వద్దన్నా వెంటాడే గూగుల్‌ నిఘా

Google records your location even when you tell it not to - Sakshi

అనుమతి లేకుండానే యూజర్ల లొకేషన్‌ వివరాల సేకరణ

ఆండ్రాయిడ్, ఐఫోన్‌ యూజర్లపై నిఘా

శాన్‌ఫ్రాన్సిస్కో: టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌ మీపై నిఘా పెడుతోందా? మీరు వద్దన్నా సరే మీ రాకపోకలు, మేసేజ్‌లు అన్నింటిని రికార్డు చేస్తోందా? అంటే నిపుణులు అవుననే జవాబిస్తున్నారు. తమ ప్రయాణ వివరాలు రికార్డు చేయవద్దని సెట్టింగ్స్‌ పెట్టినప్పటికీ గూగుల్‌ ఆండ్రాయిడ్, ఐఫోన్‌ యూజర్ల సమాచార సేకరణను ఆపడంలేదు. అసోసియేటెడ్‌ ప్రెస్‌ జరిపిన పరిశోధనలో ఈ సంచలనాత్మక విషయం వెల్లడైంది. ఈ వివరాలను ప్రిన్స్‌టన్‌ విశ్వవిద్యాలయం కంప్యూటర్‌ సైన్స్‌ పరిశోధకులకు పంపగా అనుమతి లేకుండా పౌరుల సమాచారాన్ని గూగుల్‌ సేకరిస్తోందని వారు ధ్రువీకరించారు. ‘గూగుల్‌ మ్యాప్స్‌’ వాడేటప్పుడు యూజర్‌ ఉన్న లొకేషన్‌ తెల్సుకునేందుకు అనుమతి ఇవ్వాలి.

అలా చేస్తే ప్రజలు ఫోన్‌తో ఏ చోట్లకెళ్లారు? అక్కడ ఎంతసేపున్నారు? తదితర అంశాలను ఆటోమేటిక్‌గా రికార్డు చేస్తుంది. అయితే ఇది ఇష్టం లేని యూజర్ల కోసం ‘లొకేషన్‌ హిస్టరీ ఆప్షన్‌’ను ఆఫ్‌ చేసే సౌకర్యాన్ని గూగుల్‌ తెచ్చింది. దీన్నివాడితే యూజర్లు ఎక్కడున్నారో రికార్డు కాదని  గూగుల్‌ చెప్పింది. తాజాగా పరిశోధకులు ఇది అబద్ధమని తేల్చారు. లొకేషన్‌ హిస్టరీ ఆప్షన్‌ ను నిలిపివేసినా కొన్ని గూగుల్‌యాప్స్‌ కస్టమర్లు ఎక్కడ, ఎంతసేపు ఉన్నారో రికార్డు చేస్తున్నాయని తేల్చారు. గూగుల్‌ మ్యాప్‌ యాప్‌ను ఒక క్షణం ఓపెన్‌ చేసినా స్క్రీన్‌ షాట్‌ ఆటోమేటిక్‌గా గూగుల్‌ తీసేసుకుంటోందని పరిశోధకులు తెలిపారు.  ఆటోమేటిక్‌గా వాతావరణం గురించి చెప్పే యాప్స్‌ కూడా యూజర్లు ఎక్కడ ఉన్నారన్న సమాచారాన్ని గూగుల్‌కు పంపిస్తూనే ఉంటాయి.

లొకేషన్‌కు సంబంధం లేని మరికొన్ని యాప్స్‌ అయితే కేవలం 30 సెం.మీ కచ్చితత్వంతో ఆండ్రాయిడ్, ఐఫోన్‌ వినియోగదారుల సమస్త సమాచారాన్ని గూగుల్‌కు అందజేస్తున్నాయి. 200 కోట్ల మందికి పైగా ఉన్న ఆండ్రాయిడ్, ఐఫోన్‌ వినియోగదారుల సమాచారాన్ని గూగుల్‌ రికార్డు చేసిందన్నారు. వినియోగదారుల అనుమతి లేకుండా గూగుల్‌ వారి సమాచారాన్ని దొంగతనంగా సేకరించిందని ప్రిన్స్‌టన్‌ వర్సిటీకి చెందిన కంప్యూటర్‌ శాస్త్రవేత్త జొనాథన్‌ మేయర్‌ తెలిపారు. వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు వేర్వేరు మార్గాల్లో తాము యూజర్ల సమాచారాన్ని సేకరిస్తామని గూగుల్‌ ప్రతినిధి చెప్పారు. యూజర్లు myactivity.google.com ద్వారా తమ సెర్చింగ్‌లు, ఇతర వివరాలను చూసుకోవచ్చు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top