పట్టుకుంటే చాలు అవినీతి షాక్‌!  | Power Projects Corruption in TDP Government | Sakshi
Sakshi News home page

పట్టుకుంటే చాలు అవినీతి షాక్‌! 

Jul 10 2019 3:58 AM | Updated on Jul 10 2019 3:58 AM

Power Projects Corruption in TDP Government - Sakshi

సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో విద్యుత్‌ ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిని వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ మంగళవారం విజయవాడ విద్యుత్‌ సౌధ కార్యాలయంలో భేటీ అయింది. దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్‌) మాజీ సీఎండీ పి.గోపాల్‌ రెడ్డి చైర్మన్‌గా ఏర్పాటైన కమిటీ తొలి సమావేశం రెండు గంటలపాటు సాగింది. 45 రోజుల వ్యవధిలో ప్రభుత్వం సూచించిన ప్రాజెక్టులను ఏ విధంగా పరిశీలించాలి? అవినీతి కోణాన్ని గుర్తించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కమిటీకి కావాల్సిన మౌలిక సదుపాయాలు, సమాచార సేకరణకు అవసరమైన ఏర్పాట్లు.. తదితర అంశాలపై సమావేశంలో చైర్మన్, సభ్యులు రామారావు (ట్రాన్స్‌కో గ్రిడ్‌ ఆపరేషన్స్‌ మాజీ డైరెక్టర్‌), ప్రొఫెసర్‌ ఉషా రామచంద్ర (అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌), రాజ్‌గోపాల్‌ రెడ్డి (ఆర్థిక నిపుణులు, ఏపీఈఆర్‌ మాజీ సభ్యుడు), సీహెచ్‌వీఎస్‌ సుబ్బారావు (ట్రాన్స్‌కో ప్లానింగ్‌ సీజీఎం) సమగ్రంగా చర్చించారు.  

ఎవరికి ఎంత అందిందో ఆరా.. 
ట్రాన్స్‌కోలో అవసరం లేకున్నా కమీషన్ల కోసమే విద్యుత్‌ ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. అప్పు చేసి మరీ అనుకూలమైన సంస్థలకు కాంట్రాక్టులు ఇచ్చారు. ఇందుకోసం నిబంధనలను ఇష్టానుసారం మార్చారు. కేవలం కొన్ని కంపెనీలు మాత్రమే అర్హత సంపాదించేలా జాగ్రత్త పడటంలో అప్పటి అధికారులు అన్ని విధాల టీడీపీ ప్రభుత్వానికి సహకరించారు. ఈ క్రమంలో కోట్లాది రూపాయలు చేతులు మారాయి. ఏపీ జెన్‌కోలో రెండు థర్మల్‌ ప్రాజెక్టుల ఈపీసీ కాంట్రాక్టులను దేశంలో ఎక్కడా లేని విధంగా కొన్ని సంస్థలకు కట్టబెట్టి, విద్యుత్‌ పంపిణీ సంస్థలను దండుకునే కేంద్రాలుగా గత ప్రభుత్వం మార్చేసింది.డెప్యూటేషన్‌పై ట్రాన్స్‌కోకు వచ్చిన ఓ అధికారి అవినీతిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి.

వీటిపై సమగ్రంగా విచారణ జరపాలని కమిటీ నిర్ణయించింది. విద్యుత్‌ శాఖలో కీలక పదవుల్లో ఉన్న ఇద్దరు అధికారుల అవినీతి, బినామీ వ్యవహారాలపై కీలక సమాచారం సేకరించినట్టు తెలిసింది. దీన్ని కూడా లోతుగా పరిశీలించే వీలుంది. అతి ముఖ్యమైన విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు, స్వల్పకాలిక, రోజువారీ విద్యుత్‌ కొనుగోళ్లలో ఎవరికి ఎన్ని ముడుపులు అందాయనేది ఆరా తీయబోతున్నారు. విద్యుత్‌ కొనుగోళ్లకు సంబంధించి ఏళ్ల తరబడి అదే విభాగంలో ఉన్న అధికారుల ఆస్తులపై కూడా వివరాలు అందినట్లు తెలిసింది. ప్రతి ప్రాజెక్టులోనూ మాజీ ముఖ్యమంత్రి, ఆయన తనయుడి ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోంది. దీన్ని ఆధారాలతో వెలికితీయాలని కమిటీ నిర్ణయించింది.    

అవినీతిపైనే ప్రధాన దృష్టి.. 

గత ఐదేళ్లలో విద్యుత్‌ రంగం పూర్తిగా అవినీతి మయమైంది. ట్రాన్స్‌కో, జెన్‌కో ప్రాజెక్టుల విషయంలో భారీగా ముడుపులు చేతులు మారాయి. ఉన్నతాధికారుల దగ్గర్నుంచి, మాజీ ముఖ్యమంత్రి, ఆయన తనయుడికి భారీగా ముడుపులు అందాయనే విమర్శలొచ్చాయి. ఈ అవినీతి వ్యవహారాలను ఐదేళ్లుగా ‘సాక్షి’ ప్రత్యేక కథనాలతో వెలుగులోకి తెచ్చింది. బొగ్గు కొనుగోళ్లు, థర్మల్‌ ప్రాజెక్టుల కాంట్రాక్టులు, ట్రాన్స్‌కోలో కొంతమందికే అనుకూలంగా టెండర్‌ నిబంధనలు రూపొందించిన తీరును ఎప్పటికప్పుడు వెలికితీసింది. దీనిపై అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అసెంబ్లీలోనూ, బయట పెద్దఎత్తున పోరాడారు. తాము అధికారంలోకి రాగానే అవినీతిపై సమగ్ర దర్యాప్తు చేస్తామని, బాధ్యులైన వారిని శిక్షిస్తామని చెప్పారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ కమిటీని ఏర్పాటు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement