
జిల్లాలో ప్రజాభిమానాన్ని కోల్పోయిన అధికార పార్టీ కుట్ర రాజకీయాలకు తెగబడుతోంది. ముఖ్యంగా వైఎస్సార్‌సీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో పార్టీ సానుభూతిపరుల ఓట్లు వారికి తెలియకుండానే తొలగించే యత్నాలు ముమ్మరంగా సాగిస్తున్నారు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో ఆ పార్టీ ఓట్లను సదరు పార్టీ పోలింగ్ బూత్ కన్వీనర్లే తొలగించమని కోరినట్లు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేస్తూ గందరగోళానికి తెర తీశారు. దీనిపై వైఎస్సార్‌సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేస్తే, బాధితులనే వేధించాలని మరో వైపు పోలీసుల ద్వారా ఒత్తిళ్లు పెంచారు. జిల్లాలో ఇప్పటి వరకు ఓట్లకు సంబంధించి 1.77 లక్షల దరఖాస్తులు రాగా వాటిలో ఫారం–7 దరఖాస్తులే 31 వేల పైచిలుకు ఉండడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులు, అభిమానులు, కార్యకర్తల ఓట్లు తొలగింపే లక్ష్యంగా అధికార పార్టీ కుతంత్రాలు చేస్తోంది. ఆ పార్టీ కార్యకర్తల పేర్లతో అధికార పార్టీ నాయకులు ఫారం–7 బోగస్ దరఖాస్తులు చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ఓట్లు తొలగించే విధంగా దరఖాస్తులు చేస్తూ తిరిగి వారిపైనే కేసులు బనాయిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 20 కేసులు నమోదు చేయగా అనేక చోట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్‌ను విచారణ పేరుతో పిలుస్తూ వారి నుంచి రకరకాల స్టేట్‌మెంట్లు తీసుకుంటున్నారు. కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ అధికార పార్టీ నేతలు పోషిస్తే పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారు. అధికార పార్టీ చేస్తున్న గందరగోళంపై ఓటర్లు అందోళన చెందుతున్నారు.
31,067 ఫారం–7 దరఖాస్తులు
జిల్లాలో ఇప్పటి వరకు ఫారం–6, ఫారం–7 పేరిట 1,77,887 దరఖాస్తులు వచ్చాయి. అయితే ఇందులో ఫారం–7 దరఖాస్తులు 31,067 వేలు ఉండడం గమనార్హం. వచ్చిన దరఖాస్తుల్లో ఇప్పటి వరకు 90 వేలు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ నెల 7వ తేదీలోపు వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఓటమి భయం పట్టుకున్న అధికార పార్టీ ఏదో విధంగా వైఎస్సార్‌సీపీ దెబ్బ కొట్టాలని కుట్రలు పన్నుతోంది. అందులో భాగంగా ఓట్ల తొలగింపు కుట్రలు చేస్తోంది. ‘మొగుడ్ని కొట్టి మొగసాలికెక్కినట్లు’ వైఎస్సార్‌సీపీ ఓట్లు తొలగించి మా ఓట్లు తొలగించారంటూ టీడీపీ నేతలు కేసులు నమోదు చేయిస్తున్నారు.
వైఎస్సార్‌సీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇంత వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అధికార పార్టీ నాయకులు చెప్పడంతో రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగి కేసులు నమోదు చేస్తున్నారు. కావలి, ఆత్మకూరు, సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లో ఫారం–7 దరఖాస్తులు అధికంగా వచ్చాయి. క్షేత్రస్థాయిలో పరిశీలించే సిబ్బంది అధికార పార్టీకి అనుకూలంగా నివేదికలు ఇస్తున్నట్లు సమాచారం. ఎన్నికల సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి ఫారం–7 దరఖాస్తులు వాస్తవమేనని నివేదికలు సమర్పిస్తే జిల్లా వ్యాప్తంగా 50 వేలకుపైగా ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఉంది. జాబితాలో పేర్లు ఉన్నాయో లేవో పరిశీలించి దరఖాస్తులు చేసుకోవడానికి సమయం పడుతుంది. ప్రజలు 1950కి ఫోన్ చేసి ఓటర్ గుర్తింపు కార్డుపై ఉండే నంబర్ చెబితే ఓటు ఉందో లేదో తెలియజేస్తారు. కావలి నియోజకవర్గంలో 4,862, ఆత్మకూరు 3,399, సర్వేపల్లి 2,378, గూడూరు 7,153, సూళ్లూరుపేట 3,937, వెంకటగిరి 2,642 ఫారం–7 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటి వరకు 19 వేల ఫారం–7 దరఖాస్తులను పరిశీలించారు.
20 కేసుల నమోదు
వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఫిర్యాదు ఇస్తే పరిశీలించి పక్కన పెట్టడం తీవ్ర ఒత్తిడి వస్తే మతిస్థిమితం లేని వ్యక్తిపై కేసు నమోదు చేయడం, అదే ప్రతిపక్ష పార్టీ ఫిర్యాదులు, అధికారుల ఫిర్యాదులు ఇస్తే వైఎస్సార్‌సీపీ వారిని విచారణకు పిలిచి హడావుడి చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఫాం–7 పేరుతో 20 కేసులు నమోదయ్యాయి. వ్యక్తికి సంబంధం లేకుండా వ్యక్తి పేరుతో ఓట్లు తొలగించాలంటే ఫారం–7 కింద దరఖాస్తు చేయాలి. జిల్లాలో ఇప్పటి వరకు అలాంటివి 31 వేల పైచిలుకు దరఖాస్తులు అందాయి. వీటిని క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించి ఎన్నికల కమిషనర్‌కు నివేదిక ఇచ్చిన తదనంతరం వారి ఆదేశాల అనుగుణంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పటి వరకు జిల్లాలో కావలి సబ్‌డివిజన్లో 6, నెల్లూరు రూరల్ సబ్ డివిజన్లో 3 గూడురు సబ్ డివిజన్లో 3, ఆత్మకూరు సబ్ డివిజన్లో 8 కేసులు నమోదయ్యాయి. మంగళవారం గూడూరులో ఆరుగురు వైఎస్సార్‌సీపీ క్యాడర్‌ను విచారణకు స్టేషన్‌కు పిలిచారు.
ఫారం–7 దరఖాస్తులపై డీఎస్పీ విచారణ
పొదలకూరు: మండలంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తల పేర్లపై ఆన్‌లైన్‌లో సమర్పించిన ఫారం–7 ఓట్ల తొలగింపు దరఖాస్తులపై నమోదైన కేసులో ఆత్మకూరు డీఎస్పీ వెంకటాద్రి బుధవారం విచారణ చేపట్టారు. ఈ కేసులో ఉన్న 33 మందిని ఆత్మకూరు డీఎస్పీ కార్యాలయానికి పిలిపించుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. అనంతరం సంబంధిత వ్యక్తుల ద్వారా స్టేట్‌మెంట్ రికార్డులు చేశారు. ఈ సందర్భంగా ఫారం –7 దరఖాస్తులు తమ పేర్లపై దాఖలు అయినప్పటికీ తమకు ఎలాంటి సంబంధం లేదని, వీఆర్వో సమాచారం అందించేంత వరకు తమకు తెలియదని వైఎస్సార్‌సీపీ గ్రామస్థాయి నాయకులు డీఎస్పీకు అందజేసిన స్టేట్‌మెంట్‌లో వెల్లడించినట్టు సమాచారం.