ఆరు సంవత్సరాల తర్వాత.. | Sakshi
Sakshi News home page

ఆరు సంవత్సరాల తర్వాత..

Published Thu, Mar 29 2018 9:03 AM

Malala makes first trip to Pakistan after 6 years  - Sakshi

ఇస్లామాబాద్‌: నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్‌ గురువారం పాకిస్తాన్‌ చేరుకున్నారు. తనపై తాలిబన్‌ ఉగ్రవాదులు దాడి చేసిన ఆరు సంవత్సరాల తర్వాత స్వదేశానికి వచ్చారు. బాలికలకు చదువు అవసరమని ప్రచారం చేయడంతో 2012లో తాలిబన్‌ ఉగ్రవాది ఒకరు ఆమెను కాల్చారు. అదృష్టవశాత్తూ ఆమె ప్రాణాలతో బయటపడగలిగింది. ఆ తర్వాత ఆమెను చికిత్స నిమిత్తం లండన్‌ తరలించారు. బర్మింగ్‌హామ్‌ నగరంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందించారు.

బ్రిటీష్‌ ప్రభుత్వం కూడా ఉదారభావంతో ఆమెకు అక్కడ ఉండేందుకు ఆశ్రయం కల్పించింది. అక్కడే మలాలా తన చదువును కూడా పూర్తి చేసింది. గురువారం మలాలా రాక సందర్భంగా ఇస్లామాబాద్‌లోని బేనజీర్‌ భుట్టో అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రత కట్టుదిట్టం చేశారు. మలాలా రాక విషయాన్ని కూడా గోప్యంగా ఉంచారు. ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల కోసం, బాలికల చదువుకోసం ఆమె చేసిన పోరాటానికి గానూ 2014లో నోబెల్‌ శాంతి బహుమతి లభించింది. 

మలాలా రాక విషయం తెలిసి చాలా మంది పాకిస్తానీలు సంతోషం వ్యక్తం చేశారు. కానీ వ్యతిరేకులు మాత్రం ఆమెపై విమర్శలు కురిపించారు. ఆమె పాశ్చాత్య దేశాల ఏజెంట్‌ అని, దేశం పరువు తీస్తున్నదని సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేస్తున్నారు. రాజకీయ నాయకులు, కామెంటేటర్లు దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని.. అంతర్జాయతీయ మీడియా ఫోకస్‌ అంతా ఆమె స్వదేశాగమనంపైనే ఉందని, ఇలాంటి వ్యాఖ్యలు, చేష్టల వల్ల పాకిస్తాన్‌ ఇమేజీ  దెబ్బతింటుందని, సహనం ప్రదర్శించాలని వ్యతిరేకులకు హమీద్‌ మీర్‌ అనే జర్నలిస్టు విన్నవించారు. 

స్వాత్‌ లోయలో బాలికల విద్యను నిషేధించడంతో 2009లో బీబీసీ ఛానల్‌లో ఓ ఉర్దూ ప్రోగాం కోసం ఆమె ఒక బ్లాగును రాయడం ప్రారంభించారు. అప్పటి నుంచి బాలికల విద్యపై ప్రచారం సాగించారు. 2007లో స్వాత్‌ లోయను ఇస్లామిక్‌ తీవ్రవాదులు స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి అక్కడ క్రూరమైన పాలన సాగుతోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement