
సాక్షి, విజయవాడ: చంద్రబాబు విశాఖలో ప్రజల భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారని వైఎస్సార్‌సీపీ నేత, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖలో పరిస్థితులు పరిష్కర దశలో ఉండంగా చంద్రబాబు సమస్యలు సృష్టిస్తున్నారని అన్నారు. 2017లో ఎల్‌జీ పాలీమర్స్ విస్తరణకు అనుమతులు ఇచ్చిందే చంద్రబాబు అని మండిపడ్డారు. ఎల్‌జీ పాలిమర్స్‌పై చిన్న కేసులు పెట్టారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు.
ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదికలు ఇవ్వగానే, వాటికి అనుబంధంగా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారనే విషయం బాబుకు తెలియంది కాదన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు తీరు మార్చుకోవాలని ఆయన హితవు పలికారు. ఈ రోజు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రూ.కోటి పరిహారం ఇస్తూ ఆదర్శంగా నిలిచారని ఆయన తెలిపారు. విశాఖ సమస్య పరిష్కారానికి సీఎస్తో సహా ప్రభుత్వ యంత్రాంగమంతా అక్కడే ఉండి సమీక్షిస్తున్నారని మహమ్మద్ ఇక్బాల్ తెలిపారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడు కమిటీ సమస్యలు సృష్టించి, ప్రజల్ని ఆందోళన వైపు రెచ్చగొడుతున్నారని ఆయన మండిపడ్డారు.