ఉమ్మడిగా ఉగ్రపీచం అణచేద్దాం

Modi holds key bilateral meetings with Abe, Turnbull and Vietnamese PM - Sakshi

ఆసియాన్‌–భారత్‌ సదస్సులో ప్రధాని మోదీ పిలుపు

ఇండో–పసిఫిక్‌లో ‘నిబంధనల ఆధారిత భద్రతా విధానం’ అవసరం

‘తూర్పు ఆసియా’ కూటమికి సహకారం కొనసాగిస్తాం

షింజో అబే, టర్న్‌బుల్‌తో మోదీ ప్రత్యేక చర్చలు

న్యూజిలాండ్, వియత్నాం, బ్రూనై అధినేతలతో ద్వైపాక్షిక భేటీలు

మనీలా: ఉగ్రవాదం, తీవ్రవాదంతో పాటు సీమాంతర ఉగ్రవాదం మనం ఎదుర్కొం టున్న ప్రధాన సవాళ్లని, అన్ని దేశాలు వాటిని సమష్టిగా ఎదుర్కొనే సమయం ఆసన్నమైందని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అలాగే ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో నిబంధనల ఆధారిత ప్రాంతీయ భద్రతా విధానం ఎంతో అవసరమని ‘ఆసియాన్‌–భారత్‌’ సదస్సులో మంగళవారం మోదీ నొక్కి చెప్పారు. ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో చైనా దూకుడు నేపథ్యంలో వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని పరోక్షంగా ఇలా సూచించారు. తూర్పు ఆసియా సదస్సులో ప్రసంగిస్తూ... కూటమితో పనిచేసేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని మోదీ స్పష్టం చేశారు.  

‘ఆసియాన్‌ (ఆగ్నేయాసియా దేశాల కూటమి) ప్రాంతంలో నిబంధనల ఆధారిత భద్రతా వ్యవస్థ రూపకల్పనకు భారత్‌ తన మద్దతును కొనసాగిస్తుంది. ఆసియాన్‌ కూటమి ప్రయోజనాలు, శాంతియుత అభివృద్ధికి ప్రామాణికమైన ఈ విధానానికి మేం అండగా ఉంటాం’ అని ఆసియాన్‌లో మోదీ ప్రధానంగా పేర్కొన్నారు. స్వేచ్ఛాయుత ఇండో–పసిఫిక్‌ ప్రాంతం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో సోమవారం చర్చల అనంతరం మోదీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

అలాగే ఈ ప్రాంతంలోని దేశాలన్ని కలసికట్టుగా ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు సమష్టిగా ప్రయత్నించాలని ప్రధాని పిలుపునిచ్చారు. ‘ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు మనం విడిగా చాలా ప్రయత్నించాం. ఈ ప్రాంతంలో ప్రధాన సవాలును ఉమ్మడిగా పరిష్కరించేందుకు సహకారాన్ని విస్తృతం చేసుకోవాల్సిన తరుణమిదే’ అని చెప్పారు.   

ఆసియాన్‌ దేశాధినేతలకు  ఆహ్వానం
భారత్, ఆసియాన్‌ మధ్య ‘పరస్పర విలువలు, ఉమ్మడి లక్ష్యం’పై ప్రధాని ప్రసంగిస్తూ.. ‘ఆసియాన్‌–భారత్‌ 25వ స్మారక వార్షికోత్సవాలకు సరైన ముగింపు ఇవ్వాలని నేను ఆశిస్తున్నాను. 25, జనవరి 2018న న్యూఢిల్లీలో ఇండో–ఆసియాన్‌ ప్రత్యేక సదస్సులో మిమ్మల్ని కలిసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని ప్రధాని చెప్పారు.

భారత 69వ రిపబ్లిక్‌ దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథులుగా ఆసియాన్‌ నేతలకు ఆహ్వానం పలికేందుకు భారత్‌లో 125 కోట్ల మంది ప్రజలు ఆసక్తిగా ఉన్నారని మోదీ పేర్కొన్నారు. ఆసియాన్‌లో థాయ్‌లాండ్, వియత్నాం, ఇండోనేసియా, మలేసియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, మయన్మార్, కంబోడియా, లావోస్, బ్రూనైలు సభ్య దేశాలుగా ఉన్నాయి.

ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో అత్యంత ప్రభావవంతమైన కూటమిలో ఒకటైన ఆసియాన్‌లో భారత్, అమెరికా, చైనా, జపాన్, ఆస్ట్రేలియాలు చర్చల్లో భాగస్వాములుగా కొనసాగుతున్నాయి. ఆసియాన్‌ సదస్సుతో పాటు.. ప్రధాని నరేంద్ర మోదీ ‘రీజినల్‌ కాంప్రహెన్సివ్‌ ఎకనామిక్‌ పార్టనర్‌షిప్‌’(ఆర్‌సీఈపీ) సదస్సులో కూడా పాల్గొన్నారు. ఆర్‌సీఈపీలో 10 ఆసియాన్‌ సభ్య దేశాలతో పాటు, భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ భాగస్వాములుగా ఉన్నాయి. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై ఈ దేశాలు చర్చలు కొనసాగించాయి.  

‘తూర్పు ఆసియా’ది కీలక పాత్ర
ఆసియాన్‌–భారత్‌ సదస్సుతో పాటు.. తూర్పు ఆసియా సదస్సులో కూడా ప్రధాని ప్రసంగించారు. తూర్పు ఆసియా ప్రాంతంలో రాజకీయ, భద్రత, వాణిజ్యపర అంశాల పరిష్కారంలో భారత్‌ పూర్తి సహకారం అందిస్తుందని, ఆ కూటమితో కలిసి పనిచేసేందుకు భారత్‌ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో తూర్పు ఆసియా సదస్సు కీలక పాత్ర పోషించాలని భారత్‌ ఆశిస్తుందన్నారు.

ఆసియా–పసిఫిక్‌ ప్రాంతంలో ఈస్ట్‌ ఆసియా సదస్సు ఎంతో ముఖ్యమైన వేదిక. 2005లో ప్రారంభమైన ఈ సదస్సు వ్యూహాత్మక అంశాలు, అంతర్జాతీయ రాజకీయాలు, తూర్పు ఆసియా ఆర్థిక వికాసంలో గణనీయమైన పాత్ర పోషిస్తోంది. తూర్పు ఆసియా సదస్సులో ఆసియాన్‌ సభ్య దేశాలతో పాటు, భారత్, చైనా, జపాన్, దక్షిణకొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా, రష్యాలు కూడా భాగస్వాములుగా ఉన్నాయి.

చతుర్భుజంపై అబే, టర్న్‌బుల్‌తో చర్చలు
ఆసియాన్‌ సదస్సుకు హాజరైన ప్రధాని మోదీ.. జపాన్‌ ప్రధాని షింజో అబే, ఆస్ట్రేలియా ప్రధాని మాల్కం టర్న్‌బుల్‌తో విడిగా భేటీ అయ్యారు. ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో భారత్, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియాల మధ్య చతుర్భుజ కూటమి ఏర్పాటు కోసం జరుగుతున్న కసరత్తుపై ఈ భేటీల్లో చర్చించినట్లు సమాచారం.

ఆసియాన్‌ సదస్సు రెండో రోజున మోదీ వియత్నాం ప్రధాని న్యుయెన్‌ గ్జుయాన్‌ ఫుక్, బ్రూనై సుల్తాన్‌ హస్సనల్‌ బోల్కియా, న్యూజిలాండ్‌ ప్రధాని జసిందా అడెర్న్‌లతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అబేతో భేటీ అనంతరం మోదీ ట్వీట్‌ చేస్తూ.. ‘అబేతో సమావేశం అద్భుతంగా సాగింది. ఆర్థిక అంశాలతో పాటు ఇరు దేశ ప్రజల మధ్య సంబంధాల మెరుగుపై  చర్చించాం’ అని పేర్కొన్నారు.

ఆస్ట్రేలియా ప్రధానితో చర్చలు ఆ దేశంతో స్నేహ సంబంధాల్లో కొత్త ఉత్తేజం తీసుకొచ్చాయని ప్రధాని చెప్పారు. న్యూజిలాండ్, బ్రూనై దేశాధినేతలతో చర్చలు ఫలప్రదంగా సాగాయని మోదీ ట్వీటర్‌లో వెల్లడించారు. కాగా తూర్పు ఆసియా సదస్సు వేదికగా చైనా ప్రధాని లీ కెకియాంగ్‌తో ప్రధాని కొద్ది సేపు చర్చించారు. ఆసియాన్, తూర్పు ఆసియా సదస్సుల కోసం ఫిలిప్పీన్స్‌ వెళ్లిన ప్రధాని మోదీ మూడు రోజుల పర్యటన ముగించుకుని మంగళవారం రాత్రి భారత్‌కు బయల్దేరారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top