'రాబిన్ హుడ్' ఆకలిపై పోరాటం!

'రాబిన్ హుడ్' ఆకలిపై పోరాటం! - Sakshi


పారబోసేది వారబోయమన్నారు పెద్దలు... మనకు ఎక్కువై బయట పడేసేది మరొకరి కడుపు నింపుతుందని వారి నమ్మకం. అదే విషయాన్ని అక్షరాలా పాటిస్తున్నారు ఆ యువ సైన్యం. భారత, పాకిస్తాన్ దేశాలను వెంటాడుతున్న ఆకలిపై పోరాటానికి సిద్ధమయ్యారు. రాబిన్ హుడ్స్ పేరిట ఆరుగురు యువకులు ప్రత్యేక సేవా కార్యక్రమాన్ని భుజానికెత్తుకున్నారు. ఆకుపచ్చని వస్త్రాలను ధరించి, ఎన్నో పట్టణాల్లో తమ సేవలను విస్తరించి... ఆకలితో పోరాడే శక్తివంతమైన ఆయుధాలుగా మారారు.



ఢిల్లీకి చెందిన ఆరుగురు యువకులు ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాబిన్ హుడ్ పేరిట ప్రారంభమైన వారి సేవా కార్యక్రమం..ఆపారంగా వ్యర్థమౌతున్న ఆహారాన్ని సద్వినియోగం చేయడమే. విందు సమయాల్లో, రెస్టారెంట్లలో మిగిలిపోయిన ఆహారాన్ని ఆకలితో అలమటించేవారికి పంపిణీ చేయడం పరమావధిగా ఎంచుకున్నారు. ఒక్క ఇండియాలోనే కాక, తమ సేవలను పాకిస్తాన్ పట్టణాలకూ వ్యాపింపజేసిన ఆర్ హెచ్ ఏ ప్రస్తుతం వెయ్యిమంది వాలంటీర్లతో 18 నగరాల్లో విస్తరించి సుమారు రెండున్నర లక్షలమంది ఆకలితో ఉన్న ప్రజలకు ఆహారాన్ని అందిస్తోంది.



పోర్చుగల్ రెస్టారెంట్లో ఉద్యోగిగా పనిచేస్తున్ననీల్... అప్పట్లో తమ వద్దకు వచ్చిన రీ ఫుడ్ సంస్థ సభ్యులను చూసి ఎంతో స్ఫూర్తిని పొందాడు. సంస్థ సభ్యులు రెస్టారెంట్ లోని ఆహారాన్ని సేకరించి ఆకలితో ఉన్నవారికి అందించడం నీల్ ను ఎంతగానో ఆకట్టుకుంది. ఇటువంటి సేవలను ఇండియాలో ఎందుకు ప్రారంభించకూడదు అనుకున్నాడు. ఢిల్లీకి వచ్చిన అనంతరం తన స్నేహితులకు వివరించాడు. ఇంచుమించుగా 'రీఫుడ్' మాదిరిగానే తమ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు.



పలు నగరాల్లోని రెస్టారెంట్లు, వెడ్డింగ్ కాటరర్లకు తమ కార్యక్రమాన్ని వివరించిన 'ఆర్ హెచ్ ఏ' సభ్యులు.. వారి వద్దనుంచీ మిగిలిపోయిన ఆహారాన్ని సేకరించి, ప్యాకెట్లుగా తయారు చేసి పంపిణీ చేయడం ప్రారంభించారు. అయితే వాలంటీర్లంతా ఉద్యోగస్థులు కావడంతో ఈ కార్యక్రమాన్ని ఎక్కువగా వారాంతాల్లో చేయడం కొనసాగిస్తున్నారు. 2014 లో నీల్, ఆనంద్ ల బృందం.. సుమారు 150 మందికి ఆహారాన్ని అందించడం ప్రారంభించింది. అయితే నేడు సుమారు వెయ్యిమంది వాలంటీర్లతో రాబిన్ హుడ్... పలు పట్టణాల్లో లక్షల మందికి ఆహారం పంపిణీ చేస్తోంది. రాబిన్ హుడ్ కార్యక్రమాల్లో ముఖ్యమైనది ఆహార పంపిణీ అయినా... పలు ఇతర సేవలను కూడ అందిస్తోంది. చలికాలంలో ఢిల్లీలోని నిరుపేదలు, అనాధలకు దుప్పట్లు వంటివి అందిస్తోంది. ప్రస్తుతం పలు విభాగాలుగా ఏర్పడిన రాబిన్ హుడ్... ఒక్క ఢిల్లీలోనే ఏడు ఛాప్టర్లు పని చేస్తుండగా... ముంబైలో తొమ్మిది, ఇతర పట్టణాల్లో పలు విభాగాలు పనిచేస్తున్నాయి. ప్రతి విభాగంలోనూ సభ్యులంతా ఆ ఛాప్టర్ హెడ్ ఆధ్వర్యంలో ఎంతో ఉత్సాహంతో పనిచేస్తున్నారు. వీరంతా ముఖ్యంగా వాట్సాప్, ఫేస్ బుక్ గ్రూపుల ద్వారా తమ సేవలను అందిస్తున్నారు.



'ఆర్ హెచ్ ఏ' వాలంటీర్లు పెరగడంలో ముఖ్యంగా సోషల్ మీడియా ప్రధాన పాత్ర పోషిస్తోంది. తమ బృందంలో సేవలందించేందుకు ఎటువంటి ప్రత్యేక నిబంధనలు లేవని, అయితే  రెండు విషయాలను మాత్రం సేవకులు దృష్టిలో ఉంచుకోవాలని   గ్రూప్ ప్రారంభ నిర్వాహకుడు నీల్ అంటున్నారు. వాటిలో ఒకటి ఎవరిదగ్గరా, ఎటువంటి ఫండ్స్ వసూలు చేయకూడదని, తయారు చేసి, ఆరుగంటలకు మించిన ఆహారం సేకరించకూడదని మాత్రం చెప్తున్నారు. ప్రస్తుతం ఇండియాలోనే కాక, పాకిస్తాన్ లోని నాలుగు నగరాల్లో  'ఆర్ హెచ్ ఏ' సేవలు అందిస్తోంది. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన నీల్ స్నేహితురాలు తారా  పాకిస్తాన్ లో సేవలను ప్రారంభించారు.



ప్రస్తుతం రెండు దేశాల్లోనూ 'ఆర్ హెచ్ ఏ' వాలంటీర్లు 23 నుంచి 30 మధ్య వయస్కులే ఎక్కువగా  ఉన్నారు. అత్యంత ఉత్సాహభరితంగా ఉన్న కొందరు 50 ఏళ్ళ వయస్కులు కూడ ఉండగా... కోల్ కతాలో ఐదేళ్ళ అత్యంత చిన్న వయసు బాలుడు కూడ ప్రత్యేక సేవలు అందిస్తున్నాడు. ప్రస్తుతం నీల్, ఆనంద్ లు ఇరు దేశాల్లో పాఠశాలల్లో కూడ తమ సేవలను విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారు. తమ సేవలతో ఆకలి సమస్య కొంతవరకైనా తీరాలని తాపత్రయ పడుతున్నారు.




Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top