అలాంటి మాటలను పట్టించుకోను | Sakshi
Sakshi News home page

సింహగిరిలో మహిళా దినోత్సవ వేడుకలు

Published Mon, Mar 9 2020 4:04 PM

Sanchaita Gajapathi Raju Says She Like Hinduism - Sakshi

సాక్షి, సింహాచలం(పెందుర్తి): మహిళా శక్తిని చాటి చెబుదామని సింహాచలం దేవస్థానం చైర్‌పర్సన్‌ పూసపాటి సంచయిత గజపతిరాజు పిలుపునిచ్చారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో తొలిసారిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆదివారం నిర్వహించారు. అడవివరానికి చెందిన పలువురు మహిళలు, సింహాచలం దేవస్థానంలో పని చేస్తున్న మహిళా ఉద్యోగులు, పారిశుద్ధ్యం, సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తున్న మహిళలు, భక్తులతో కలసి సంచయిత గజపతిరాజు వేడుకలు జరుపుకున్నారు. తొలుత కొండదిగువ మహిళా వ్యాపారులను ఆప్యాయంగా పలకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొండ దిగువ తొలిపావంచా వద్ద ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. బీపీ, సుగర్‌ తదితర పరీక్షలను చేయించుకున్నారు.

దర్శనం క్యూలో వెళ్తున్న సంచయిత గజపతిరాజు 

మెట్లమార్గంలో నడుచుకుంటూ వెళ్లి..
మహిళలు ఆరోగ్యవంతంగా ఉంటేనే ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని, ఆరోగ్యంపై అశ్రద్ధ చేయవద్దని సూచించారు. దేవస్థానం తరఫున నెలకొకసారైనా వైద్య శిబిరాలు ఏర్పాటుకు ప్రయత్నం చేస్తామన్నారు. అక్కడి నుంచి ఆమె తొలిపావంచా వద్ద స్వామికి కొబ్బరికాయ కొట్టి మెట్లమార్గంలో నడిచి వెళ్లి సింహగిరికి చేరుకున్నారు. నృసింహ మండపంలో దేవస్థానం మహిళా ఉద్యోగులు, పారిశుద్ధ్య సిబ్బంది,  సెక్యూరిటీ గార్డులు ఆమెకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి సాధారణ భక్తుల క్యూలో వెళ్లి స్వామిని దర్శించుకున్నారు. క్యూల్లో వేచి ఉన్న భక్తులను పలకరించారు. తర్వాత స్థానిక వీఐపీ కాటేజీ ప్రాంగణంలో మహిళలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. (నాడు టీడీపీ ట్రస్టు బోర్డుగా మన్సాస్‌!)


వైద్య పరీక్షలు చేయించుకుంటున్న సంచయిత

సంప్రదాయాలను గౌరవించడమే కాదు ఫాలో అవుతా..
మహిళగా సేవ చేసేందుకు ముందుకు వచ్చినప్పుడు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, అలాంటి మాటలను పట్టించుకోనన్నారు. తనకు హిందూ ఇజం అంటే చాలా ఇష్టమన్నారు. అనాదికాలం నుంచి పంచ భూతాలనన్నింటినీ పూజించే సంప్రదాయం మనదన్నారు. ఈరోజు ఓ హిందువుగా తనకు దేవస్థానం చైర్‌పర్సన్‌ అవకాశం వచ్చిందన్నారు. సంప్రదాయాలను గౌరవిస్తానని, ఆలయాల్లో ఏ సంప్రదాయం ఉందో.. దానినే అనుసరిస్తానని స్పష్టం చేశారు. దేవస్థానాన్ని మంచిగా అభివృద్ధి చేస్తున్నామా.. భక్తుల సమస్యలు పరిష్కరిస్తున్నామా.. ఉద్యోగులకు సౌకర్యాలు కల్పిస్తున్నామా.. తదితర అంశాలపై తన దృష్టి ఉందన్నారు. అభివృద్ధి అనేది సమష్టి కృషి అని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అనంతరం మహిళా ఉద్యోగులు, సిబ్బందికి చీరలు అందజేశారు. ఈ సమావేశంలో దేవస్థానం ఈవో ఎం. వెంకటేశ్వరరావు, స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ట్రస్ట్‌ బోర్డు సభ్యులు సూరిశెట్టి సూరిబాబు, సిరిపురపు ఆశాకుమారి పాల్గొన్నారు. (బాబాయ్‌ ఇలా మాట్లాడతారా?: సంచయిత భావోద్వేగం)

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement