
పవన్‌కల్యాణ్ నయా లుక్ డ్రెస్సింగ్ డిజైనర్ రాజేశ్
కాస్త రఫ్‌గా కనిపించాలి.. మాస్‌ను మైమరిపించాలి.. క్లాస్‌ను కట్టిపడేయాలి.. అమ్మాయిలను ఆకర్షించే కొత్త లుక్‌లో కనిపించాలి.. ఆ స్టైల్‌ను యూత్ క్రేజీగా అనుకరించాలి..
బంజారాహిల్స్, న్యూస్‌లైన్: కాస్త రఫ్‌గా కనిపించాలి.. మాస్‌ను మైమరిపించాలి.. క్లాస్‌ను కట్టిపడేయాలి.. అమ్మాయిలను ఆకర్షించే కొత్త లుక్‌లో కనిపించాలి.. ఆ స్టైల్‌ను యూత్ క్రేజీగా అనుకరించాలి.. మొత్తంగా చూస్తే.. ‘పవనిజానికి’, ఫ్యాషన్‌కు పట్టం కట్టాలి.. ఇలాంటి క్రేజీ కాంబినేషన్‌ను రూపొందించేది మన నగర యువకుడే. ‘కొమురం పులి’లో పవన్‌కల్యాణ్ డిఫరెంట్‌గా కనిపించడం వెనుక.. ‘అత్తారింటికి దారేది’లో పవర్‌స్టార్ నయా లుక్‌లో ఆకట్టుకోవడం వెనుక అతని ప్రతిభ దాగి ఉంది. అతనే రాజేశ్. నగరానికి చెందిన ఆయన పవన్‌కు డ్రెస్సింగ్, స్టైలింగ్‌లో పర్ఫెక్ట్‌నెస్‌ను తీసుకొచ్చారు. ఒక్కో సినిమాలో ఒక్కోలా కనిపించేలా డిజైనింగ్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు.ముంబైలో ఓ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్న రాజేశ్.. నగరానికి వచ్చిన సందర్భంగా ‘న్యూస్‌లైన్’తో తన అనుభవాలను పంచుకున్నారు. ఆయన మాటల్లోనే...
ఫ్యామిలీ, స్టడీ..
అమ్మనాన్నలిద్దరూ హైదరాబాద్‌లోనే ఉంటారు. చదువంతా ఇక్కడే సాగింది. నిఫ్ట్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ పూర్తి చేశా. అనంతరం బెంగుళూరుకు వెళ్లి అక్కడ వివిధ అంతర్జాతీయ స్థాయి డిజైనింగ్ సంస్థలలో పని చేశా.
అనుకోకుండా సినిమాల్లోకి..
అనుకోకుండా సినీ పరిశ్రమ నుంచి పిలుపొచ్చింది. మొదటి నుంచి డిజైనింగ్ రంగంలో ఉండటంతో పరిశ్రమలోని కొంత మందితో సాన్నిహిత్యం ఏర్పడింది. ఒక రోజు దర్శకుడు ఎస్‌జే సూర్య నుంచి కాల్ వచ్చింది. ఆయన తీస్తున్న కొమురం పులి చిత్రంలో పవన్‌కు డ్రెస్ డిజైనింగ్ చేయాలని సూచించారు. అలా ఆ చిత్రంలో మూడు పాటలకు పవన్ కల్యాణ్‌కు నేనే డిజైనింగ్ చేసే అవకాశం వచ్చింది.
అందరిని మెప్పించేలా..
పవన్‌కల్యాణ్‌కు డిజైనింగ్ చేయాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే అలా చేసే సమయంలో పవన్ ఒక్కడినే కాదు.. ఆయనకు ఉండే లక్షలాది మంది అభిమానులను మెప్పించాలి. అదే ఆలోచనతో ప్రతి చిత్రంలో పవర్‌స్టార్‌కు ప్రత్యేకమైన డిజైనింగ్ చేస్తున్నా. క్లాస్ నుంచి మాస్ వరకు అందరిని మెప్పించే ప్రయత్నం చేస్తున్నాను. అందుకే గబ్బర్‌సింగ్ 2 లో సైతం పవన్ నాకు అవకాశం ఇచ్చారు. పవన్‌తో పనిచేయడం నా జీవితంలో ఊహించలేని అద్భుతమైన ఘట్టం.
పవన్‌తో అనుబంధం..
కొమురం పులి చిత్రంలో చేసిన డిజైనింగ్‌తో పవన్‌కల్యాణ్‌కు చాలా దగ్గరయ్యాను. అలా ఆయనతో కలిసి చేసిన ప్రయాణంలో భాగంగా తీన్‌మార్, గబ్బర్‌సింగ్, అత్తారింటికి దారేది చిత్రాల్లో ఆయనకు డ్రెస్ డిజైన్ చేసే అవకాశం లభించింది. తీన్‌మార్ చిత్రంలో పవన్ రెండు పాత్రలకు ఎంతో ప్రాధాన్యం తీసుకొని జాగ్రత్తగా డిజైన్ చేశాను. అలాగే అత్తారింటికి దారేది చిత్రంలో సైతం మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించే పవన్ డ్రెస్సింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నా.