కాప్రికార్న్‌ ఐపీఓకు సెబీ గ్రీన్‌ సిగ్నల్‌

Capricorn Food gets SEBI nod to launch IPO - Sakshi

ఇష్యూ సైజ్‌ రూ.400–600 కోట్ల రేంజ్‌లో

న్యూఢిల్లీ: కాప్రికార్న్‌ ఫుడ్‌ ప్రొడక్ట్స్‌ ఇండియా కంపెనీ ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌)కు మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ ఆమోదం తెలిపింది. ఈ ఐపీఓలో భాగంగా ఈ కంపెనీ రూ.171 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తుంది. అంతేకాకుండా ప్రస్తుత వాటాదారుల నుంచి 76.43 లక్షల షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) విధానంలో ఆఫర్‌ చేస్తుంది.

ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.400–600 కోట్ల రేంజ్‌లో నిధులు సమీకరిస్తుందని అంచనా. రుణ భారం తగ్గించుకోవడానికి, సాధారణ వ్యాపార అవసరాలకు ఈ ఐపీఓ నిధులను వినియోగించుకోవాలని చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీ యోచిస్తోంది. ఈ ఐపీఓకు మర్చంట్‌ బ్యాంకర్లుగా ఐఐఎఫ్‌ఎల్‌ హోల్డింగ్స్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌లు వ్యవహరిస్తున్నాయి.  

1998లో ఆరంభమైన కాప్రికార్న్‌ ఫుడ్‌ కంపెనీ.. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా–పసిఫిక్, ఆఫ్రికా, పశ్చిమాసియా దేశాల్లోని తన క్లయింట్లకు సేవలందిస్తోంది. దేశీయంగా పండ్లు, కూరగాయల ఆధారిత ఇన్‌గ్రెడియంట్లను కోక–కోలా, వరుణ్‌  బేవరేజెస్, మన్‌పసంద్‌ బేవరేజెస్‌ తదితర సంస్థలకు సరఫరా చేస్తోంది. ఈ కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో రూ.461 కోట్ల ఆదాయంపై రూ.23 కోట్ల నికర లాభం సాధించింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top