భారత్‌ ఇక ఆ విషయాన్ని మర్చిపోవాల్సిందే : పాక్‌

Pakistan Tells India Supposed To Forget About Kartarpur Corridor Opening - Sakshi

కర్తార్‌పూర్‌ కారిడార్‌పై పాక్‌ యూటర్న్‌!?

ఇస్లామాబాద్‌ : దాయాది దేశం పాకిస్తాన్‌ మరోసారి తన కపట బుద్ధిని ప్రదర్శించింది. భారత్‌తో శాంతి చర్చలకు సిద్ధమని చెబుతూనే సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా తమతో చర్చలు జరిపేందుకు భారత్‌ సుముఖంగా లేనట్లైతే కర్తార్‌పూర్‌ కారిడార్‌ విషయాన్ని మర్చిపోవాల్సి ఉంటుందంటూ హెచ్చరికలు జారీ చేసింది.

మీ నిర్ణయంపైనే ఆధారపడి ఉంది...
పాకిస్తాన్‌ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మహ్మద్‌ ఫైజల్‌ మాట్లాడుతూ.. ‘భారత్‌తో చర్చలకు సిద్ధమని మేము చెప్పాం. అయితే ఇంతవరకు వారి నుంచి ఎటువంటి సమాధానం లభించలేదు. అంతేకాకుండా సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్ 550వ జయంతి సందర్భంగా పాకిస్థాన్‌లో ఉన్న కర్తార్‌పూర్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్ కారిడార్‌ను తెరవాలని భావించాం. కానీ ప్రస్తుతం చర్చల విషయమై భారత్‌ తీసుకునే నిర్ణయంపైనే ఈ అంశం ఆధారపడి ఉంది. ఒకవేళ వాళ్లకి మాతో చర్చలు జరపడం ఇష్టం లేకపోయినట్లైతే ఈ విషయాన్ని మర్చిపోవచ్చు’ అంటూ వ్యాఖ్యానించారు.

కాగా సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్‌ సాహెబ్‌ తన జీవితంలోని చివరి 18 ఏళ్ల కాలాన్ని కర్తార్‌పూర్‌ సాహెబ్‌ గురుద్వారాలో గడిపారు. 1539లో  అక్కడే ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఈ గురుద్వార పాకిస్థాన్‌లోని పంజాబ్‌ రాష్ట్రంలో గల కర్తార్‌పూర్‌(భారత్‌- పాకిస్థాన్‌ సరిహద్దు నుంచి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది) గ్రామంలో ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది గురునానక్‌ 550వ జయంతి వేడుకల్లో భాగంగా కర్తార్‌పూర్‌ గురుద్వార మార్గాన్ని తెరవాలని భావిస్తున్నట్లు పాక్‌ అధికారుల నుంచి సంకేతాలు వెలువడ్డాయి. అదేవిధంగా పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న పంజాబ్‌ మంత్రి నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తీకరించడంతో భారత్‌లోని సిక్కులు ఆనందం వ్యక్తం చేశారు. కానీ పాక్‌ విదేశాంగ అధికారుల పద్ధతి చూస్తుంటే వారి ఆనందం ఆవిరయ్యేట్టుగా కన్పిస్తోంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top