బడ్జెట్‌లో తీపి కబురు ఉండేనా..?

Finance Minister Nirmala Sitharaman Who Will Set the Stage For Reforms - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2019-20 ఆర్ధిక సంవత్సరానికి జులై 5న ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ మోదీ సర్కార్‌ తదుపరి ఐదేళ్లకు రోడ్‌మ్యాప్‌లా ఉంటుందని భావిస్తున్నారు. నరేంద్ర మోదీ సారధ్యంలో బీజేపీ ప్రభుత్వానికి ఓటర్లు మరోసారి పట్టం కట్టిన నేపథ్యంలో బడ్జెట్‌లో ప్రజలకు ఊరట కల్పించే అంశాలు పొందుపరుస్తారా అనే ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితిని ప్రస్తుత రూ 2.5 లక్షల నుంచి రూ 5 లక్షలకు పెంచుతారని అంచనాలున్నాయి.

లోక్‌సభ ఎన్నికలకు ముందు మధ్యంతర బడ్జెట్‌లో అప్పటి ఆర్థిక మంత్రి రూ 5 లక్షల వరకూ పూర్తిగా పన్ను రిబేటును ప్రకటించినా, ఆదాయ పన్ను శ్లాబ్‌ల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ఆదాయ పన్ను మినహాయింపుకు వార్షికాదాయ పరిమితి రూ 2.5 లక్షల శ్లాబును అలాగే ఉంచారు. 2014 నుంచి ఈ శ్లాబులో ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం. రూ 2.5 లక్షల నుంచి రూ 5 లక్షల ఆదాయానికి పన్ను రేటును 10 శాతం నుంచి 5 శాతానికి తగ్గించినా రూ 5 లక్షల నుంచి రూ 10 లక్షల లోపు ఆదాయానికి పన్ను రేటును ఏకంగా 20 శాతంగా నిర్ధారించారు.

ఇక తాజా బడ్జెట్‌లో పన్ను శ్లాబ్‌ల్లో హేతుబద్ధత పాటించడంతో పాటు వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ 2.5 లక్షల నుంచి రూ 3 లక్షలకు పెంచవచ్చని భావిస్తున్నారు. అయితే సెక్షన్‌ 87(ఏ) కింద రూ 5 లక్షల వరకూ వార్షికాదాయంపై పూర్తి పన్ను మినహాయింపును ఆర్థిక మం‍త్రిత్వ శాఖ ప్రకటించడంతో కనీస వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితిని రూ 2.5 లక్షల నుంచి పెంచకపోవచ్చని మరో అంచనా వెల్లడవుతోంది. తాజా బడ్జెట్‌లో బేసిక్‌ ఇన్‌కం ట్యాక్స్‌ పరిమితిని రూ 2.5 లక్షలు యథాతథంగా ఉంచితే వేతన జీవులు, పన్నుచెల్లింపుదారులకు తీవ్ర నిరాశ ఎదురవనుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top