
హోదాపై విశ్రమించేది లేదు
రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే వరకు విశ్రమించేది లేదని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
సీఎం చంద్రబాబు
సాక్షి, రాజమండ్రి: రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే వరకు విశ్రమించేది లేదని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఎట్టిపరిస్థితుల్లో రాష్ట్రానికి అనుకున్నది సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. గోదావరి పుష్కరాల్లో భాగంగా శుక్రవారం రాత్రి రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో సినీ ప్రముఖులు కె.విశ్వనాథ్, తనికెళ్ల భరణి, ఎంఎం శ్రీలేఖ, అనంతశ్రీరాం, పరుచూరి గోపాలకృష్ణ, నాటకరంగ ప్రముఖుడు చాట్ల శ్రీరాములు, సాహితీవేత్త కాళీపట్నం రామారావు, జానపద సాహిత్యం తరఫున వంగపండు ప్రసాదరావు తదితరులను సీఎం సత్కరించారు.
గోదావరిపై రచించిన పలు పుస్తకాలను ఆవిష్కరించారు. అనంతరం చంద్రబాబు ప్రసంగిస్తూ.. రాజకీయ ప్రయోజనాల కోసమే యూపీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని ముక్కలు చేసిందని ఆరోపించారు. ఇప్పుడు రాహుల్ గాంధీ రాష్ట్రానికి వచ్చి మొసలికన్నీళ్లు కారుస్తుండడం విడ్డూరంగా ఉందన్నారు.
తెలుగు భాషా పరిరక్షణకు కృషి
తెలుగు భాష, సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం చంద్రబాబు చెప్పారు. ‘తెలుగువారి చరిత్ర-సంస్కృతి’ అనే అంశంపై శుక్రవారమిక్కడి ఆనం కళా కేంద్రంలో నిర్వహించిన చర్చాగోష్టిలో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
రాజమౌళికి ప్రశంసలు: బాహుబలి సినిమా బాగుందని, దీని దర్శకుడు రాజమౌళి తెలుగువాడు కావడం రాష్ట్రం అదృష్టమని సీఎం ప్రశంసలు కురిపించారు. సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రితోపాటు, తెలుగు భాషా వికాసానికి కృషి చేస్తున్న పలువురిని సత్కరించారు. రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అధ్యక్షత వహించారు.