
248 ప్లస్‌తో సెన్సెక్స్.. 28,446
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్‌ఈ) 30 షేర్ల సెన్సెక్స్ గురువారం మంచి లాభాన్ని చూసింది. 248 పాయింట్ల లాభంతో 28,446 పాయింట్ల వద్ద ముగిసింది.
♦ మూడు నెలల గరిష్ట స్థాయి
♦ 84 లాభంతో 8,608కు నిఫ్టీ
♦ విదేశీ పెట్టుబడి విధానాల సడలింపు ఉత్సాహం
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్‌ఈ) 30 షేర్ల సెన్సెక్స్ గురువారం మంచి లాభాన్ని చూసింది. 248 పాయింట్ల లాభంతో 28,446 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది మూడు నెలల గరిష్ట స్థాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 50 కూడా ఇదే పనితీరును ప్రదర్శించింది. 84 పాయింట్ల లాభంతో మూడు నెలల గరిష్ట స్థాయి 8,608 పాయింట్ల వద్ద ముగిసింది.
కారణాలు..!: సూచీ పరుగుకు కన్జూమర్ డ్యూరబుల్స్, బ్యాంకింగ్ స్టాక్స్ ఇంజిన్‌గా పనిచేశాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి వివిధ విభాగాల్లో (ఎఫ్‌డీఐ, ఎఫ్‌ఐఐ తదితర మార్గాల్లో దేశంలోకి వచ్చే) నిబంధనల సరళీకరణ నిర్ణయం- మార్కెట్‌కు ప్రత్యేకించి బ్యాంకింగ్ స్టాక్స్‌కు వరమైంది. ముఖ్యంగా తాజా మూలధనాన్ని సమీకరించుకోడానికి ఈ సరళీకరణ విధానం దోహదపడుతుందన్న అంచనాతో బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు జరిగాయి.
లాభ నష్టాల్లో..: బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 23 షేర్లు లాభాల్లో, మిగిలినవి నష్టాల్లో ముగిశాయి. బీఎస్‌ఈలో విభాగాల వారీ సూచీల విషయంలో ప్రధానంగా బ్యాంకెక్స్ 1.91 శాతం లాభపడింది.
కఠిన షరతులకు గ్రీస్ పార్లమెంటు ఓకే..
గ్రీస్ ఆర్థిక మనుగడకు కఠిన షరతులతో కూడిన మూడో బెయిలవుట్ ప్యాకేజీని పొందేందుకు ఆ దేశ పార్లమెంటు ఆమోదం తెలిపింది. 86 బిలియన్ యూరోల(దాదాపు 94 బిలియన్ డాలర్లు) తాజా ప్యాకేజీ కోసం యూరోపియన్ యూనియన్ ఇతర అంతర్జాతీయ రుణదాతలతో సోమవారం గ్రీస్ ప్రధాని అలెక్సిస్ సిప్రస్ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.
సింజిన్ ప్రైస్ బ్యాండ్ రూ.240-250
న్యూఢిల్లీ: సింజిన్ ఇంటర్నేషనల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ఈక్విటీ షేర్ ప్రైస్‌బ్యాండ్ రూ.240-250గా నిర్ణయమైంది. తన పరిశోధనా విభాగం- సింజిన్ ఇంటర్నేషనల్ ప్రైస్‌బ్యాండ్‌పై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు బయోటెక్నాలజీ దిగ్గజ సంస్థ బయోకాన్ లిమిటెడ్ తెలిపింది. అ మేరకు బీఎస్‌ఈకి పంపిన ఒక ఫైలింగ్ సమర్పించింది. ఆఫర్ జూలై 27న ప్రారంభమై, 29వ తేదీన ముగుస్తుంది. సింజిన్ దాఖలు చేసిన ఆఫర్ ముసాయిదా (ఆర్‌హెచ్‌పీ)ను 15న బెంగళూరు రిజిస్ట్రర్ ఆఫ్ కంపెనీస్ ఆమోదించినట్లు తెలిపింది. ముసాయిదా పత్రాల ప్రకారం 2.2 కోట్ల ఈక్విటీ షేర్లను సంస్థ అమ్మనుంది. ఇందులో ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 20 లక్షల షేర్లను బయోకాన్ షేర్‌హోల్డర్లకే రిజర్వ్ చేసింది. ఈ ఐపీఓ ద్వారా ఎంతమొత్తం సమకూర్చుకోనున్నదన్న విషయాన్ని సంస్థ ప్రకటించనప్పటికీ, ఈ మొత్తం దాదాపు రూ.600 కోట్లు ఉంటుందని అంచనా.