నివేదికను రూపొందిస్తున్న టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ ఈ నెల 26లోపు తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలనీ, లేకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top