డీఈ అక్రమాస్తులు రూ.5 కోట్లు

DE illegal assets is Rs 5 crore - Sakshi

ఏకకాలంలో ఏసీబీ దాడులు 

సాక్షి, హైదరాబాద్‌/ సాక్షి నెట్‌వర్క్‌: కామారెడ్డి జిల్లా బాన్సువాడలో నీటిపారుదల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ కాటపల్లి శ్రవణ్‌కుమార్‌రెడ్డి అక్రమాస్తులు రూ. 5 కోట్ల పై చిలుకు ఉన్నట్లు ఏసీబీ అధికారులు తేల్చారు. ఆయన అక్రమాస్తులపై శనివారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఆయన ఉద్యోగం చేస్తున్న కామారెడ్డి జిల్లా బాన్సువాడ, ఆయన తల్లిదండ్రులున్న నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్, ఆయన కుటుంబసభ్యులుంటున్న హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌లో ఏసీబీ బృందాలు దాడులు చేశాయి. ఈ దాడుల్లో రూ.1.70 కోట్ల ఆస్తులు గుర్తించగా, ప్రస్తుతం మార్కెట్‌ ప్రకారం రూ.5 కోట్ల మేర ఆస్తులుంటాయని ఏసీబీ డీజీ పూర్ణ చందర్‌రావు తెలిపారు. శ్రవణ్‌కుమార్‌రెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసినట్టు వెల్లడిం చారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని కోటగిరి, వర్ని, రుద్రూర్‌ మండలాల ఇరిగేషన్‌ డీఈగా శ్రవణ్‌కుమార్‌రెడ్డి విధులు నిర్వర్తిస్తున్నారు. శనివారం వేకువజామునే అద్దె ఇంట్లో ఉన్న ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో కార్యాలయంలో, నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లోని ఆయన తల్లిదండ్రుల ఇళ్లలో సోదాలు జరిపారు. కుత్బుల్లాపూర్‌ పరిధి సుచిత్రా గ్రీన్‌పార్క్‌ కాలనీలోని విశాలమైన భవంతిలో ఆయన కుటుంబ సభ్యులు ఉండగా.. ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు.  

గుర్తించిన ఆస్తులు... 
- జీడిమెట్లలో రూ.50 లక్షల విలువైన (జీ ప్లస్‌) విశాలమైన భవంతి.
బేగంపేటలో రూ. 25 లక్షల విలువైన 2,100 ఎస్‌ఎఫ్‌టీ గల ప్లాట్‌
జీడిమెట్లలో రూ. 20 లక్షల  విలువైన కమర్షియల్‌ కాంప్లెక్స్‌
నిజామాబాద్‌లోని నవీపేట్, ఆర్మూర్‌ పరిధిలో రూ.62.81 లక్షల విలువగల 34 ఎకరాల వ్యవసాయ భూమి.
అల్వాల్‌లో రూ. 2.5 లక్షల విలువగల ఓపెన్‌ ప్లాట్‌.
మేడ్చల్‌లో రూ.15 లక్షల విలువైన ఓపెన్‌ ప్లాట్‌
నిజామాబాద్‌ కేంద్రంలో రూ.2.4 లక్షల విలువైన ఖాళీ స్థలం.                    
రూ.14 లక్షల విలువగల బంగారు, వెండి ఆభరణాలు.
రూ.50 వేల నగదు, రూ.3 లక్షల ఇన్సూరెన్స్‌ బాండ్లు.
నాలుగు బ్యాంకు ఖాతాల్లో రూ.12.90లక్షల నగదు, రూ.11.98 లక్షల చిట్టీలు.  
రూ.5 లక్షల విలువగల గృహోపకరణాలు, రూ.12 లక్షల విలువైన కారు.
రూ.11లక్షల విలువగల మరో రెండు కార్లు, రూ.50 వేల విలువగల బైక్‌లు ఉన్నాయని ఏసీబీ అధికారులు గుర్తించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top