రోహిణీలోనే దేశీ వరి

Desi rice in Rohini karthe - Sakshi

దేశీ వరి విత్తనాలను ఇంటి ఆహారపు అవసరాల కోసం కనీసం ఒక ఎకరంలో నైనా వేసుకొంటే మంచిదని, దేశీ వరి విత్తనాలను ఆరు తడి పద్ధతిలో మామూలు పద్ధతితో పోల్చితే 10 శాతం నీటితోనే సాగు చేయవచ్చని ప్రకృతి వ్యవసాయదారుడు, సేవ్‌ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు విజయరామ్‌ తెలిపారు. ఈ పద్ధతిలో 90 శాతం నీటిని ఆదా చేయవచ్చు. కలుపు నియంత్రణ కోసం మొక్కకు మొక్కకు దూరం, అలానే వరుసకు, వరుసకు మధ్య దూరం 45 సెం.మీ. ఉండేటట్లు నాటుకోవాలి.

ఆరు తడి పద్ధతిలో వరిలో అంతర పంటలను కూడా వేయవచ్చు. అలా వేద్దాం అనుకున్న వారు మొక్కకు మొక్కకు దూరం, అలానే వరుసకు, వరుసకు మధ్య దూరం 60 సెం.మీ. ఉండేటట్లు నాటుకోవాలన్నారు.
180 నుంచి 210 రోజుల పంట కాలం ఉండే వరి రకాలు (మా పిళ్లై సాంబ, మొలగొలుకులు, మడుమురంగి లాంటివి) రోహిణి కార్తె (మే 25 నుంచి ప్రారంభం)లో నాట్లు వేసుకుంటేనే అనుకూలం. అలా అయితేనే 2వ పంటకు వీలు దొరుతుందన్నారు.

జనవరి ఆఖరు లోపు నేల స్వభావం, నీటి వసతిని బట్టి పుచ్చకాయ, దోస, కూరగాయలు, నువ్వులు లేక పశుగ్రాసపు పంటలు వేసుకోవచ్చు.

కొత్తగా ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు మొదట ఏడాది ఒక ఎకరంలో మాత్రమే ఈ పద్ధతిని అనుసరించాలన్నారు. దేశీ వరి విత్తనాలతో మొదటి సంవత్సరం దిగుబడి 10 బస్తాల నుండి 20 బస్తాల వరకు రావచ్చని, తదుపరి కొంత పెరుగుతుందన్నారు. కేవలం వరిని మాత్రమే కాకుండా పప్పు ధాన్యాలు, కూరగాయలు, నూనె గింజలు పండించే ప్రయత్నమూ చేయాలి. వర్షము పడినప్పుడు పొలములో కొన్ని రోజుల వరకూ నీరి నిలిచిపోయే పరిస్థితి ఉన్న వారు (మాగాణి భూముల వారు, కోస్తా ప్రాంతాల వారు) కనీసం 200 గజాల స్థలంలోనైనా 2 అడుగుల ఎత్తులో మట్టిని వేసి ఇంటి అవసరాల కోసం కూరగాయలు పెంచుకోవాలన్నారు.

దేశీ వరి విత్తనాలను పండించే రైతులు ఇప్పుడు ప్రతి జిల్లాలోనూ ఉన్నారని, వారి దగ్గరి నుంచి విత్తనాలు తీసుకోవచ్చని విజయరామ్‌ వివరించారు. వివరాలకు హైదరాబాద్‌లోని సుభాష్‌ పాలేకర్‌ ప్రకృతి వ్యవసాయం కేంద్ర కార్యాలయానికి (04027654337 , 04027635867) ఫోన్‌ చేయవచ్చు. పొద్దున 10 గం. నుంచి సా. 6 గం. వరకు. గురువారం సెలవు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top