ఆ బడిలో రోజూ చీరల పంచాయితే!

ఆ బడిలో రోజూ చీరల పంచాయితే! - Sakshi


మైలవరం:

 సాధారణంగా చాలా బళ్లలో మహిళా ఉపాధ్యాయులు చీరెలకు, జాకెట్లకు, కుట్లు, అల్లికలతో వృథాగా కాలం వెళ్లబుచ్చుతుంటారు. కానీ వద్దిరాల ఉన్నత పాఠశాలలోని ఉపాధ్యాయినులు సరికొత్త నిర్వాకాన్ని తెరపైకి తెచ్చారు. ప్రతి రోజు పాఠశాల పనివేళల్లోనే చీరల అమ్మకందారుల ఇళ్లవద్దకు విద్యార్థినులను పంపించి చీరెలు బడికి తెప్పించుకొంటున్నారు. ‘ అది బాగుంది... ఇది బాగలేదు‘  అంటూ గంటల తరబడి కాలం వృథా చేస్తున్నారు. వద్దిరాల జెడ్పీ హైస్కూల్‌కు చుట్టుపక్కల గ్రామాలైన ధన్నవాడ, గొల్లపల్లె, చిన్నవెంతుర్ల, ఉప్పలపాడు, మాధవాపురం నుంచి విద్యార్థులు వస్తుంటారు.



ఉపాధ్యాయులు మాత్రం జమ్మలమడుగు పట్టణం నుంచి వస్తారు. సాధారణంగా ఒక వయసు వచ్చిన ఆడపిల్లలను ఇతర ఇళ్లకు గాని, దుకాణాలకు గాని పంపడానికి వారి తల్లిదండ్రులు ఇష్టపడరు. అలాంటిది ఎక్కడో పరాయి ఊరిలో అది కూడా చీరల కోసమని కొత్త వ్యక్తుల ఇళ్ల వద్దకు ఆడపిల్లలను పంపించడం.. పాఠశాల పనివేళల్లోనే రోడ్లపైన సంచరిస్తుండడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తోడు కొందరు మహిళా  ఉపాధ్యాయులు సంవత్సరం, రెండేళ్ల  లోపు వయస్సు ఉన్న తమ చిన్నారులను బడికి తీసుకొని వచ్చి వారిని సముదాయించుకోవడంతోనే సమయాన్నంతా వృథా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.


విద్యార్ధులు సైతం ఆ చిన్నారులతో ఆడుకొంటూ ఉండడంతో బోధనాభ్యసన ప్రక్రియ కుంటు పడుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇక పురుష ఉపాధ్యాయులలో కొందరు పాఠశాల సమయంలోనే నోటి నిండా పాన్‌పరాగ్‌ నములుతుండడం.. విద్యార్థుల కళ్ల ముందే ధూమపానం సేవిస్తుండడం పలు విమర్శలకు తావిస్తోంది. అలాగని ఇక్కడ పని చేస్తున్న ఉపాధ్యాయులు అందరూ అలాంటి వారే అనుకుంటే పొరపాటు పడినట్లే. కొందరు అయ్యవార్లు  విద్యార్థుల కోసం నిత్యం కష్టపడుతూ ఉదయం, సాయంత్రం గంట చొప్పున అదనపు తరగతులు కూడా నిర్వహిస్తున్నారు. కేవలం కొందరు ఉపాధ్యాయుల నిర్వాకం పాఠశాలకు చెడ్డపేరు తెస్తోంది. గత విద్యా సంవత్సరంలో ఉదయం 9.30 గంటలకే పాఠశాల ప్రధాన ద్వారం మూసివేయడం, తిరిగి సాయంత్రం వరకు తాళాలు తీయక పోవడంతో అప్పట్లో పాఠశాలలో క్రమ శిక్షణ బాగా ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో ఇటు విద్యార్థులు, అటు ఉపాధ్యాయులు పాఠశాల పనివేళల్లో తరచూ రోడ్లపైనే సంచరిస్తున్నారు. పాఠశాల పరిస్థితిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top