రూపాయికి చమురు సెగ!

Rupee dives 43 paise as crude reclaims $80 mark - Sakshi

కనిష్ట స్థాయిల వైపునకు పయనం

ఒకేరోజు 43 పైసలు పతనం

72.63 వద్ద ముగింపు  

ముంబై: అంతర్జాతీయంగా క్రూడ్‌ ధరలు మళ్లీ తీవ్రం అవుతుండడంతోసహా పలు అంశాలు డాలర్‌ మారకంలో రూపాయి విలువ మళ్లీ కరగడానికి కారణమవుతున్నాయి. ఇంటర్‌బ్యాంక్‌ ఫారిన్‌ ఎక్సే్చంజ్‌ మార్కెట్‌ (ఫారెక్స్‌)లో రూపాయి విలువ సోమవారం ఒకేరోజు 43 పైసలు (0.60 శాతం) పతనమయ్యింది. 72.63 వద్ద ముగిసింది.  రెండు రోజుల పాటు క్రమంగా బలపడుతూ, రూపాయి గడచిన శుక్రవారం 72.20 వద్ద ముగిసింది. అయితే సోమవారం ప్రారంభంతోటే బలహీనంగా 72.47 వద్ద ప్రారంభమైంది. మధ్యాహ్నం ఇంట్రాడే ట్రేడింగ్‌లో 72.73 స్థాయిని కూడా తాకింది.

అంతర్జాతీయంగా 96 స్థాయిని చూసిన డాలర్‌ ఇండెక్స్, మళ్లీ 93 స్థాయిని చూస్తున్నప్పటికీ... రూపాయి పతనానికి పలు అంశాలు కారణమవుతున్నాయి.  
 ఇరాన్‌పై అమెరికా విధించిన ఆంక్షలు క్రూడ్‌ ధరలు పెరగడానికి కారణమవుతోంది.  
   క్రూడ్‌ ఆయిల్‌ ధరలకు తోడు అమెరికా–చైనాల మధ్య వాణిజ్య యుద్ధం ప్రతికూల ప్రభావం కూడా రూపాయిపై పడుతోంది.  
 గత వారం రూపాయి ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ చరిత్రాత్మక కనిష్ట స్థాయిలు 72.99, 72.98లను చూసింది. అటు తర్వాత శుక్రవారంతో ముగిసిన రెండు ట్రేడింగ్‌ సెషన్లలో 78పైసలు బలపడి, 72.20 స్థాయికి చేరింది. అయినా ఈ స్థాయిలో నిలబడలేకపోవడం    గమనార్హం.   
 ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ నిధుల ఉపసంహరణ కూడా రూపాయిపై ప్రతికూల ప్రభావం చూపుతుండడం గమనార్హం. సెప్టెంబర్‌లో ఇప్పటి వరకూ 2.1 బిలియన్‌ డాలర్ల (రూ.15,365 కోట్లు) ఈ తరహా ఉపసంహరణలు జరిగాయి.  
    ఇక సోమవారం ప్రధాన దేశాల కరెన్సీలతో కూడా రూపాయి బలహీనపడింది. బ్రిటన్‌ పౌండ్‌ విషయంలో 95.28 నుంచి 95.41కి పడింది. యూరోలో 84.96 నుంచి 85.43కి జారింది. జపాన్‌ యన్‌ 64.06 నుంచి  64.50కి పడింది.   

రూపాయి బలపడకపోవచ్చు: మూడీస్‌
విదేశీ పెట్టుబడులు పెరగడానికి ఇటీవల కేంద్రం ప్రకటించిన ఐదు సూత్రాల ప్రణాళిక రూపాయి బలోపేతానికి దోహదపడకపోవచ్చని అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ అంచనా వేసింది. ఈ చర్యలు ఫలితాన్ని ఇవ్వడానికి కొన్నాళ్లు పట్టే అవకాశం ఉండడమే తన అంచనాలకు కారణమని తెలిపింది.

భారత్‌ విదేశీ నిధులకు సంబంధించి అకౌంట్‌కు కేంద్ర చర్యలు క్రెడిట్‌ పాజిటివ్‌ అవుతాయే తప్ప రూపాయి బలోపేతానికి మాత్రం తక్షణం దోహదపడవన్నది తమ అంచనా అని తెలిపింది. కాగా ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం, కరెంట్‌ అకౌంట్‌ లోటు వంటి స్థూల ఆర్థిక అంశాలు సానుకూలంగా ఉన్నందున, రూపాయి బలహీనమైనా తక్షణ ప్రతికూలతలు ఏవీ ఉండబోవని విశ్లేషించింది. 

2019 జూన్‌ నాటికి 95 డాలర్లకు బ్రెంట్‌ క్రూడ్‌
బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిలించ్‌ అంచనా
నాలుగేళ్ల గరిష్ట స్థాయిని తాకిన చమురు ధర

ముంబై: అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ ధర 2019 జూన్‌ నాటికి 95 డాలర్లకు చేరే అవకాశం ఉందని ప్రపంచ ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ– బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిలించ్‌ (బీఆఫ్‌ఏఎంఎల్‌) విశ్లేషించింది. అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ ధర సోమవారం నాలుగు సంవత్సరాల గరిష్టస్థాయి 80.74ను తాకిన నేపథ్యంలో  బీఓఏ ఎంఎల్‌ తాజా విశ్లేషణ చేసింది. ఈ ఏడాది మే నెలలో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ ధర నాలుగేళ్ల గరిష్టం 80.50ని తాకింది. మళ్లీ సోమవారం ఈ స్థాయిని క్రూడ్‌ అధిగమించడం గమనార్హం. ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు దీనికి నేపథ్యం.  

భారత్‌ క్యాడ్‌పై ప్రభావం...
కాగా అంతర్జాతీయంగా క్రూడ్‌ ధరల పెరుగుదల భారత్‌ కరెంట్‌ అకౌంట్‌ లోటు (క్యాడ్‌)పై ప్రతికూల ప్రభావం చూపుతుందని బీఓఏ ఎంఎల్‌ విశ్లేషించింది. ‘‘2018–19లో 2.8 శాతానికి క్యాడ్‌ పెరిగే అవకాశం ఉంది. 2019–20లో ఇది 2.9 శాతంగా ఉంటుంది’’ అని విశ్లేషించింది. గతంలో ఇది 2.6 శాతంగా  ఉండొచ్చని ఈ సంస్థ అంచనా వేసింది.

ఈ ఏడాది ఇప్పటికే దాదాపు 13 శాతం పతనమైన రూపాయికి బీఓఏ ఎంఎల్‌ తాజా అంచనా ప్రతికూలమైనదే. ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌ఐఐ, ఎఫ్‌డీఐ, ఈసీబీలు మినహా ఒక దేశానికి వచ్చీ– పోయే విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర  వ్యత్యాసమే క్యాడ్‌. దీనిని సంబంధిత నిర్దిష్ట కాల స్థూల దేశీయోత్పత్తి విలువతో పోల్చి శాతాల్లో చూస్తారు. 2018–19 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌)     భారత్‌ క్యాడ్‌ జీడీపీలో 2.4 శాతం. విలువలో 15.8 బిలియన్‌ డాలర్లు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top