breaking news
malala yousufjai
-
ఆరు సంవత్సరాల తర్వాత..
ఇస్లామాబాద్: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ గురువారం పాకిస్తాన్ చేరుకున్నారు. తనపై తాలిబన్ ఉగ్రవాదులు దాడి చేసిన ఆరు సంవత్సరాల తర్వాత స్వదేశానికి వచ్చారు. బాలికలకు చదువు అవసరమని ప్రచారం చేయడంతో 2012లో తాలిబన్ ఉగ్రవాది ఒకరు ఆమెను కాల్చారు. అదృష్టవశాత్తూ ఆమె ప్రాణాలతో బయటపడగలిగింది. ఆ తర్వాత ఆమెను చికిత్స నిమిత్తం లండన్ తరలించారు. బర్మింగ్‌హామ్ నగరంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందించారు. బ్రిటీష్ ప్రభుత్వం కూడా ఉదారభావంతో ఆమెకు అక్కడ ఉండేందుకు ఆశ్రయం కల్పించింది. అక్కడే మలాలా తన చదువును కూడా పూర్తి చేసింది. గురువారం మలాలా రాక సందర్భంగా ఇస్లామాబాద్‌లోని బేనజీర్ భుట్టో అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రత కట్టుదిట్టం చేశారు. మలాలా రాక విషయాన్ని కూడా గోప్యంగా ఉంచారు. ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల కోసం, బాలికల చదువుకోసం ఆమె చేసిన పోరాటానికి గానూ 2014లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. మలాలా రాక విషయం తెలిసి చాలా మంది పాకిస్తానీలు సంతోషం వ్యక్తం చేశారు. కానీ వ్యతిరేకులు మాత్రం ఆమెపై విమర్శలు కురిపించారు. ఆమె పాశ్చాత్య దేశాల ఏజెంట్ అని, దేశం పరువు తీస్తున్నదని సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేస్తున్నారు. రాజకీయ నాయకులు, కామెంటేటర్లు దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని.. అంతర్జాయతీయ మీడియా ఫోకస్ అంతా ఆమె స్వదేశాగమనంపైనే ఉందని, ఇలాంటి వ్యాఖ్యలు, చేష్టల వల్ల పాకిస్తాన్ ఇమేజీ దెబ్బతింటుందని, సహనం ప్రదర్శించాలని వ్యతిరేకులకు హమీద్ మీర్ అనే జర్నలిస్టు విన్నవించారు. స్వాత్ లోయలో బాలికల విద్యను నిషేధించడంతో 2009లో బీబీసీ ఛానల్లో ఓ ఉర్దూ ప్రోగాం కోసం ఆమె ఒక బ్లాగును రాయడం ప్రారంభించారు. అప్పటి నుంచి బాలికల విద్యపై ప్రచారం సాగించారు. 2007లో స్వాత్ లోయను ఇస్లామిక్ తీవ్రవాదులు స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి అక్కడ క్రూరమైన పాలన సాగుతోంది. -
మలాలాపై దాడి కేసు దోషులకు పాతికేళ్ల జైలు
-
మలాలాపై దాడి కేసు దోషులకు పాతికేళ్ల జైలు
మలాలా యూసుఫ్‌జాయ్.. తీవ్రవాదులను ధైర్యంగా ఎదిరించి నోబెల్ శాంతి బహుమతి పొందిన యువతి. ఆమెపై దాడి చేసిన కేసులో దోషులకు పాకిస్థాన్‌లోని ఉగ్రవాద వ్యతిరేక కోర్టు పాతికేళ్ల జైలుశిక్ష విధించింది. మలాలాతో పాటు మరో ఇద్దరు అమ్మాయిలపై దాడి చేసిన కేసులో నిందితులైన ఉగ్రవాదులను గత సంవత్సరం సెప్టెంబర్‌లో అరెస్టు చేశారు. వాళ్లందరికీ కోర్టు 25 సంవత్సరాల విధించింది. మలాలా యూసుఫ్‌జాయ్, షాజియా రంజాన్, కైనత్ రియాజ్ అనే ముగ్గురు అమ్మాయిలపై దాడి వెనుక తెహరీక్ ఎ తాలిబన్ పాకిస్థాన్ కమాండర్ ముల్లా ఫజలుల్లా హస్తం ఉందన్న విషయాన్ని ఉగ్రవాదులు అంగీకరించినట్లు డీజీ ఆసిం బజ్వా తెలిపారు. మలాలాకు 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆమె స్కూలుకు వెళ్తుండగా ఓ ఉగ్రవాది ఆమెను తలలో కాల్చాడు. అమ్మాయిలు చదువుకోవాలని ప్రచారం చేస్తున్నందుకే ఆమెపై దాడి జరిగింది. గత సంవత్సరం ఆమెకు భారతీయుడు కైలాష్ సత్యార్థితో కలిసి నోబెల్ శాంతి బహుమతి ప్రకటించారు.