హైదరాబాద్‌లో అంతర్జాతీయ బ్రాండ్ల టీవీల అసెంబ్లింగ్‌

skyquad new plants launches in hyderabad - Sakshi

స్కైక్వాడ్‌ ఎలక్ట్రానిక్స్‌ ప్లాంట్లలో తయారీ

త్వరలో ఇతర ఉపకరణాల రూపకల్పన

కంపెనీ ఎండీ సోయిన్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: స్మార్ట్‌ఫోన్ల తయారీలో ఉన్న మోటరోలా, నోకియా, వన్‌ప్లస్‌ వంటి దిగ్గజ సంస్థలు ఎల్‌ఈడీ టీవీల రంగంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. విశేషమేమంటే ఈ కంపెనీల టీవీలు హైదరాబాద్‌లో రూపుదిద్దు కుంటున్నాయి. ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల తయారీలో ఉన్న స్కైక్వాడ్‌ ఇప్పటికే ప్యానాసోనిక్, లాయిడ్‌ వంటి ఏడు బ్రాండ్ల టీవీలను అసెంబుల్‌ చేస్తోంది. కంపెనీకి ప్రస్తుతం హైదరాబాద్‌ సమీపంలోని మేడ్చల్, శంషాబాద్‌ వద్ద ప్లాంట్లున్నాయి. ఏటా 30 లక్షల ఎల్‌ఈడీ టీవీలను రూపొందించే సామర్థ్యం ఉంది. 3,000 మంది ఉద్యోగులు ఉన్నారని కంపెనీ ఎండీ రమీందర్‌ సింగ్‌ సోయిన్‌ సాక్షి బిజినెస్‌ బ్యూరోకు వెల్లడించారు. అంతర్జాతీయ కంపెనీలకు ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులను తయారు చేసి సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. త్వరలో నాలుగు కొత్త బ్రాండ్లు తోడవనున్నాయని వివరించారు.

రెండో దశలో రూ.1,400 కోట్లు..
స్కైక్వాడ్‌ భాగస్వామ్యంతో చైనాకు చెందిన ఎలక్ట్రానిక్స్‌ తయారీ సంస్థ స్కైవర్త్‌ శంషాబాద్‌ వద్ద 50 ఎకరాల్లో ప్లాంటును నెలకొల్పుతోంది. తొలి దశలో రూ.700 కోట్లు పెట్టుబడి చేస్తున్నారు. ఇరు సంస్థలు కలిసి టీవీలతోపాటు వాషింగ్‌ మెషీన్లు, డిష్‌ వాషర్స్, ఏసీలు, రిఫ్రిజిరేటర్లను అసెంబుల్‌ చేస్తాయని రమీందర్‌ వెల్లడించారు. ‘ఆరు నెలల్లో ఈ ఉత్పత్తుల తయారీ మొదలవుతుంది. కొత్త ప్లాంటు ద్వారా 5,000 మందికి ఉపాధి లభించనుంది. 15–20 శాతం విడిభాగాలు స్థానికంగా తయారవుతున్నాయి. దీనిని 50 శాతానికి తీసుకువెళతాం. మరో 20 దాకా అనుబంధ సంస్థలు రానున్నాయి. వీటి ద్వారా 3,000 ఉద్యోగాలు వస్తాయని భావిస్తున్నాం. రెండవ దశలో ఇరు సంస్థలు కలిసి రూ.1,400 కోట్ల పెట్టుబడి చేయాలని భావిస్తున్నాం’అన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top