ఎన్‌ఎస్‌ఈ, ఎంసీఎక్స్‌ విలీన యోచన

NSE-MCX to merge businesses - Sakshi

ప్రాథమిక దశలో చర్చలు

అంగీకారం కుదిరితే ఈ నెలలో సెబీకి ప్రతిపాదన

ముంబై: ఈక్విటీలు, కమోడిటీ డెరివేటివ్స్‌ ట్రేడింగ్‌ లావాదేవీలు నిర్వహించేలా స్టాక్‌ ఎక్సే్చంజీలకు అనుమతి లభించడంతో ఈ విభాగంలో విలీనాలు, కొనుగోళ్లకు తెరతీసినట్లయింది. దిగ్గజ ఎక్సే్చంజీలు నేషనల్‌ స్టాక్‌ ఎక్సే్చంజీ (ఎన్‌ఎస్‌ఈ), మల్టీ కమోడిటీ ఎక్సే్చంజీ (ఎంసీఎక్స్‌) విలీన యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఇరు సంస్థల మధ్య చర్చలు ప్రాథమిక స్థాయిలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇవి ఫలవంతమైతే.. ఈ నెలలోనే మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ముందు విలీన ప్రతిపాదన ఉంచే అవకాశముందని వివరించాయి. స్టాక్‌ ఎక్సే్చంజీలు ఈక్విటీలతో పాటు కమోడిటీస్‌ ట్రేడింగ్‌ లావాదేవీలు కూడా నిర్వహించేలా అక్టోబర్‌ నుంచి యూనివర్సల్‌ ఎక్సే్చంజ్‌ విధానం అమల్లోకి రానున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇప్పటికే ఇరు సంస్థలు విలీన ప్రతిపాదన బ్లూప్రింట్‌ సిద్ధం చేసినట్లు, దీన్ని సెబీతో చర్చించనున్నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. ఈ డీల్‌ సాకారమైతే ఈక్విటీలు, కమోడిటీ డెరివేటివ్స్‌ విభాగాల్లో విలీన సంస్థ ఆధిపత్య హోదా దక్కించుకునే అవకాశం ఉంటుంది. అయితే, రెండు సంస్థలూ దీనిపై స్పందించలేదు.

ఈక్విటీలు, కమోడిటీల్లో గుత్తాధిపత్యం..
ఈక్విటీ డెరివేటివ్స్‌ విభాగంలో ఎన్‌ఎస్‌ఈకి దాదాపు గుత్తాధిపత్యమే ఉంది. అలాగే కమోడిటీ డెరివేటివ్స్‌ విభాగంలో ఎంసీఎక్స్‌కు 90 శాతం వాటా ఉంది.  ప్రస్తుతం ఈక్విటీ డెరివేటివ్స్‌ విభాగంలో అగ్రస్థానంలో ఉన్న ఎన్‌ఎస్‌ఈ.. కమోడిటీ సెగ్మెం ట్‌లో కూడా పట్టు సాధించాలనుకుంటోంది. ఈ దిశగానే ఎంసీఎక్స్‌వైపు చూస్తోంది. ప్రస్తుతం ఎంసీఎక్స్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ. 3,700 కోట్లుగా ఉండగా, 2016 నాటి లెక్కల ప్రకారం ఎన్‌ఎస్‌ఈ అనేక రెట్లు అధికంగా రూ. 40,000 కోట్ల స్థాయిలో ఉంది.

రెండింటికీ ప్రయోజనమే
అక్టోబర్‌ అనంతరం మిగతా స్టాక్‌ ఎక్సే్చంజీలన్నీ కూడా కొత్త విభాగాల వైపు దృష్టి సారించడం వల్ల పోటీ తీవ్రమవుతుంది కనుక... ప్రస్తుత దశలో విలీన డీల్‌ ఇరు సంస్థలకు ప్రయోజనకరమేనన్నది మార్కెట్‌ విశ్లేషకుల అభిప్రాయం.  బీఎస్‌ఈ ఇప్పటికే కమోడిటీ డెరివేటివ్స్‌ విషయంలో దూకుడుగా ఉంది. తమ మెంబర్‌షిప్‌తో కమోడిటీ డెరివేటివ్స్‌ ట్రేడింగ్‌ చేసే సభ్యులకు ప్రోత్సాహకాలు కూడా ఇస్తామంటోంది. ఎన్‌ఎస్‌ఈ కూడా కమోడిటీల ప్రణాళికను సిద్ధం చేసినప్పటికీ.. వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.

ఇలా కీలకమైన రెండు స్టాక్‌ ఎక్సే్చంజీలు కమోడిటీ డెరివేటివ్స్‌లోకి దిగుతుండటంతో ఎంసీఎక్స్‌కు తీవ్రమైన పోటీ ఎదురుకాక తప్పదు. అత్యంత మెరుగైన టెక్నాలజీ, గణనీయంగా క్లయింట్స్‌ ఉన్నప్పటికీ పోటీని తట్టుకుని ఈక్విటీస్‌ విభాగంలోకి దూసుకెళ్లాలంటే ఎంసీఎక్స్‌కి తగినంత ఆర్థిక వనరులు కావాల్సి ఉంటుంది. కాగా విలీన వార్తల నేపథ్యంలో ఎంసీఎక్స్‌ షేర్లు బీఎస్‌ఈలో సుమారు 14 శాతం లాభపడి రూ. 819 వద్ద ముగిశాయి. ఇంట్రాడేలో సుమారు 16 శాతం ఎగిసి రూ. 833 స్థాయిని తాకాయి. అటు ఎన్‌ఎస్‌ఈలో 14 శాతం పెరిగి రూ. 818 వద్ద క్లోజయ్యాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top