కాస్త ఆలస్యం

Person  committed to the rule of law - Sakshi

చెట్టు నీడ

జర్మనీకి చెందిన ఇమ్మాన్యూల్‌ కాంట్‌ ఓ తత్త్వవేత్త. ఈయన వద్దకు ఓరోజు ఓ మహిళ వచ్చింది. ఆయనను పెళ్లి చేసుకోవాలని ఆమె ఆశ. అయితే ఆయనేమీ ప్రేమ చక్రవర్తికాదు. ప్రేమకు ఆయన ఆమడదూరంలో ఉండేవాడు. నియమనిష్టలకు కట్టుబడి బతుకుతున్న వ్యక్తి. కానీ ఇవేవీ తెలియని ఆ యువతి తన మనసులోని మాట చెప్పింది. అయితే కాంట్‌ తీరు వేరుగా ఉండేది. రాత్రి పదైతే చాలు అప్పటికప్పుడు చేస్తున్న పనిని సైతం పక్కన పెట్టేసేవారు. ఎప్పుడూ లెక్కలేస్తూ ఉంటారు. ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడైనా సరే టైము పదైందంటే చాలు ఏదీ చెప్పకుండా వెళ్లిపోయి నిద్రపోతారు. ఆయన దగ్గర ఓ పనివాడు ఉండేవాడు. అతను అక్కడున్న అతిథులకు చెప్పేవాడు.. అయ్యగారు పడుకుండిపోయారని. అప్పుడు వాళ్లు వెళ్లిపోయేవారు. కాలం పట్ల చాలా నిక్కచ్చిగా ఉంటాడు కాంట్‌. మహా పట్టింపు. ఆయన తీరు నచ్చక ఆయన గుణం తెలిసిన కుటుంబసభ్యులు కాంట్‌ను విడిచిపెట్టి దూరంగా వెళ్లిపోయారు. ఉదయం అయిదు గంటలకు లేవడం ఆయన అలవాటు. అది చలి కాలమైనా ఎండాకాలమైనా కావచ్చు. ఆరోగ్యం బాగులేకపోయినా సరే బాగున్నా సరే అయిదు గంటలకు లేవవలసిందే.

ఐదైతే పక్కమీద ఒక్క సెకను కూడా ఉండరు. అన్నింటినీ కాలంతో చూసే అటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని ఓ మహిళ ముందుకు రావడమేంటీ.. ఆశ్చర్యమే! ఆయనంటే ఎందుకు ఇష్టమో చెప్పింది కూడా. ఆమె మాటలతో ఆలోచనలో పడ్డారు కాంట్‌. ఆమె పెళ్లి చేసుకుంటానని చెప్పడంతోనే అందులోని కష్టసుఖాలను ఆయన గణించుకున్నారు. ఇందుకు సంబంధించి ఓ పుస్తకం కూడా రాశారు. కష్టాలకు వంద మార్కులు, ఇష్టాలకు 101 మార్కులు వేసుకున్న ఆయన ఆపైన సరేనని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తండ్రిని కలిసి జరిగినదంతా చెప్పారు. ఆయన మాటలు విని తండ్రి పెద్దగా నవ్వాడు. ‘‘నువ్వు కాస్తంత ఆలస్యం చేశావు. అయిదేళ్లు ఆలస్యంగా నిర్ణయం తీసుకున్నావు. నువ్వు చేసుకుందామనుకున్న ఆ యువతికి ఎప్పుడో పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు’’ అని తండ్రి చెప్పాడు. ఇమ్మాన్యూల్‌ కాంట్‌ శోకతప్తుడయ్యాడు. 
–  యామిజెన్‌ 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top