
జోరువాన
జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం జడి వాన కురిసింది.
జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం జడి వాన కురిసింది. వర్షాభావంతో అల్లాడుతున్న రైతాంగానికి ఈ వర్షం ఊరట కలిగింది. ఈ ఏడాది ఇక వర్షాలు రావు.. అంతా అయిపోయిందనుకుంటున్న సమయంలో వరుణుడు కరుణించాడు. మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. కనీసం ఈ పాటి వర్షం కూడా కురవకుంటే రానున్న రోజుల్లో మరింత గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉండేది.
చిత్తూరు (అర్బన్) : జిల్లాలో ఈ సారి ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవడం అంద రినీ కలచివేసింది. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా దాదాపు 1.57 లక్షల హెక్లార్లలో వేరుశెనగ పంట నీళ్లు లేకుండా ఎండిపోయే పరిస్థితికి వచ్చింది. మూడు రోజులుగా జిల్లాలోని చౌడేపల్లె, ఎస్‌ఆర్.పురం మండలాల్లో కొన్ని గ్రామాలు మినహా ఆశించిన స్థాయిలో వర్షాలు పడుతున్నాయి. దీంతో అన్ని వర్గాల నుంచి కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటికే చేతికందే పరిస్థితిలో ఉన్న లక్ష హెక్లార్లలోని వేరుశెనగ పంటకు తాజాగా కురుస్తున్న వర్షాలు ఎంతో మేలును చేకూర్చనుంది. దిగుబడి తగ్గినా మొత్తం పంటలో వచ్చే కాయలు రైతులకు కాస్త ఆర్థిక పరిపుష్టిని కలిగించనుంది. అలాగే మామిడి కోత పూర్తయిన నేపథ్యంలో చెట్ల మనుగడకు ఇప్పుడు పడుతున్న వర్షాలు బతుకునిస్తున్నాయి. ఒకేసారి కుండపోతగా కాకుండా ఓ మోస్తరుగా పడుతున్న వర్షాలు భూమిలో నీళ్లను ఇంకేలా చేస్తున్నాయి. అపాయకర పరిస్థితుల్లో ఉన్న భూగర్భ జలమట్టం పెరుగుతాయనే ఆశలు కలుగుతున్నాయి. శుక్రవారం బంగారుపాళెంలో అత్యధికంగా 112 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. దాదాపు రెండేళ్ల తరువాత ఈ తరహా వర్షపాతం నమోదయింది.
అన్ని పంటలకూ అనుకూలం...
జిల్లాలో కురుస్తున్న వర్షాలు ప్రస్తుతం ఉన్న పంటలతో పాటు సాగుచేయనున్న పంటలకు సైతం అనుకూలంగా మారింది. ఉద్యానవన పంటలకు ఈ పాటి వర్షాలు పంటల ఆయుష్షును పెంచనుంది. అలాగే చెరకు, కూరగాయలు వేయడానికి అనుకూల పరిస్థితులను కల్పించినట్లయింది. దీంతో పాటు ప్రత్యామ్నాయ పంటలైన జొన్నలు, కందులు, ఉద్దులు, పెసలు, ఉలవలు, అనప పంటల్ని సైతం ఈపాటి వర్షానికి విత్తుకోవచ్చని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా జిల్లాలో కురుస్తున్న వర్షాలు ప్రజలకు, రైతులకు ఊపిరి పోసినట్లయింది.
తిరుమలలో భారీ వర్షం
సాక్షి, తిరుమల : తిరుమలలో శుక్రవారం కూడా భారీ వర్షం కురిసింది. సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు రెండు గంటలపాటు వర్షం కురిసింది. ఆలయ ప్రాంతం వర్షపు నీటితో నిండింది. భక్తులు తడుస్తూ వెళ్లడం కని పించింది. వర్షం వల్ల రెండో ఘాట్‌రోడ్డు లో చివరి ఐదు మలుపుల్లో అక్కడక్కడా కొండచరియలు విరిగిపడ్డాయి.