ఎన్‌కౌంటర్‌ జరిగిందా లేక చేశారా?

Madabhushi Sridhar Special Article On Disha Encounter - Sakshi

విశ్లేషణ

హైదరాబాద్‌లో నలుగురు అత్యాచార నిందితులను కాల్చేసిన సంఘటనపై మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో విచారణ జరపాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. హైదరాబాద్‌ హైకోర్టు పిల్‌ విచారణ జరుపుతున్నది, మానవ హక్కుల కమిషన్‌ బృందం కూడా ప్రశ్నిస్తున్నది. ఎన్‌కౌంటర్‌ చేస్తా అంటే అర్థం చంపేస్తా అని. ఎన్‌కౌంటర్‌ చేశారంటే హత్య చేశారనే చదువుకోవాలి. నేరం రుజువు చేయకుండా, పోలీసులు నలుగురికి మరణదండన విధించి, వెనువెంటనే అమలు చేశారు. ఇదో వీరోచిత కార్యంగా భావించి, చాలామంది జనం నీరాజనాలు ఇస్తున్నారు. కొందరు పుష్ప గుచ్ఛాలు ఇచ్చి ఫొటోలు దిగి ఫేస్‌బుక్‌లో పెట్టుకుంటున్నారు. లైక్స్‌ సాధిస్తున్నారు. శంషాబాద్‌ ఘటనలో దిశ.. దిక్కూ దిశ లేకుండా నేరగాళ్ల పాలబడి నలిగిపోతున్న దశలో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసు స్టేషన్‌కు వెళ్తే పరిధి కాదని పరుగులు పెట్టించి, చివరకు అర్ధ రాత్రి ఎప్పుడో ఎఫ్‌ఐఆర్‌ రాసే సమయానికి ఆమె నామరూపాలు కోల్పోయి మంటల్లో మాడిపోయింది. ఆ రాత్రి పోలీసులు పరుగెత్తి, అక్కడ కాల్పులు జరిపి నలుగురిని చంపి దిశను కాపాడి ఉంటే నిజంగా వారు హీరోలే?

దిశపై అత్యాచారం చేసి కాల్చేసిన సంఘటనపై స్థానిక, జాతీయ మీడియా కలిసి పాలనా వ్యవస్థను, వారి నిర్లిప్తతను అసమర్థతను ఎండగట్టాయి. జాతీయ స్థాయిలో పరువుపోయిందని అర్థమయింది. ఆలస్యంగా జూలు దులిపిన ఐదో సింహం నలుగురిని అరెస్టు చేసింది. నిందితుల భద్రత కోసం ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ స్వయంగా పోలీసుస్టేషన్‌కు వచ్చి 14 రోజుల కస్టడీ మంజూరు పత్రాన్ని ఇచ్చారు. కోర్టు ఆవిధంగా నమ్మి నిందితులను జాగ్రత్తగా పోలీసులకు అప్పగించింది. దిశ నిందితులు నేరస్తులని రుజువుచేసి, శిక్షించే రాజ్యాంగబద్ధమైన అధికారం కలిగి ఉన్నా ఆ అవకాశాన్ని న్యాయస్థానం కోల్పోయింది. కోర్టు విచారణా వ్యవహారంలో అడ్డుపడితే కోర్టు ధిక్కార నేరం. మరి, ఎవరైనా జైలుకు వెళ్తారా? చిల్లర దొంగలను కూడా భద్రంగా కోర్టుకు తీసుకువెళ్లాలి. పారిపోకుండా ఏర్పాట్లు చేసుకోవాలి. ఒక్కోసారి కాళ్లకు చేతులకు గొలుసులు కడతారు. జాలీ వ్యాన్‌ కిటికీతో కలిపి బేడీలు వేస్తారు. ఇప్పుడు బేడీలు ఎవరూ వాడని మ్యూజియం పరి కరాలు అవుతున్నాయా? అసలు బేడీలు వాడడం ఎందుకు, తుపాకులే వాడితే సరిపోతుందనేది కొత్త సిద్ధాంతమా? నలుగురు నిందితులను నేరఘటన జరిగిన చోటికి అర్ధరాత్రే తీసుకువెళ్లవలసిన అవసరం ఉందా? తీసుకువెళ్తే అన్ని జాగ్రత్తలు వహించారా లేదా? మూడు బుల్లెట్లు దిగినా, ప్రాణం పోతున్నా మొదటి నిందితుడు తుపాకీ గట్టిగా పట్టుకుని పడిపోయాడా? మీ దగ్గర బేడీలు లేవా? అని జాతీయ మానవ హక్కుల సంఘం ప్రతినిధులు ప్రశ్నించినట్టు పత్రికల్లో రాశారు. 

ఆత్మరక్షణ కోసం ఏమైనా చేయవచ్చు. చంపేయవచ్చు. ఆత్మరక్షణ హక్కు సహజమైనది. రాజ్యాంగబద్ధమైనది. చట్టం కల్పించినది. సాక్ష్య చట్టం, శిక్షా చట్టం, ప్రక్రియా చట్టం మూడూ చాలా స్పష్టంగా వివరించిన హక్కు. పోలీసులు కూడా మనుషులే, కనుక వారికీ ఆ హక్కు ఉంది. హైదరాబాద్‌ పోలీసులు ఈ హక్కు నిజంగా వాడుకుని ఉంటే ఎన్‌కౌంటర్‌ సహజంగా జరిగినదే అయితే, రుజువు చేసుకోవలసిన బాధ్యత వారిపైనే ఉందని సాక్ష్య చట్టం వివరిస్తున్నది. కోర్టుకు నమ్మదగిన రుజువులు ఇస్తే సెక్షన్‌ 100 (ఐపీసీ) కింద మినహా యింపు వర్తిస్తుంది. నిర్దోషులవుతారు. అప్పుడు వారితో సెల్ఫీలు దిగవచ్చు. అందుకని వెంటనే ఎన్‌కౌంటర్‌ చేసిన నిందిత పోలీసులపైన కేసు నమోదు చేయవలసిన బాధ్యత ఇతర పోలీసులపైన ఉంది. ఎప్పుడు కేసు పెడతారు?  ఎన్‌కౌంటర్‌ జరిగిందా? చేశారా? నేరాలకు సాక్ష్యాలు సేకరించాల్సిన బాధ్యత గాలికి వదిలేసి, కాల్చేసి చేతులు దులుపుకునే పోలీసు అధికారులకు ప్రమోషన్‌ ఇచ్చి న్యాయమూర్తులుగా నియమిస్తే.. వారు ఉరితాడు లేకపోయినా, తలారి రాకపోయినా తక్షణ మరణ దండన విధించవచ్చు, ప్రేక్షకులూ, అభిమానులు ఆలోచనలు మానేసి పాలాభిషేకాలు చేసుకోవచ్చు. జైళ్లకు కోర్టులకు తాళాలు వేసుకోవచ్చు. రాజ్యాంగం కాగితాల్ని తుపాకులను తుడుచుకోవడానికి సద్వినియోగం చేయవచ్చు.


మాడభూషి శ్రీధర్‌ 
వ్యాసకర్త బెన్నెట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్,
కేంద్ర సమాచార మాజీ కమిషనర్‌ 
madabhushi.sridhar@gmail.com

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top