
సాక్షి ప్రతినిధి, ఏలూరు/తణుకు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పట్టుబడిన ఐఎఫ్‌ఎస్ అధికారి ముత్యాల రాంప్రసాదరావు అక్రమ లీలలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. అక్రమ సొమ్ముతో పశ్చిమగోదావరి జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు తేలింది. భార్య పేరుతో.. రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని విస్తరించి రూ.వందల కోట్ల టర్నోవర్ చేస్తున్నట్లు సమాచారం. జిల్లాలోని రియల్టర్లు, ఫైనాన్షియర్లు.. రాంప్రసాద్‌కు బినామీలుగా ఉన్నట్లు సీబీఐ గుర్తించింది.
మంగళవారం తణుకు, విశాఖ, న్యూఢిల్లీ, మీరట్‌లలో సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు.. బుధవారం పశ్చిమగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో దాడులు చేశారు. ఈ సందర్భంగా రూ.10.72 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లతో పాటు రూ.37.25 లక్షల నగదు.. పలు బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి మార్కెట్ విలువ రూ.150 కోట్ల వరకూ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, ముత్యాల రాంప్రసాదరావుపై సీబీఐ అధికారులు బుధవారం కేసు నమోదు చేశారు. రాంప్రసాదరావు అక్రమ ఆర్జనకు సంబంధించిన లావాదేవీలన్నీ ఆయన భార్య ఆకుల కనకదుర్గ దగ్గరుండి చూసుకుంటున్నట్లు ఏసీబీ గుర్తించింది.