నిందితులను పట్టించిన ‘చలాన్‌’

Pregnant murder case created sensation and accused was arrested - Sakshi

సంచలనం సృష్టించిన గర్భిణి హత్య కేసు కొలిక్కి...

నిందితుడు అమర్‌కాంత్‌ ఝా, అతని తల్లిదండ్రుల అరెస్టు

ఆచూకీ దొరకని కీలక వ్యక్తి వికాస్‌

అతడి భార్యే మృతురాలని భావిస్తున్న పోలీసులు

సిద్ధిఖీనగర్‌ ఇంట్లోనే మహిళను హత్య చేసినట్టు నిర్ధారణ  

సాక్షి, హైదరాబాద్‌/హైదరాబాద్‌: సైబరాబాద్‌ పోలీసులకు సవాల్‌గా మారిన గర్భిణి దారుణ హత్య కేసులో నిందితులను ‘స్పాట్‌ పేమెంట్‌ చలాన్‌’పట్టించింది. నిందితులు మృతురాలిని ముక్కలుగా చేసి బ్యాగుల్లో పెట్టి బైక్‌పై తరలించడం సీసీ టీవీల ద్వారా బయటపడింది. ఆ బైక్‌ గురించి పోలీసులు విచారణ జరపడంతో చలాన్‌ విషయం బయటపడటమే కాకుండా నిందితుల వివరాలూ వెలికి వచ్చాయి. హఫీజ్‌పేటలో రాంగ్‌ రూట్‌లో వచ్చిన ఆ బైక్‌ నడిపిన యజమానికి చలాన్‌ విధించే సమయంలో నమోదు చేసుకున్న ఫోన్‌ నంబర్‌ ఈ కేసును కొలిక్కి తీసుకొచ్చింది. ఆ నంబర్‌ ద్వారా బైక్‌ గచ్చిబౌలిలోని ద లాల్‌స్ట్రీట్‌ పబ్‌ మేనేజర్, ఒడిశా వాసి సిద్ధార్థ బర్ధన్‌ది అని పోలీసులు తెలుసుకున్నారు. సిద్ధార్థకు సీసీటీవీ ఫుటేజీలకు చిక్కిన బైక్, నిందితుడి ఫొటోలు చూపించారు. అతను తన పబ్‌లో వెయిటర్‌ అమర్‌కాంత్‌ ఝా అని, తన బైక్‌ తీసుకెళ్లాడని సిద్ధార్థ చెప్పారు. ఝా ఫోన్‌ నంబర్‌తో పాటు సిద్ధిఖీనగర్‌లోని ఇంటి చిరునామా తెలపడంతో పోలీసులు ఈ కేసులో కీలక పురోగతి సాధించారు. వెంటనే సిద్ధిఖీనగర్‌లో అమర్‌కాంత్‌ ఝా తల్లిదండ్రులు మమతా ఝా, అనిల్‌ ఝాలతో పాటు ఆరేళ్ల బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

సిద్ధిఖీనగర్‌లోనే హత్య... 
బిహార్‌కు చెందిన అమర్‌కాంత్‌ ఝా, అతడి తల్లిదండ్రులు, మరో వ్యక్తి వికాస్‌తో కలసి కొన్ని నెలల నుంచి సిద్ధిఖీనగర్‌లోని ప్లాట్‌నంబర్‌ 895 యజమాని మాణిక్‌చంద్‌ ఇంట్లో నివాసముంటున్నారు. అమర్‌కాంత్‌(28) గచ్చిబౌలిలోని ద లాల్‌స్ట్రీట్‌ పబ్‌లో వెయిటర్‌గా పని చేస్తుండగా, వికాస్‌ సిద్ధిఖీనగర్‌లో ఛాట్‌ బండార్‌ నిర్వహిస్తున్నాడు. 20 రోజుల క్రితం బిహార్‌ నుంచి ఓ వృద్ధుడు తాను తీసుకొచ్చిన ఆరేళ్ల బాలుడిని వీరి వద్దనే వదిలేసి వెళ్లాడు. గర్భిణి అయిన మహిళను పిలిపించుకున్న వికాస్‌ వచ్చిన రోజు రాత్రే హత్య చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అనిల్‌ ఝా, మమతా ఝా, వికాస్‌లు కలసి బాత్‌రూమ్‌లో గర్భిణి ని హతమార్చారు. మరుసటి రోజు ఇంటి పక్కనే ఓ వ్యక్తి బోరు వేయడంతో పెద్ద శబ్దం వచ్చిందని, ఆ సమయంలో స్టోన్‌ కటింగ్‌ మెషీన్‌తో శరీర భాగాలను ముక్కలు చేసి ఉంటారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆ తరువాత యమహా బైక్‌పై అమర్‌కాంత్, అతని తల్లి కలసి మృతదేహాన్ని శ్రీరాంనగర్‌లో పడేసిన సమయంలో సీసీటీవీ కెమెరాలకు చిక్కారు. మూడు రోజుల క్రితం వరకు చాట్‌బండార్‌ వ్యాపారం చేసిన వికాస్‌ పోలీసుల నిఘా పెరగడంతో తప్పించుకుపోయాడని స్థానికంగా చర్చించుకుంటున్నారు. పోలీసులకు దొరికిన ఆరేళ్ల బాలుడు తన తల్లి చనిపోయిందని, తండ్రి వికాస్‌ అని చెబుతుండటంతో చనిపోయింది వికాస్‌ భార్య అయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఈ కేసును వివాహేతర సంబంధం కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై మంగళవారం లోపు స్పష్టత వస్తుందని అంటున్నారు. 

సీసీ కెమెరాలతో విచారణలో పురోగతి 
సీసీ కెమెరాల ఫుటేజీతో విచారణలో పురోగతి సాధించినట్టు సైబరాబాద్‌ సీపీ సందీప్‌ శాండిల్య తెలిపారు. ద లాల్‌స్ట్రీట్‌ పబ్‌ మేనేజర్‌ సిద్ధార్థ బర్ధన్‌ వద్ద వెయిటర్‌ అమర్‌కాంత్‌ జనవరి 28న రాత్రి బైక్‌ తీసుకొని జనవరి 29న తెల్లవారుజామున తిరిగి ఇచ్చినట్టు తెలిసిందన్నారు. అయితే గర్భిణి హత్యలో అమర్‌కాంత్‌ ప్రమేయం ఉందా, లేదా మృతదేహం తరలింపులో మాత్రమే పాల్గొన్నాడా అన్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందన్నారు.

నేరం అంగీకరించారు..
చాట్‌బండార్‌ వ్యాపారం చేస్తూ తమ ఇంట్లోనే ఉండే వికాస్, తన భర్త అనిల్‌ ఝా, తాను ఆ గర్భిణిని చంపామని మమతా ఝా అంగీకరించినట్టు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. అయితే ఈ నేరంతో తన కుమారుడు అమర్‌కాంత్‌ ఝాకు ఎలాంటి సంబంధం లేదని ఆమె చెబుతోందన్నారు. ఈ నెల మూడున సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి అమర్‌కాంత్‌ ఝా బిహార్‌ వెళ్లినట్టుగా సీసీటీవీ కెమెరాల ద్వారా గుర్తించిన సైబరాబాద్‌ పోలీసులు అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు అమర్‌కాంత్‌ ఝాను పట్టుకున్న పోలీసులు.. సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులకు సోమవారం అప్పగించినట్టు తెలిసింది.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top